Read more!

మరో భారీ అప్పు.. బూతుల పార్టీ.. కేసీఆర్ కు ఈడీ నోటీస్.. టాప్ న్యూస్@7PM

సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ద్వారా మరో భారీ అప్పునకు జగన్ సర్కార్ ప్రయత్నాలు మమ్మరం చేసింది. ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు 5 వేల కోట్ల రుణం కోసం బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్‌ను  ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 5 వేల కోట్లను రైతుల నుంచి 2021, 22 ఏడాదికి కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపులకోసం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది
----
ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు‌కు రావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలకు స్టేషనరీ కిట్స్ సరఫరా చేసినా.. బిల్లులు చెల్లించలేదని నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్  తరపున న్యాయవాది తేజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  2019లో బిల్లులు అందించినప్పటికీ, నేటి వరకు ప్రభుత్వం నగదు చెల్లించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
----
తెలుగు భాషను బూతులమయంగా చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. శాసన సభను కౌరవ సభగా మార్చారన్నారు. ఈ దుష్ట సంప్రదాయం ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు తీసుకెళ్లారని, అలాంటి పార్టీని ఏమనాలని ప్రశ్నించారు. సిగ్గుమాలిన చర్యలకు వైసీపీ ప్రతీకగా మారిందన్నారు. పార్లమెంట్‌లో బూతులు మాట్లాడిన వైసీపీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-------
కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్‌ ఎప్పుడో పూర్తయ్యేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పోలవరానికి 90 శాతం అనుమతులు తెచ్చామని గుర్తుచేశారు. రూ.5,136 కోట్ల రాష్ట్ర నిధులు ఖర్చుచేసి 32 శాతం పనులు పూర్తిచేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు బీజేపీ శనిగ్రహంలా టీడీపీ, వైసీపీలు రాహు, కేతువులుగా దాపురించాయని ఏపీ కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
-------
జక్కంపూడి టిడ్కో ఇళ్ల దగ్గర లబ్ధిదారుల ఆందోళనకు దిగారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ప్లాట్లు మంజూరు చేశారని ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నిలబెట్టి అధికారులు లబ్ధిదారుల ఫొటోలు తీస్తున్నారని అంటున్నారు. లబ్ధిదారులు నిలదీయడంతో హౌసింగ్ అధికారులు పరారైయ్యారు.  ఖాళీ స్థలాలకు రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు తేల్చిచెప్పిన్నాయి. వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లబ్ధిదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-------
టీఆర్ఎస్ ఎంపీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లంటూ విషయాన్ని పక్కదారి పట్టించి పార్లమెంట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ సభ్యులు నిష్క్రమించారని ఆయన ఆరోపించారు. ఈడీ నోటీసుల క్రమంలో కేసీఆర్‌కు, కేంద్రానికి కొంత అంతరం ఏర్పడిందన్నారు. ఈడీ విచారణ నుంచి తప్పించుకోవడానికే పార్లమెంట్‌ను వేదికగా వాడుకుని టీఆర్‌ఎస్‌ డ్రామాలాడిందన్నారు. ఈడీ నోటీసులను కేంద్రం తాత్కలికంగా నిలిపివేసిందన్నారు.
---
టీఆర్‌ఎస్‌ ఎంపీలు నల్లచొక్కాలు వేసుకొని నల్లికుట్ల పనిచేశారని ఎంపీ అర్వింద్‌ మండిపడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చౌరస్తాపై వదిలేశారని ఆయన విమర్శించారు. రైతుల శ్రమతో కేసీఆర్, కేటీఆర్, రైస్ మిల్లర్లు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రైతుల కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాజీనామా చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు.
---------
తెలంగాణ ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చీఫ్ సెక్రటరీ‌తో పాటు మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు జీతాలు పెంచుతూ మునిసిపల్ శాఖ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వెనక్కి తీసుకుంది. 
------
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫేక్ వీసాల గుట్టురట్టయింది. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళలను ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ మహిళలను ఏజెంట్ మోసం చేశాడా? లేక వారే ఉద్దేశపూర్వకంగా నకిలీ వీసాలతో వెళుతున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
---
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ యూపీ అధికార పక్షం బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోడ్డుపై కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగిలిపోవడం పాత సంప్రదాయం అని, కానీ రోడ్డుపై కొబ్బరికాయ కొడితే రోడ్డే పగిలిపోవడం కొత్త సంప్రదాయం అని ఎద్దేవా చేశారు. ఇదే బీజేపీ సాధించిన అభివృద్ధి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఉద్యోగాలు, విద్యారంగం అభివృద్ధి, రైతుల సమస్యలపై ప్రభుత్వం తిరోగమనంలో వెళుతోందని విమర్శించారు.
---