Read more!

నేనే సీఎం అయితే... మంత్రి పెద్దిరెడ్డి మనసులో మాట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్ రెడ్డి  జైలుకెళ్తే .. ఆయన పదవి దక్కించుకోవాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు. రఘురామ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. జగన్ పై కుట్ర చేసేదెవరు అన్న చర్చ జనాల్లో జరుగుతుండగానే.. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏమిటని తెలుగుదేశం నేతలను ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి సీఎం కనుక ఇంకా టీడీపీ‌లో శాసన సభ్యులు ఉన్నారు.. అదే సీఎంగా నేనైతే చంద్రబాబు మాత్రమే ఆ పార్టీలో మిగిలేవారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.  ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని నిలదీశారు. కేంద్రంపై అంతా విశాఖ స్టీల్ కోసం కలిసి పోరాడి సాధించాలని కోరారు. రాజీనామా చేయాలని టీడీపీ చేస్తున్న వ్యాఖలు అర్ధరహితమని చెప్పారు.   

నేనే సీఎం అయితే అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జగన్ జైలుకు వెళ్తే.. ముఖ్యమంత్రి కావాలని పెద్దిరెడ్డి స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. వైసీపీలో ఆయన తనకంటూ బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నారని కూడా చెబుతున్నారు. పెద్దిరెడ్డి వెనుక పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలు ఎవరూ కూడా ముఖ్యమంత్రి అంశం గురించి మాట్లాడే సాహసం చేయరు. అలాంటిది పెద్దిరెడ్డి నేనే సీఎం అయితే అని మాట్లాడటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి కావాలనే తన మనసులో మాటను పెద్దిరెడ్డి.. ఇలా బయటికి  చెప్పేశారనే చర్చ జరుగుతోంది. నేనే సీఎం అయితే అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనూ దుమారం రేపుతున్నాయని తెలుస్తోంది.