Read more!

ఏపీ అంబులెన్సులకు నో ఎంట్రీ.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో  ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఆస్పత్రుల అనుమతి కోసం షేషెంట్ల బంధువుల ఎదురుచూపులు చూస్తున్నారు. కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ పాస్‌లు ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

రామాపురం క్రాస్‌రోడ్ వద్ద అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపుతున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన వినోద అనే వృద్ధురాలికి పక్షవాతం వచ్చింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రి పత్రం చూపినా తెలంగాణ పోలీసులు అనుమతించడం లేదు. పరిస్థితి విషమంగా ఉంటే ఆంక్షలేంటని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ అంబులెన్స్‌లను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. పేషెంట్లను వదిలివస్తున్న అంబులెన్స్‌లను నిలిపివేయడంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ మాట్లాడుకున్నామని... కాళ్లు మొక్కుతామని తిరుపతికి చెందిన ఓ మహిళ వేడుకున్నా తెలంగాణ పోలీసులు కనికరించలేదు. అంబులెన్స్‌ను హైదరాబాద్‌కు పంపించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక సదరు మహిళ తన భర్తను అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తీసుకొచ్చింది. అయితే ఆక్సిజన్ బెడ్ లేవని ఆస్పత్రిలో చేర్చుకోలేదని మహిళ వాపోయింది. ఆక్సిజన్ బెడ్ కోసం  జీజీహెచ్ వద్ద  మహిళ వేచి ఉన్నప్పటికీ ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఏపీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి తమ ప్రాణాలు కాపాడాలని కొవిడ్ రోగోలు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండటంపై వారు మండిపడుతున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి కొవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ముందుగానే, హైదరాబాద్ ఆసుపత్రులని సంప్రదించి, బెడ్స్ బుక్ చేసుకునేందుకు, ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్’లో చికిత్స పొందేందుకు వచ్చే వారు కాల్ సెంటర్ నెంబర్లకు కాల్ చేస్తే, ఏ హాస్పిటల్‌లో బెడ్, అడ్మిషన్స్ ఖాళీగా ఉన్నాయో వారు సమాచారం తెలుపుతారు.