Read more!

టీడీపీలో మళ్లీ జూనియర్ యాక్టివ్! చంద్రబాబు చర్చలతో తమ్ముళ్ల ఖుషీ..

జూనియర్ ఎన్టీఆర్.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మనవడు.. నందమూరి హరికృష్ణ తనయుడు.. అచ్చం తాత తారకరామారావు పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఓ రేంజ్ లో వెలిగిపోతున్నారు. తనకంటూ ఓ స్టార్ డమ్ కలిగిఉన్న జూనియర్ ఎన్టీఆర్.. గతంలో తెలుగు దేశం పార్టీలో కీ రోల్ పోషించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. అప్పటి వైఎస్సార్ ప్రభుత్వాన్ని ఓడించి మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఉమ్మడి ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. అప్పుడు జూనియర్ ప్రచారానికి ఊహించని స్పందన వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేకపోయింది.

2009 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేశారు. 2014, 2019 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేస్తారని ప్రచారం జరిగినా .. ఆయన మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. 2014లో బీజేపీ,జనసేన పోత్తులో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ హవాలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 2019లో టీడీపీ ఓడిపోయినప్పటి నుంచి జూనియర్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. టీడీపీలో జూనియర్ మళ్లీ యాక్టివ్ కావాలని కొందరు టీడీపీ సీనియర్లు నేతలు బహిరంగంగానే ప్రకటలు చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నారు. టీడీపీ సభల్లో జూనియర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఆయన రావాలని కోరుకున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే జూనియర్ కు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. ఎన్టీఆర్ ప్రచారం చేస్తే టీడీపీ విజయం ఖాయమనే ధీమాలో ఉన్నారు తమ్ముళ్లు.

2019 ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ.. 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడం ఎలా అని టిడిపి నేతల్లో అంతర్మధనం జరుగుతోంది ఈ సమావేశాల్లో కొందరు నేతలు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రస్తావిస్తున్నారని తెలిసింది.  సంక్షేమ పథకాలతో ఓటుబ్యాంకును ఏర్పరుచుకుంటూ సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనాలంటే ఇప్పుడున్న పార్టీ స్థితిగతులు సరిపోవని టిడిపి సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్డారట. 

ఇప్పటికే పార్టీ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పనిచేశామని, ఈసారి అధికారంలోకి రాకపోతే కష్టమేనని ఈ సీనియర్ల బృందమంతా చంద్రబాబు ముందు ఏకరువు పెట్టారట. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే పార్టీకి ఓ పెద్ద ఊపు రావాలని కోరారట. ఇప్పుడు మనం చేస్తున్న పోరాటాలు సరిపోవని, జూ.ఎన్టీయార్‌ను కూడా రంగంలోకి దింపాలని పార్టీ సీనియర్‌ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. దీంతో టీడీపీ అధినేత జూనియర్ ఎన్టీయార్‌తో ఫోన్‌ చేసి మాట్లాడారని తెలిసింది. జూ.ఎన్టీయార్‌ కూడా పాజిటివ్‌గానే స్పందించారని చెబుతున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా పటిష్ఠంగా మార్చాలని, కార్యకర్తలకు నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఎన్టీయార్‌ సూచించినట్లు తెలిసింది. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తున్న చంద్రబాబు.. ఇందుకోసం అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్‌తో చంద్రబాబు చర్చలు జరిపారని తెలుస్తోంది. ఎన్నికల సమయం నాటికి పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో జతకట్ట వచ్చునని టిడిపి నేతలు భావిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారానికి వస్తే తెలుగు దేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు తమ్ముళ్లు. జూనియర్ తో చంద్రబాబు మాట్లాడటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.