క్యా సీన్ హై?
Publish Date:Nov 18, 2025
Advertisement
హైదరాబాద్ ప్రగతి, పురోగతిలో చంద్రబాబు ముద్ర చెరిపివేయలేనిదని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. అయితే రాజకీయ కారణాలతో ఆ విషయాన్ని బాహాటంగా చెప్పడానికి ఇష్టపడరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు దూరదృష్టితో చెప్పిన మాటలకు వక్రభాష్యం చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలన్న చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తనకు రెండు కళ్లు వంటివన్నారు. ఆ మాటలకు వక్రభాష్యం చెప్పి చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అంటూ ప్రచారం చేశారు. రాష్ట్ర విభజన తరువాత కూడా అవసరమైన, అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సెంటిమెంటును బయటకు తీసి.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పతనమై రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర సహకార భావన ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. అయితే.. ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు, విభజన సమస్యల పరిష్కారం విషయాలు పూర్తిగా కొలిక్కిరాకపోవడంతో తెలంగాణ వాదం ఒక సెంటిమెంటుగా ఇంకా సజీవంగా ఉంది. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికీ అవకాశం ఉన్నా లేకున్నా.. ఆంధ్రా బూచి అంటూ తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ మనుగడ కాపాడుకోవాలనీ, ఉనికి చాటుకోవాలనీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశంతో జట్టు కట్టేందుకు ఆ పార్టీలు ఒకింత జంకుతున్న పరిస్థితి ఉంది. చివరాఖరికి బీజేపీ కూడా తెలంగాణలో తెలుగుదేశంతో చెట్టాపట్టాలేసుకు తిరగడం సంగతి అటుంచి.. అలాంటి పరిస్థితి ఉందన్న భావన కూడా తెలంగాణ ప్రాంతంలో కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం అత్యంత కీలక భాగస్వామి. అయినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తెలుగుదేశంకు దూరం మెయిన్ టైన్ చేస్తున్నది. అందుకు తాజా ఉదాహరణే ఇటీవలి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తెలుగుదేశం మద్దతు కోరకపోవడమే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో వేదిక పంచుకోవడం, ఆయనతో కలివిడిగా మాట్లాడటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ ముచ్చట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామోజీ రావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. దీంతో చంద్రబాబు గతంలో చెప్పినట్లు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగువారిగా కలిసి ఉందా. కలిసి రెండు రాష్ట్రాలనూ అభివృద్ధి చేసుకుందాం అన్న మాటల ఇప్పుడు మరో సార బలంగా రెండు రాష్ట్రాలలోనూ వినిపిస్తున్నాయి. ఆ దిశగా రెండు రాష్ట్రాలూ ముందుకు సాగుతాయన్న ఆశాభావాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలలో కలిగించాయి.
http://www.teluguone.com/news/content/cbn-and-revanth-side-by-side-45-209684.html





