Read more!

ఈ నీళ్ల‌లో ఇల్లు ఎలా క‌ట్టుకోవాలి జ‌గ‌న‌న్న‌?

ఈ ఫోటో చూస్తున్నారుగా.. మొత్తం నీళ్లే. ఇదేమీ చెరువు కాదు.. చెరువులాంటి స్థ‌లం. ఈ స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకోమంటూ పేద‌ల‌కు ఉదారంగా ఇచ్చేశారు మ‌హాప్ర‌భు. జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో ఇలాంటి ప‌నికిరాని స్థ‌లాలు కేటాయించారు. జ‌గ‌న‌న్న కాల‌నీల భూముల‌పై ఎప్ప‌టి నుంచో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఉన్నా.. ఇది లేటెస్ట్‌ది.

ఈ ఫోటోలో క‌నిపిస్తున్న‌దేమీ గోదావ‌రి జిల్లాల్లోని ఆవ భూములు కావు. అక్క‌డైతే మ‌రీ ఘోరం. ఏకంగా స‌ముద్రంలో క‌లిసి ఉన్న భూముల‌ను జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో పంచేసి.. ఇక మీ చావు మీరు చావండి అన్న‌ట్టు చేతులు దులిపేసుకున్నారు పాల‌కులు. ఆవ భూముల కొనుగోలులో గోల్‌మాల్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు. ఆవ భూమిలో ఇల్లు ఎలా క‌ట్టుకోవాలో.. ప్ర‌భుత్వ‌మే ఓ మోడ‌ల్ హౌజ్ నిర్మించి చూపిస్తే బాగుండేది. 

ఇక‌, ఆవ భూముల‌ను త‌ల‌పించేలా ఉన్న‌ అనేక లోత‌ట్టు ప్రాంతాల‌ను జ‌గ‌న‌న్న కాల‌నీలకు కేటాయించారు. ఏపీలో వ‌ర్షం కురిసిన ప్ర‌తీసారీ.. ఒక్కో కాల‌నీ గొప్ప‌త‌నం వెలుగులోకి వ‌స్తోంది. ఇక్క‌డ మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న‌ది ఏ చెరువో కాదు. లోత‌ట్టు ప్రాంతంలో ఉన్న జ‌గ‌న‌న్న కాల‌నీ. ఇక్క‌డ ఇల్లు క‌ట్టుకోవాలంటూ పేద‌ల‌కు స్థ‌లాలు కేటాయించింది ప్ర‌భుత్వం. మ‌రి, ఈ నీళ్ల‌లో ఇల్లు క‌ట్టుకోవ‌డం పేద‌లకు సాధ్య‌మా? ఈ స్థ‌లంలో నీళ్లు నిల‌వ‌కుండా మ‌ట్టి పోయించి చ‌దును చేసేందుకే ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతాయి. ఆ డ‌బ్బే ఉంటే వారు పేద‌లెందుకు అవుతారు? ఇలాంటి చెరువులో ఎందుకు ఇల్లు కట్టుకుంటారు? 

ఈ ఫోటో జి.కొండూరు స‌మీపంలో విజ‌య‌వాడ వాసులు, వెల‌గ‌లేరు గ్రామాల పేద‌ల‌కు జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో ఇచ్చిన ఇళ్ల స్థ‌లాలు. ఇటీవ‌ల కురిసిన చిన్న‌పాటి వాన‌కు నీరు నిల‌చి ఇలా చెరువును త‌ల‌పిస్తోంది. ఇక్క‌డ ఇల్లు క‌ట్టుకోవ‌డం ఎలా అంటూ ల‌బ్దిదారులు ల‌బోదిబో మొత్తుకుంటున్నారు. జ‌గ‌న‌న్న ఇల్లు పేరుతో త‌మ‌ను మోసం చేశాడ‌ని శాప‌నార్థాలు పెడుతున్నారు. మ‌రి, వారి గోడు పాల‌కుల చెవికి ఎక్కేనా?