Read more!

వెనక్కి తగ్గారా.. వదిలించుకున్నారా! కమలానికి వకీల్ సాబ్ కటీఫేనా?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ-జనసేన మధ్య రాజీ కుదిరింది. తిరుపతి నుంచి తామే పోటీ చేస్తామని పట్టుబట్టిన జనసేన చివరకు వెనక్కి తగ్గింది. బీజేపీ అభ్యర్థికే మద్దతు తెలిపింది. సోము వీర్రాజు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యామని, తిరుపతిలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్ రావు అధికారికంగా ప్రకటించారు. దీంతో తిరుపతిలో పోటీ నుంచి జనసేన తప్పుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ పెద్దల మాటతో వకీల్ సాబ్ వెనక్కి తగ్గారా లేక.. మరోదేనా రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది తామేనని హరిహర వీరమల్లు స్థాయిలో ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ హైకమాండ్‌తోనూ తలపడినంత పనిచేశారు. స్నేహం కోసం తాను చేసిన త్యాగాలకు గుర్తుగా తిరుపతిలో పోటీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. గతేడాది చివర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా పవన్ కల్యాణ్ సంచలనం రేపారు. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రన జనసేనకు సొంత అస్థిత్వం ఉండదా? అంటూ ఎదురు ప్రశ్నలు సంధించిన ఆయన.. జీహెచ్ఎంసీలో అభ్యర్థులను కూడా ప్రకటించారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి బుజ్జగించిన తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సందర్భంలో.. జీహెచ్ఎంసీలో త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతిలో పోటీకి జనసేనకు అవకాశం కల్పించాలని బీజేపీ పెద్దలను కోరుతానని పవన్ ప్రకటించారు. ఆ మేరకు ఆయనకు హామీ వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. 

జనసేన తిరుపతి నుంచి పోటీ చేయకుండా వెనక్కి తగ్గడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. రాజకీయ భవిష్యత్ కోసమే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తిరుపతి ఎంపీ ఎన్నికల తర్వాత జనసేన.. బీజేపీ నుంచి దూరమౌతుందని తెలుస్తోంది. తిరుపతిలో జనసేన పోటీ చేయాలని ఎంత గట్టి డిమాండ్ ఉందో... పోటీ చేస్తే ఇబ్బందనే వారు ఎక్కువ ఉన్నారు. పోటీ చేయడం వల్ల ప్రత్యేక హోదా అంశం, రైల్వే జోన్,  రాజధాని, విశాఖ ప్రైవేటీకరణ తదితర అంశాలు తెరమీదకు వస్తాయని జనసేన భావిస్తుంది. ప్రత్యేక హోదా అంశం పెండింగులో ఉండగా..తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం.. కాక రేపుతోంది. కేంద్ర సర్కార్ పై నిర్ణయంపై ఆంధ్రులు భగ్గుమంటున్నారు. బీజేపీ పేరు చెబితేనే మండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో దూరంగా ఉండటమే బెటరని జనసేన నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

బీజేపీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం జనసేన మీద పడుతుందనే భయం కూడా పవన్ కల్యాణ్ లో కనిపిస్తుందట. అందుకే తిరుపతిలో పోటీ చేయకుండా వదిలేస్తే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చని అభిప్రాయం జనసేన నేతల్లో బలంగా ఉన్నట్లు తెలిసింది. ఫలితాలు తర్వాత ఆ పార్టీ ఒక స్టాండ్ తీసుకుని 2024 ఎన్నికలకు వెలతామని ఆ పార్టీలోని కొంత మంది చెబుతున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే.. తిరుపతి సీటును బీజేపీకి వదిలేసి.. జనసేన సేఫ్ జోన్ లోకి వెళ్లిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి... జనసేన గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అనలిస్టులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. 

ఇక  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జనసేన మద్దతుతో బీజేపీ పోటీ చేయనుండటం ఖరారైనప్పటికీ, అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు.టీడీపీ అందరికన్నా ముందుగా ఉప ఎన్నిక అభ్యర్ధిని ప్రకటించి షాకిచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ బరిలోకి దింపుతోంది. అధికార వైసీపీ  అనూహ్యంగా ఉప ఎన్నిక బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపుతున్నట్టు ప్రకటించింది. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్....తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తికి టికెట్ కేటాయించనున్నారని తెలుస్తోంది.