Read more!

రొమాంటిక్ డే

ఒక రొమాంటిక్ మూమెంట్ కావాలంటే పెద్ద హంగామా అక్కర్లేదు. కేవలం ఒక గులాబీ చాలు. గుండెల్లో దిగబడిపోయేంత ప్రేమను గమ్మత్తుగా, అంతే నిశ్శబ్దంగా ప్రసరించేలా చేస్తుంది గులాబీ. ముఖ్యంగా అమ్మాయిలకు, ప్రేమకు, గులాబీ కి ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు.  చాలామందికి గులాబీల దినోత్సవం అనగానే ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ డే సందర్భం గుర్తొస్తుందేమో కానీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22 ను ప్రపంచ గులాబీల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ప్రపంచ గులాబీల దినోత్సవం ఎలా పుట్టింది?? ఈ గులాబీ రోజు ప్రత్యేకత ఏమిటంటే…..

గులాబీల దినోత్సవం

గులాబీల దినోత్సవం అనగానే చాలామంది ప్రేమ దోమ అనుకుంటూ హార్ట్ బీట్ పెంచుకుంటూ ప్రపోజ్ చేయడానికి పరిగెడతారేమో అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.

కెనడాలో మొట్టమొదటిసారిగా కాన్సర్ పేషెంట్ లు తొందరగా కోలుకోవాలని వాళ్లకు ఆహ్లాదాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి గులాబీ పూలను ఇచ్చారట. పువ్వులు అంటేనే ఆశకు, మానసిక పరిపక్వతకు సూచిక. అలాంటి పువ్వులను అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వడం వల్ల వారిలో నూతనోత్తేజం ఉత్పన్నమవుతుందని నమ్మకం. అలా కెనడా లో పుట్టిన ఈ అలవాటు అన్ని దేశాలకు విస్తరించింది. అదే ప్రస్తుతం అన్ని చోట్లా కూడా ఎవరైనా అనారోగ్యానికి గురైనపుడు వారిని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు గులాబీ పువ్వులను తీసుకెళ్లడంలో అంతార్థం. చాలామందికి ఈ విషయం తెలియకపోయినా ఒక ఫార్మాలిటీగా అలా ఫాలో అయిపోతుంటారు. 

ఇక ఈ గులాబీలు మాత్రమే ఎందుకు ఇచ్చారు ఇన్ని పువ్వులు ఉండగా అనే ప్రశ్న కూడా చాలమందిని తొలిచేస్తూ ఉంటుంది కాబోలు. ఈ గులాబీ చరిత్ర తెలిస్తే దాన్ని ఇలా వాడటం సబబే అనిపిస్తుంది. దాదాపు 35 మిలియన్ సంవత్సరాల కిందటే గులాబీలు ఉన్నాయినంటే ఆశ్చర్యం వేస్తుంది.  ఈజీపు మహారాణి క్లియోపాత్ర కాలంలో ఈ గులాబీ ప్రేమకు ప్రతిరూపంగా వాడటం మొదలుపెట్టారు. 

గులాబీలను మనం అలంకరణ కోసం లేదా తలలో పెట్టుకోవడానికి లేదా ఎవరికైనా ఇవ్వడానికి ఇలా మాత్రమే వాడతాం. అందుకే మనకు గులాబీల రహస్యం తెలియదు. పాశ్చాత్య దేశాల్లో గులాబీ రేకులతో టీ చేసుకుని తాగుతారు. ఆయుర్వేదపరంగా ఇది ఎంతో మంచిది. పంచదార, గులాబీరేకులు కలిపి తయారు చేసే గుల్కండ్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్వచ్ఛమైన రోజ్ సిరప్ వంటివి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో దోహాధం చేస్తాయి.

ఇవే కాకుండా గులాబీలను సౌందర్య సాధనంగా విరివిగా ఉపయోగిస్తారు. సౌందర్య ఉత్పత్తులలో అగ్రస్థానం గులాబీలదే. మగువ అందాన్ని, మగువకు సరితూగే మనోహరాన్ని గులాబీల మాత్రమే చూడగలం అంటే అతిశయోక్తి కాదు. 

అంతేకాదండోయ్ గులాబీ ఏ విధంగా చూసినా నెంబర్ వన్ గా దూసుకుపోతుంది. సాహిత్యంలో కవులకు గులాబీ ఒక స్వర్గ ద్వారం లాంటిదంటే వారి మనసులో దాని స్థానం ఏమిటో అర్థం చేసుకోండి. పాశ్చాత్యులకు, ప్రణయ కథకులకు, ప్రేమకు, పరామర్శకు  ఇలా ప్రతి దానికీ గులాబీకి ఓట్ వేసేవారు ఎక్కువ. అయితే అభివృద్ధి చెందుతున్న కాలంతో పాటు ఈ గులాబీ కూడా కొత్త సొబగులు అద్దుకుని నిత్యవసంతంలా తయారైపోతుంది ఎలా అంటే…..

ఎన్నెన్నో వర్ణాలు అన్నిట్లో  అందాలు….

రంగులు రంగుల పువ్వులు, అందులో ఒకే పువ్వు రంగులు మాత్రం అబ్బో ఎన్నో….  ఇంద్రధనస్సును కూడా చిన్న బుచ్చుకునేలా చేస్తాయి ఈ గులాబీ కుసుమాలు. అయితే ఈ గులాబీలలో ఒకో రంగు పువ్వుకు ఒకో ప్రత్యేకత, అందులో నిఘూడార్ధం ఉన్నాయి.

రంగుల్లో రహస్యం

ఎరుపు : ఎరుపు గులాబీ ఎవరికైనా ఇవ్వాలన్నా, ఎవరి నుండి అయినా అందుకున్నా అది నిజమైన  ప్రేమకు చిహ్నం. దీన్ని ఎక్కువగా ప్రేమికులు వాడేస్తుంటారు.

పసుపు : ఈ పాసులు రంగు గులాబీకి ఎక్కువ గుణాలు ఇచ్చేసారు రంగుల గూర్చి విశ్లేషించిన వాళ్ళు. ఆనందం, స్నేహం, సంతోషం, జ్ఞాపకం మొదలైనవాటిని వ్యక్తం చేసేటపుడు పసుపు గులాబీ ఉపయోగించాలట.

తెలుపు :  తెలుపు అంటే ఒక శాంతి, స్వచ్ఛత,  పవిత్రత.  అలాంటి సందర్భాలలో తెలుపు గులాబీ వాడాలి.

ముదురుగులాబీ : ఏవరైనా మనకోసం ఏదైనా చేసినపుడు వారికి  కృతజ్ఞతా పూర్వకంగా ముదురు గులాబీని ఇవ్వచ్చు.

నారింజ : ఈ గులాబీ తమలో ఉన్న ఉత్సుకతను తెలిపే సందర్భంలో, తమ మనసులో చోటు చేసుకున్న ఊహ ప్రపంచానికి గుర్తుగా వాడుతుంటారు.

ఎరుపు-పసుపు మిశ్రమం : సాదారణంగా కలయిక అనేదే సంతోషం కలిగించేదిగా భావిస్తారు. అలాగే ఎరుపు-పసుపు రంగుల గులాబీని సంతోషం వ్యక్తం చేసే సందర్భాలలో ఉపయోగిస్తారట

ముధుర గోధుమ-ఎరుపు : ఈ రెండిటి కలయికలో ఉన్న గులాబీ ఆనందాన్ని కోరుకోవడం, లేదా వ్యక్తం చేయడం కోసం ఉపయోగిస్తారు.

ఎరుపు-తెలుపు : ఇవి రెండు రంగులు ఐకమత్యంను తెలుపుతాయి. అందుకే మరి మనుషుల మధ్య ఐకమత్యం పెంపొందాలి. ఈ ఎరుపు తెలుపుల విరబూయాలి.

లేత పసుపుపచ్చ : ఇది చాలా రొమాంటిక్. మనసులో కోరికను వ్యక్తం చేయడానికి ఈ లేత పసుపుపచ్చ గులాబీని ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఈ లేత పసుపు గులాబీ ఎక్కువగా తిరుగుతుంటుంది.

గులాబీ వెనుక, ఈ ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక, గులాబీ రంగుల వెనుక ఇంత కథ ఉందన్న మాట. అందరికీ ఎరుపు-తెలుపు గులాబీలతో ప్రపంచ గులాబీల దినోత్సవ శుభాకాంక్షలు.

◆ వెంకటేష్ పువ్వాడ