ఢిల్లీ చేరిన రిజర్వేషన్ పంచాయతీ!
Publish Date:Jul 23, 2025
Advertisement
తెలంగాణలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరవలసిన అనివార్యత నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ హామీని ఎలా నిలుపుకోవాలన్న విషయంలో తర్జన భర్జన పడుతోంది. నిజానికి.. ఆర్డినెన్సు రూట్లో కానీ మరో మార్గంలో కానీ ఇప్పటికిప్పుడు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం అయ్యేపని కాదని అందరికీ తెలిసినట్లే.. హస్తం పార్టీ పెద్దలకు కూడా తెలుసు. అయినా.. రాజకీయ ప్రయోజనాల కోసం,మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల గండం గట్టేక్కేందుకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజానికి.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో నిర్వహించవలసి ఉన్నా.. రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. రాష్ట్ర హై కోర్టు మూడు నెలల లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని గడవు విధించడంతో.. తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమైంది. అయితే.. అసెంబ్లీఎన్నికల సందర్భంగా స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎన్నికలకు పోతే ఏమి జరుగుతుందో అన్న సందేహంతో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు దారులు వెతుకుతోంది. అందులో భాగంగా.. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లును, పార్లమెంట్ ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. అయితే.. కేంద్రం నుంచి స్పందన లేక పోవడంతో, ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ఆర్డినెన్సును గవర్నర్ కు పంపింది. అయితే.. అటు నుంచి కూడా స్పందన లేక పోవడంతో ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ శాసన సభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తేవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే.. ఈ విషయాన్ని అధిష్టానం చెవిన వేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రు లు, ఇతర నేతలతో కూడిన రాష్ట్ర బృందం ఢిల్లీకి వెళ్లనుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి అన్ని పార్టీల మద్దతు కూ డగట్టేందుకు ఈ బృందం హస్తినకు వెడుతోందని చెప్పారు. తమ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు కూడా తమతో కలిసి వస్తారని పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలను కలిసి వచ్చే పార్టీల అధ్యక్షులకు వివరించి, ఆ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు కూడగడతామని చెప్పారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన బిల్లు ముందస్తు న్యాయ సమీక్ష లేకుండా, రాజ్యాంగంలోని 9 షెడ్యూలులో చేర్చడం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు మరో మారు స్పష్టం చేశారు. కేశవ భారతి కేసులో సుప్రీం కోర్టు 1973 లోనే.. రాజ్యాంగంలో 9 షెడ్యూలలో చేర్చిన ఏ అంశం అయినా న్యాయసమీక్షకు లోబడే ఉంటుదని స్పష్టం చేసిన విషయాన్ని రామచంద్ర రావు గుర్తు చేశారు. అలాగే.. 2007లో ఐఆర్ కోయెల్లో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు అదే విషయన్ని మరోమారు స్పష్టం చేసిందనీ, అందుకే తమిళనాడు రిజర్వేషన్ అంశం ఇప్పటికి కోర్టులో ఉందనీ, ఈ విషయం తెలిసీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను మోసం చేస్తోందని రామచంద్ర రావు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన బీసీ రిజర్వేషన్ అంశం ముగింపు ఎలా ఉంటుంది అనేది ఆసక్తికంగా మారింది.
http://www.teluguone.com/news/content/congress-team-to-delhi-39-202543.html





