Read more!

చెరువులో స్కూల్ బస్ బోల్తా.. స్టూడెంట్ మృతి..

ఇన్నాళ్లూ కరోనా కారణంగా స్కూళ్లకు సెలవులు. నెలల తరబడి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. బడి లేకున్నా కులాసాగా ఉన్నారు. పేరెంట్స్ సమక్షంలో క్షేమంగా ఉన్నారు. స్కూల్స్ రీఓపెన్ కావడంతో ఇప్పుడంతా బడి బాట పట్టారు. అందరిలానే ఆ విద్యార్థులు సైతం స్కూల్ కు వెళుతున్నారు. స్కూల్ బస్సులోనే వెళ్లి రావడంతో అంతా ఖుషీగా ఉన్నారు. కానీ, ఆ స్కూల్ బస్సే ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదం నింపుతుందని ఊహించలేకపోయారు. బడి బస్సు నిండు ప్రాణం బలి తీసుకుంది. మరో నలుగురికి ప్రాణ సంకటంగా మారింది.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చెరువులో పడిన బస్సు నుంచి విద్యార్థులను బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. బడివానిపేట గ్రామానికి చెందిన మైలపల్లి రాజు (8) మాత్రం మృతి చెందడం విషాదం నింపింది.  

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెరువులో పడిన స్కూల్ బస్సును జేసీబీతో బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, సమీప గ్రామానికి చెందిన ప్రజలు చెరువు దగ్గరకు భారీగా చేరుకున్నారు. చనిపోయిన చిన్నారి ఇంటి సభ్యుల రోదనతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్ డ్రైవర్ తో పాటు యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.