Read more!

కొవిడ్‌పై 100 కోట్ల విజ‌యం.. టీకా పంపిణీలో ఘ‌న‌ చ‌రిత్ర‌..

ఒక్క టీకాతో మొద‌లైంది.. 100 కోట్ల టీకాల మైలురాయిని చేరింది.. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా జ‌రుగుతోంది. అగ్ర‌రాజ్యాలు, ధ‌నిక రాజ్యాలు కొవిడ్‌తో అల్లాడిపోతుంటే.. ఆయా దేశాల‌తో పోలిస్తే భార‌త ప‌రిస్థితి మెరుగ్గా ఉంది. క‌రోనాపై పోరాటం ప్ర‌శంస‌నీయంగా సాగుతోంది. మొద‌ట్లో టీకా తీసుకోవ‌డంపై అనేక అనుమానాలు, అంత‌కుమించి అపోహ‌లు. అలాంటి అడ్డంకుల‌న్నిటినీ దాటుకుంటూ దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం మ‌హోద్య‌మంలా కొన‌సాగుతోంది. ఆ ప్ర‌యాణం 100 కోట్ల టీకాల‌కు చేరడం భారతీయులంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.

కొవిడ్ కోరలు విరిచేందుకు ఒక ‘మహోద్యమం’ చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమం వందకోట్ల మహోన్నత శిఖరాన్ని చేరుకుంది. 2021 జనవరి 16న దేశంలో మొదలైన టీకా కార్యక్రమం మొదటి మందకొండిగా సాగినా ఆ తర్వాత ఊపందుకుంది. ఒక్కొక్క మైలు రాయిని దాటుకుంటూ అక్టోబర్ 21కి 100 కోట్ల కీర్తి శిఖరం చేరుకుంది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా మన దేశం  కీర్తి గడించింది. 

టీకా పంపిణీలో 100 మైలురాయిని దాటిన సందర్భంగా మోదీ ఢిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తి, భారత సైన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన డాక్టర్లు, నర్సులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ ట్విటర్‌లో తెలిపారు.

పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ట్విటర్‌ వేదికగా 100 కోట్ల మార్క్‌పై అభిందనలు తెలియజేశారు.  ‘‘టీకా పంపిణీలో అద్భుతమైన లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా భారత ప్రజలకు అభినందనలు. ఈ చరిత్రాత్మక రికార్డును చేరుకోవడంలో కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, టీకా తయారీదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అభినందనలు. ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోనివారు భయాలన్నీ పక్కనబెట్టి టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నా. మనమంతా కలిసి కరోనాను ఓడిద్దాం’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు.  


దేశంలో కరోనాన ఉదృతి తగ్గిన నేపధ్యంలో మళ్ళీ మరో మారు వాక్సినేషన్ వేగం తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా రెండవ డోసు టీకా మరింత మండగొండిగా సాగుతోంది. అధికారిక వర్గాల గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 75శాతం మంది అర్హులైన వారికి తొలి డోసు టీకా పూర్తవ్వగా.. దాదాపు 31శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. రెండు డోసులు పూర్తయిన వారి సంఖ్య తక్కువగా ఉండటంతో ఇకపై కేంద్రం రెండో డోసుపై దృష్టి పెట్టాలని ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ఒకటీ రెండు డోసులమధ్య దూరాన్ని పెంచడం వలన సెకండ్ డోస్ మెల్లగా సాగుతోందని, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ డిసెంబర్ చివరి నాటికి రెండు డోసుల లక్ష్యం చేరుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ విశ్వాసం వ్యక్తపరుస్తోంది.