Read more!

బీజేపీ ఎంపీ అనుమానాస్పద మృతి

బీజేపీ ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దిల్లీలోని ఆయన నివాసంలో ఉరి వేసుకొని చనిపోయారు. ఢిల్లీలోని గోమతి ఆపార్ట్‌మెంట్‌లో శర్మ నివాసముంటున్నారు. ఉదయం ఎంపీ శర్మ అసిస్టెంట్ ఆయనకు ఫోన్‌ చేయగా ఎంతకీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన అతడు పోలీసులకు ఫోన్‌ చేశాడు. ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు గది తలుపు బద్దలుకొట్టగా.. ఎంపీ శర్మ ఫ్యాన్స్‌కు వేలాడుతూ కన్పించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన కరోనా టీకా కూడా వేయించుకున్నారు.   

62 ఏళ్ల శర్మ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో జన్మించారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా గెలిచారు. శర్మకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. 

గత నెల దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ హోటల్‌ గదిలో ఆయన ఉరేసుకుని చనిపోయారు. గదిలో గుజరాతీలో రాసిన ఓ లేఖ కూడా లభించినట్లు పోలీసులు అప్పట్లో తెలిపారు. ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడితో సహా కొందరు తనను వేధిస్తున్నారని దేల్కర్‌ అందులో రాసినట్లు సమాచారం. ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతుండగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉన్నతస్థాయి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.