Read more!

శాంతి కపోతాలను తయారు చేద్దాం

ప్రతి మనిషి తన జీవితంలో ఎక్కువగా అనే మాట మనశాంతి కరువైంది అని. ఈ మనశాంతి మనసులో ఎలాంటి అలజడులు లేకుండా కలిగే ఒకానొక అనిర్వచనీయ భావన. అయితే ఇది కేవలం మనిషికి మాత్రమే కాదు. మనిషి నుండి సమాజానికి, సమాజం నుండి రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం ఇలా అన్నిటికి పాకుతూ ఉంటుంది. ఒక మనిషి విషయంలో దీన్ని మనశాంతి అని సంభోదిస్తే, సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం వీటన్నిటి కోణంలో శాంతి అని పిలుస్తాము. 

సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే కేవలం ఇలా జరుపుకోవడంతో శాంతి చేకూరుతోందా?? దేశాల మధ్య సామరస్యత కోసం, యుద్ధాలు జరగకుండా ఉండాలని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని అయినా కాసింత ప్రశాంతంగా ఆలోచించాలిప్పుడు.

ప్రారంభం ఎక్కడ??

హింస అనేది మనిషితో మొదలై సమాజంలో వేళ్ళూనుకుని అది కాస్తా పెరిగి పెద్దదై రాక్షసి రూపం దాల్చి సమాజాన్ని, దేశాన్ని ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది. ఇరుగు పొరుగు ఇళ్లలో మనుషులు కొట్టుకున్నట్టు, గొడవ పడినట్టు, ఇరుగు పొరుగు దేశాల గొడవలు, యుద్ధాలు. ఇవన్నీ మెల్లిగా మొదలై విశ్వరూపం దాల్చే విషవాయువులు. ఎంతో మందిని బలితీసుకుంటాయి.

చర్యలు ??

ప్రపంచ దేశాల మధ్య శాంతి కోసం జరిగే ఒప్పందాల కంటే మనుషుల మధ్య కలగాల్సిన అవగాహన చాలా ఎక్కువ ఉంది. ఇది ముమ్మాటికీ నిజం. కులం పేరుతోనో, మతం పేరుతోనో, ఆర్థిక, సామాజిక అసమానతల వల్లనో మనుషులను మనుషులు ఇబ్బంది పెట్టుకోవడం, బాధపెట్టుకోవడంలో అధిక అశాంతి నెలకొంటున్నది అనేది వాస్తవం. మనిషి అధికార దాహం కోసం చేసే చర్యలు కూడా మనుషుల మధ్య వైరానికి అశాంతి నెలకొనడానికి కారణం అవుతాయి. 

ఏమీ చేయాలి??

మనిషి నేరుగా ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు కానీ తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న కొందరిని అయినా మార్చగలడు. 

◆మొదట ఇంట్లో పిల్లలకు అహింస, శాంతి అంటే ఏమిటో వివరించి వారిని అహింసాయుత జీవితం వైపు నడిపించాలి. ఇక్కడ ముఖ్య విషయం వాళ్ళను నడిపిస్తూ వాళ్ళతో పాటు తల్లిదండ్రులు నడవడం ముఖ్యం.

◆ప్రతి పాఠశాలలో ఈ విషయం గురించి కేవలం వారానికి ఒకసారి చర్చ ఏర్పాటు చేయాలి. దీనిద్వారా పిల్లల్లో హేతుపూర్వకమైన అవగాహన తొందరగా వస్తుంది.

◆ గౌతమ బుద్ధుడు ఒకమాట చెబుతాడు. మనం ఆచరించినపుడే ఇతరులకు దాన్ని చెప్పాలని. కాబట్టి ఎపుడైనా ఎవరికైనా వీటి గూర్చి చెప్పాలని అనుకున్నప్పుడు తమని తాము మొదట విశ్లేషణ చేసుకుని తాము సరిగ్గా ఉన్నామని అనిపించినపుడు ఇతరులకు చెప్పాలి.

◆ ఒకమనిషి, ఒక కుటుంబం, ఒక వీధి, ఒక ఊరు ఇలా ప్రతి ఒకటి ఎలాంటి అలజడులకు లోను కాకుండా ఉంటే శాంతియుత సమాజం సాధ్యమవుతుంది. కాబట్టి వీలైనంతవరకు ప్రతి ఒక్కరు మరొకరితో సామరస్యంగా ఉండాలి. 

◆శాంతి కావాలంటే మొదట త్యజించాల్సినవి కోపం, అసూయ,ద్వేషం వంటి గుణాలు. నిజానికి మనిషిలో అలజడికి కారణాలు కూడా ఇవే. మనుషుల మధ్య శత్రుత్వానికి దారి తీసేవి ఇవే. వీటిని వధులుకుంటే శాంతి సాధ్యమే.

◆ప్రతి ఏడాది శాంతి అంటూ కపోతాలు ఎగిరేయగానే ప్రపంచం అంతా శాంతి నెలకొనదు. ఎగిరిన పావురం స్వేచ్ఛగా ఉండగలిగినపుడే దానికి సార్థకత. అంతేకానీ అలా ఎగరగానే మరొక చోట దాన్ని కబళించే హస్తాలు ఉండకూడదు మరి.

పెద్ద పెద్ద అంతరార్థాలలోకి కాకుండా పిల్లలకు వీలైనంత వరకు నిత్యజీవితంలో ఉత్తమంగా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇరుగుపొరుగు తర్ఫీదునిస్తే. మన పిల్లలే శాంతి కపోతాలు అవుతారు. ప్రపంచ శాంతిని నెలకొల్పుతారు. కాదంటారా మరి!!

◆ వెంకటేష్ పువ్వాడ