Read more!

కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు బ్రేకులేసింది ఎవ‌రు?

సోమ‌వారం జ‌రిగిన‌ ఘ‌ట‌న. తెలంగాణ కేబినెట్ కీల‌క స‌మావేశం జ‌రిగింది. కొవిడ్ కేసులు పెరగ‌టం, నైట్ క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్‌.. త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చిస్తారంటూ లీకులు. వైద్య ఆరోగ్య‌మంత్రి హ‌రీశ్‌రావు అంతా ఓకే అనేస‌రికి కొవిడ్ టాపిక్ ప‌క్క‌న‌పెట్టేశారు. ఇక‌, వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం బోధ‌నే ప్ర‌ధాన‌ ఎజెండాగా మారింది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సుదీర్ఘంగా సాగిన ఆ కేబినెట్ భేటీ సాయంత్రం ముగిసింది. ఆ స‌మావేశం వివ‌రాల‌ను స్వ‌యంగా సీఎం కేసీఆరే ప్రెస్‌మీట్‌లో వివ‌రిస్తారంటూ అంద‌రికీ మెసేజ్‌లు వ‌చ్చేశాయి. కాసేప‌ట్లో కేసీఆర్ మీడియా స‌మావేశం అంటూ అన్ని ఛానెళ్లు తెగ బ్రేకింగ్ న్యూస్ న‌డిపాయి. 

కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటే అంద‌రికీ ఇంట్రెస్టింగే క‌దా. ఎవ‌రిని తిడ‌తారో.. ఎందుకు తిడ‌తారో.. ఆ భాష‌.. ఆ యాస‌.. ఆ సెటైర్లు.. ఆ ఆవేశం.. అబ్బో కామెడీ సినిమాకంటే ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. అందుకే, అంతా టీవీల ముందు అతుక్కుపోయారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ కోసం వెయిట్ చేశారు. 

ముందు సాయంత్రం 6 గంట‌ల‌కు అన్నారు. ఆరైనా కేసీఆర్ ప్రెస్‌మీట్ స్టార్ట్ కాలేదు. ఆ త‌ర్వాత ఏడింటికి అన్నారు. ఏడైనా ముఖ్య‌మంత్రి మీడియా ముందుకు రాలేదు. ఇక‌, అన‌డం మానేశారు. టీవీల్లో బ్రేకింగ్ పాయింట్స్ ఆపేశారు. ఇంత‌కీ ఆ రోజు ఏం జ‌రిగింది? కేసీఆర్ ప్రెస్‌మీట్‌ను కాకెత్తుకుపోయిందా? మీడియా ముందుకు వ‌స్తాన‌న్న ఆయ‌న ఎందుకు రాలేదు? 

మంచి టైమ్‌పాస్ మిస్ అయింద‌ని ఆ రోజు ప్రేక్ష‌కులు ఫుల్ డిస‌ప్పాయింట్ అయ్యారు. ఆ త‌ర్వాత లైట్ తీసుకున్నారు. కేసీఆర్ ప్రెస్ ముందుకు ఎందుకు రాలేదో పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ... కాస్త ఆల‌స్యంగా ఇప్పుడా వివ‌రాలు తెలుస్తున్నాయి. ఆ రోజు కేసీఆర్ మీడియా మీట్‌కు డుమ్మా కొట్ట‌డానికి కార‌ణం లేక‌పోలేదు. అదేంటంటే....

స‌రిగ్గా కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు రావాల్సిన స‌మ‌యంలో ఉత్త‌రాది నుంచి ఓ ప్ర‌ముఖ‌ రాజ‌కీయ నాయ‌కుడు కేసీఆర్‌ను క‌లిసేందుకు ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌చ్చార‌ట‌. అనుకోకుండా ప్రెస్‌మీట్ ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న రావ‌డంతో.. కీల‌క‌మైన ఆ నేత‌కు టైమ్ ఇవ్వ‌క త‌ప్ప‌లేద‌ట‌. ఆయ‌న‌తో స‌మావేశమైనందునే.. కేసీఆర్ మీడియా స‌మావేశం ఆనాడు ర‌ద్దు అయింద‌నేది విశ్వ‌స‌నీయ స‌మావేశం. 

ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ ఉత్త‌రాది నేత‌ల‌తో కీల‌క మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌పై గులాబీ బాస్ ప‌రోక్షంగా ఫోక‌స్ పెంచారు. స‌మాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్‌యాద‌వ్ త‌ర‌ఫున‌.. బీహార్‌కు చెందిన ఆర్జేడీ వార‌సుడు తేజ‌స్వీ యాద‌వ్ ఈమ‌ధ్య ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌చ్చి కేసీఆర్‌తో మంత‌నాలు జ‌రిపివెళ్లారు. యూపీలో ఎస్పీ ఓట్ల‌కు గండి ప‌డ‌కుండా.. బీజేపీకి లాభం జ‌ర‌గ‌కుండా.. ఎమ్ఐఎమ్ పోటీ చేసే స్థానాల‌ను ప్ర‌భావితం చేసేలా.. మ‌జ్లిస్ అధినేత‌ ఓవైసీకి కేసీఆర్‌తో చెప్పించార‌ని అంటున్నారు. ప‌నిలో ప‌నిగా యాద‌వుల గెలుపు కోసం పెద్ద మొత్తంలో డ‌బ్బులు కూడా స‌ర్దుబాటు చేశార‌ట కేసీఆర్‌. ఆ ఉత్త‌రాది రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో భాగంగానే.. స‌డెన్‌గా మ‌రో కీల‌క నేత సైతం ఆ రోజు కేసీఆర్‌ను క‌లిశార‌ని తెలుస్తోంది. అందుకే, సాయంత్రం 6..7.. అంటూ రెండు సార్లు టైమ్ ప్ర‌క‌టించినా.. వాళ్ల చ‌ర్చ‌లు ముగియ‌క‌పోవ‌డంతో ఏకంగా ప్రెస్‌మీట్‌నే క్యాన్సిల్ చేశార‌ట సీఎం కేసీఆర్‌. మ‌రి, అంత‌గా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఏం రాజ‌కీయం జ‌రుగుతోందో ఏమో..!