Read more!

అతి విశ్వాసం వద్దు- ఆత్మ విశ్వాసం చాలు

మనుషులలో రెండు రకాలు ఉంటారు. ఆదర్శవంతులు, పనిమంతులు. సమాజ పురోభివృద్ధికి ఇద్దరూ అవసరమే. ఆదర్శవంతులైన వారికి ఆచరణాత్మకత ఉంటే మారుతున్న పరిస్థితుకకు అనుగుణంగా వారి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. తద్వారా కార్యరంగంలో తమ ప్రణాళికలను విజయవంతంగా అమలుపరచగలరు. కానీ పనిచేయడానికి అవసరమైన సాధ్యా సాధ్యాలను గమనించుకోకుండా తమ ఆదర్శాలనే అంటిపెట్టుకొని ,ఆయా రంగాలిలో అనుభవన్నీ పొంది వారి సలహాను వినకుండా,ఇతరల నుండి ఎటువంటి సలహాను తీసుకోవడానికి ఇష్టపడకుండా, మొండితనాన్ని చూపే వారిని అతివిశ్వాసం గలిగినవారిగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు జీవితంలో ఎప్పుడూ విమానం ఎక్కనివాడు తానే విమానం నడుపుతానుఅని అంటే ఎలా ఉంటుందో, ఎప్పుడూ చేతిలో తుపాకీ పట్టనివాడు యుద్ధానికి సిద్ధపడితే ఎలా ఉంటుందో, నీరు అంటేనే బయపడేవాడు సముద్రాన్ని ఈదుతాను అంటే ఎలా ఉంటుందో అతి విశ్వాసం కలిగినవాడు ప్రవర్తన కూడా అలా ఉంటుంది.

మహా పరాక్రము శక్తి కలిగిన అభిమాన్యుణ్ణి చూడండి. అతను శక్తివంతుడే కానీ పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలుసు, తిరిగి రావడం తెలీదు. ఇది అభిమాన్యుడికి కూడా తెలుసు కానీ అతి విశ్వాసంతో ఎలాగోలా తిరిగి రావచ్చు అని వెళ్లి ప్రాణాలు త్యాగం చేసాడు. దుర్యోధనుడు కూడా ఇదే తప్పు చేసాడు. శ్రీ కృష్ణుడే పాండవుల వైపు ఉన్నాడు. వారి శక్తి తెలుసు. అయినా ఫలితాన్ని అంచనా వేయక గుడ్డిగా కర్ణుణ్ణి నమ్మి సర్వం కోల్పోయాడు.

కొంతమంది అద్భుతాలు చేయగల శక్తి కలిగినవాళ్లు ఉంటారు. అలాంటివాళ్లు తమ శక్తి తెలియక సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసుకొని పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారికి కొంచెం ప్రేరణ కలిగించి ఉత్తేజం కలిగించి,వారి శక్తిని వాళ్లకి గుర్తు చేయగలడం అవసరం. ఆ మరుక్షణమే  వాళ్లు అసాధ్యం అని అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేసి చూపిస్తారు.

మహా బలవంతుడైన హనుమంతుడి సముద్రాన్ని దాటడానికి కావాల్సిన బలం శక్తి తనకు ఉన్నాయని తెలీదు. జాంబవంతుడు తన శక్తిని గుర్తు చేయగానే అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక్క దూకులో సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మని చూసి లంకను కాల్చి వచ్చాడు.

◆స్వామి వివేకానంద

"నేను బలహీనుణ్ణి అని ఎప్పుడూ చెప్పకూడదు. దిగజారుడుతనంలా కనిపించే ఆ పై పొర కింద ఎటువంటి గొప్ప శక్తులు దాగున్నాయో ఎవరికి తెలుసు? నీలో ఉన్న అపారమైన శక్తిని గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. నీవెనుక అనంత శక్తి సముద్రం, ఆనంద సాగరం ఉంది" అంటారు వివేకానంద. కనుక ఆత్మ విశ్వాసానికి అతి విశ్వాసానికి మధ్య ఉన్న సన్నని గీతను గమనంలో ఉంచుకొని మనం ముందుకు నడవాలి. అదే సమయంలో నీ శక్తిని నీవు గ్రహించక నిరాశ నిస్పృహలకు లోనుకాకు. ఆత్మ విశ్వాసమే మహాబలము.

◆ వెంకటేష్ పువ్వాడ