Read more!

అవంతి, అంబ‌టివి రాస‌లీల‌లేనా? మిమిక్రీ కుట్ర‌లా? ఏది నిజం?

ట్రింగ్‌..ట్రింగ్‌.. వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది. ఇటునుంచి కాల్ లిఫ్ట్ చేస్తే.. అటునుంచి మంత్రి గారు వాయిస్ వినిపిస్తుంది. తెలిసిన గొంతే కావ‌డంతో.. చాలా క్యాజువ‌ల్‌గా డిష్క‌స‌న్ సాగుతుంది. బాగున్నావా.. ఎక్క‌డున్నావ్ నుంచి మొద‌లై.. వెంట‌నే అస‌లు మేట‌ర్‌లోకి వ‌చ్చేస్తారు మినిస్ట‌ర్ గారు. క‌ట్ చేస్తే.. మంత్రి గారి ఆడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతుంది. మంత్రి అనే కాదు ఇటీవ‌లే ఎమ్మెల్యే విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ఆ ఇద్ద‌రు వైసీపీ నేత‌లు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్‌గా మారారు. అందులో ఒక‌రు ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అయితే.. మ‌రొక‌రు మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఆడియో వైర‌ల్ కాగానే.. ఇక సినిమాటిక్ స్టైల్‌లో డ్రామా మొద‌లైపోతుంది. త‌న వాయిస్ త‌న‌ది కాద‌ని.. ఎవ‌రో మిమిక్రీ చేశార‌ని.. వారిపై కేసులు పెడుతున్నాన‌ని.. క్వైట్ కామ‌న్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఇందులో మరింత‌ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. త‌న‌పై గిట్ట‌నివారి కుట్ర అంటే.. మంత్రి అవంతి శ్రీనివాస్ విష‌యంలో మాత్రం వైసీపీ వాళ్లే ఇలా ట్రాప్ చేశార‌నే ఆరోప‌ణ వ‌స్తుండ‌టం ఆస‌క్తిక‌రం. 

అంబ‌టి రాంబాబు విష‌యంలో ఆడియోకు సంబంధించిన వీడియో లీక్ అయింది. కాల్ రికార్డ్ చేయ‌కుండా వాట్సాప్ కాల్ చేసిన‌ట్టున్నారు. ఆ వాట్సాప్‌ కాల్ స్పీక‌ర్ ఆన్ చేసి.. వేరే మొబైల్‌తో కాల్ మొత్తం రికార్డు చేశారు. అందులో అంబ‌టి వాయిస్‌.. ఆ మ‌హిళ‌ను మ‌సాజ్‌కు ర‌మ్మ‌న‌టం.. ఆమె వేరే అమ్మాయిని పంపిస్తానన‌టం.. బాగుంటుందా.. అన్నీ చేస్తుందా.. ఇలా ర‌స‌వ‌త్త‌రంగా న‌డిచింది ఆ సంభాష‌ణ‌. మిమిక్రీనే నిజ‌మైతే.. ఇంత నాచుర‌ల్‌గా భ‌లే చేశారు ఎవ‌రో. మిమిక్రీ కాక‌పోతే.. మ‌నోడు మాంచి క‌ళాకారుడే అన్నట్టు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌న్నారు ఎమ్మెల్యే అంబ‌టి. చేశారో లేదో క్లారిటీ లేదుగానీ.. చేసుంటే వారం గ‌డుస్తున్నా ఇంకా ఆ మిమిక్రీ ఆర్టిస్టును ఎందుకు ప‌ట్టుకోలేక‌పోతున్నారో మ‌రి? ఆ వీడియోలో.. అంబ‌టి ఫోటోతో వాట్సాప్ కాల్ నెంబ‌ర్ చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసుకోవ‌డం పోలీసుల‌కు పెద్ద క‌ష్ట‌మేమీ కాక‌పోవ‌చ్చు. మ‌రి ఇంత ఆల‌స్యం ఎందుకు అవుతుందో.. అంబ‌టికే తెలియాలి అంటున్నారు. 

ఇక అంబ‌టి ఎపిసోడ్ జ‌రిగిన వారం వ్య‌వ‌ధిలోనే మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు సైతం అలాంటి ఇష్యూలోనే బ‌య‌ట‌కు రావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. అర‌గంట‌లో పంపించేస్తా.. రా.. అంటూ వాయిస్ ఓ ఉమెన్‌ను ట్రాప్ చేయ‌డం.. ఆమె నేనురానంటూ గ‌తంలో బాగా అల‌వాటు ఉన్న‌ట్టే చొర‌వ‌గా నో చెప్ప‌డం..  చాలా నాచుర‌ల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉందా ఫోన్ సంభాష‌ణ‌. మంత్రి అవంతి చెప్పిన‌ట్టు అది కుట్రే అయితే.. ఆ కుట్ర చేసిన డ‌బ్బింగ్ ఆర్టిస్టులకు అభినందించాల్సిందే అంటున్నారు. అంబ‌టి లానే అవంతి సైతం వెంట‌నే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇదంతా గిట్ట‌నివారి కుట్ర అని తేల్చేశారు. అయితే, అవంతి శ్రీనివాస్‌కు విశాఖ వైసీపీ నేత‌ల‌తో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయ‌ని.. సొంత‌పార్టీలోనే ఎవ‌రో ఈ కుట్ర చేసి ఉంటార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, అవంతి ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. మంత్రి త‌లుచుకుంటే.. ఆ ఆడియో మిమిక్రీ అయితే.. వారిని ప‌ట్టుకోవ‌డం ఎంత సేపు చెప్పండి. నైజీరియా కేటుగాళ్ల‌నే ప‌ట్టుకుంటున్న పోలీసులు.. ఆఫ్ట్రాల్ ఫేక్ కాల్ క్రిమిన‌ల్స్‌ను ప‌ట్టుకోలేరా? ప‌ట్టుకోలేక పోతున్నారంటే..... అది ఫేక్ కాద‌నా...? ఇలా అనేక అనుమానాలు. 

గ‌తంలో ఎస్వీబీసీ ఛైర్మ‌న్ పృథ్వీ ఆడియో కూడా ఇలానే వైర‌ల్ అయింది. వెన‌క‌నుంచి ప‌ట్టుకుంటా.. అంటూ తెగ ఫేమ‌స్ అయ్యారు. అప్ప‌ట్లో ఆయ‌న సైతం ఆ వాయిస్ త‌న‌ది కాద‌న్నారు. అయినా, ఆయ‌న ప‌ద‌వి పీకేశారు. ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అలానే జ‌రిగింది. మ‌రి, అంబ‌టి, అవంతిల‌పై కూడా వేటు వేస్తారా? ఇలాంటి మిమిక్రీ వ్య‌వ‌హారాలు ఇలానే కొన‌సాగితే.. అది ఎందాకైనా దారి తీయొచ్చు. ఎంపీ ర‌ఘురామ అన్న‌ట్టు.. ముందుముందు ర‌ఘురామ వాయిస్‌, సీఎం జ‌గ‌న్ వాయిస్‌ను సైతం ఇమిటేట్ చేస్తూ ఇలాంటి ఆడియోలు రావొచ్చు. అందుకే, మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుల వాయిస్‌తో మిమిక్రీ చేస్తూ.. అస‌భ్య వాయిస్ కాల్స్ చేసిన దుర్మార్గుల‌ను వెంట‌నే ప‌ట్టుకొని క‌ఠినంగా శిక్షించాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వ‌మే వారి చేతిలో ఉంది ఓ మిమిక్రీ ఆర్టిస్ట్‌ను ప‌ట్టుకోలేరా? ప‌ట్టుకోలేదంటే.. ఆ ఆడియో వాయిస్‌లు నిజ‌మేనా..? అవంతి, అంబ‌టిలు ఆ టైపేనా..? అనే అనుమానం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు. 

ఏపీలో ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. నెల క్రితం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ కేసులో ఇంకా కొందరు నిందుతులు దొరకలేదు. తాజాగా గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై దళిత విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమించలేదనే కోపంతో ఓ కిరాతకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇలా మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతుండగానే.. ఏకంగా మంత్రి, ఎమ్మెల్యేల రాసలీలల ఆడియో, వీడియోలు బయటికి రావడం సంచలనంగా మారింది. ప్రజా ప్రతినిధులు ఇలా ఉంటే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. సీఎం జగన్ అసమర్ధత వల్లే ఆ పార్టీ నేతలు దిగజారిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన నేతలపై దర్యాప్తు జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది.