Read more!

మందేసి.. కారు న‌డిపేసి.. యువ‌తి దుర్మ‌ర‌ణం..

ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. ఆ ఆరుగురూ మంచి దోస్తులు. ఫ్రెండ్ ఫిప్ డే రోజున ఓ ప‌బ్‌లో పార్టీ చేసుకున్నారు. మ‌స్త్ మ‌జా ఎంజాయ్ చేశారు. పార్టీ అయిపోయాక‌.. అర్థ‌రాత్రి కారులో ఇంటికి బ‌య‌లుదేరారు. కాసేపైతే ఇంటికే వెళ్లేవారు. కానీ, అబ్బాయిలు తాగిన మందు.. ఆ అమ్మాయిని ఇంటికి కాకుండా పైలోకాల‌కు పంపించింది. మ‌ద్యం మ‌త్తులో వేగంగా కారు న‌డ‌ప‌డంతో అదుపు త‌ప్పి.. బోల్తా కొట్టింది. రాళ్ల‌కు ఢీకొట్ట‌డం.. కారు డోరు తెరుచుకొవ‌డం.. అందులో నుంచి ఆ యువ‌తి రోడ్డుపై ప‌డ‌టంతో దుర్మ‌ర‌ణం పాలైంది.

డంక్ అండ్ డ్రైవ్ వ‌ద్దంటూ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా యూత్ ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకు ఫ‌లితం అనుభ‌విస్తున్నారు. అయితే, ఈ యాక్సిడెంట్‌లో తాగి కారు న‌డిపినోడు సేఫ్‌గానే ఉన్నాడు. పాపం.. వెన‌క సీట్లో కూర్చున్న యువ‌తే ప్రాణాలు విడిచింది. వాడు త‌ప్ప‌తాగినందుకు.. ఈమె తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ కొండాపూర్‌లో జ‌రిగింది. 

ఆశ్రిత(23), తరుణి(23), సాయిప్రకాష్‌(23), అభిషేక్‌(21), వివేక్‌(22), చిన్మయ్‌(22)లు శంక‌ర్‌ప‌ల్లిలోని ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌లో బీబీఏ చేశారు. ఆశ్రిత ఉన్నత చదువులకు కెనడా వెళ్లి.. వారం క్రితం తిరిగొచ్చింది. ఫ్రెండ్‌ఫిప్‌డే రోజున వారంతా క‌లిసి పార్టీ చేసుకోవాల‌ని అనుకున్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌ రోడ్డులోని స్నార్ట్‌ పబ్‌కు వెళ్లారు. అక్క‌డ అభిషేక్‌, సాయిప్రకాష్‌ మద్యం తాగారు. రాత్రి 11 గంటలకు ప‌బ్ నుంచి మదీనాగూడలోని అభిషేక్‌ ఇంటికి బయలుదేరారు. అభిషేక్‌ కారులో సాయిప్రకాష్‌, ఆశ్రిత, తరుణి ఉన్నారు. 

రాత్రి 11.30 ప్రాంతంలో కొండాపూర్‌లో అభిషేక్‌ కారు అదుపు తప్ఫి. బండరాళ్లను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. యాక్సిడెంట్‌లో కారు డోరు తెరుచుకోవడంతో ఆశ్రిత రోడ్డుపై ఎగిరి పడింది. పక్కనే కూర్చున్న తరుణి లోపలే ఇరుక్కుపోయింది. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో సాయిప్రకాష్‌, అభిషేక్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, ఆశ్రిత మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. తరుణి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అభిషేక్‌ మద్యం తాగి.. వేగంగా కారు నడపటం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు తేల్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మద్యం విక్రయాలపై నిషేధమున్నా విక్రయించినందుకు స్నార్ట్‌ పబ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.