Read more!

కాళ్లకు చెప్పులు లేకుండా ఫోర్డ్ కంపెనీకి వెళ్లిన కుర్రాడు

రాజస్థాన్,ఉదయపూర్ కి చెందిన "భవేష్ లోహార్" కి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు. అనే మాట సరిగ్గా సరిపోతుంది. "మనం నిద్రలో కనేది కాదు కల-మనకు నిద్రలేకుండా చేసేది కల" అని అబ్దుల్ కలాం చెప్తారు. భవేష్ జీవితం ఈ మాటలకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.  తన లక్ష్యం కోసం ఎన్నో నిద్రలేని రాత్రుల్ని జయించాడు.సాధారణమైన గృహ నిర్మాణ పనులకు వెళ్లే కార్మికుడి యొక్క కొడుకు భవేష్. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ నేపధ్యం. కానీ తన ఆర్ధిక పరిస్థితి కి కుంగిపోలేదు. కష్టపడి చదివాడు. గెలిచాడు. ఫోర్డ్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు. ఈ ప్రయాణంలో  వెన్నంటే ఉండి ప్రోత్సహించి స్నేహితులకు, తన కోసం ఎంతో త్యాగం చేసి కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్లిన తల్లికి, సోదరిమణులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవేష్ "లింక్డ్ ఇన్" అనే సామాజిక మాధ్యమంలో తన విజయనందాన్ని క్లుప్తంగా చెప్తూ పోస్ట్ చేసాడు. ఇది బాగా వైరల్ అవుతుంది. 

భవేష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ లో ఇంజినీరింగ్ విద్యార్థి. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కష్టపడి కొడుకుని చదివించారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో హాస్టల్ మూసేయడంతో భవేష్ చేసేదేమీ లేక ఇంటికొచ్చాడు. ఒకే ఒక గది కలిగిన రూమ్. తనతో చేర్చి ఆరేడుగురు కలిసి ఆ ఇంట్లో ఉండాలి. అయితే అందులోనే తనకి ప్రత్యేకమైన గదిని తనకి అనుకూలంగా తయారు చేసుకొని పట్టుదలగా చదివాడు. ఆ చిన్న గదినుంచే ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నాడు. ఆ చిన్న గదినుంచే ఎన్నో ఆన్లైన్ పరీక్షలు రాసాడు. చివరకి తనకి ఎంతో ఇష్టమైన ఫోర్డ్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు.

◆భవేష్ ఏం చెప్పాడు..

చిన్నపుడ ఎండకు కాలిపోయే హైవే వెంట నడుచుకుంటూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేవాన్ని. దారి వెంట వెళ్లేటప్పుడు కనిపించే కార్లని చూసి స్నేహితులతో పెద్దయ్యాక గొప్ప ఉద్యోగం సాదించాక  పెద్ద కార్  తీసుకోవాలి అని, అలా కార్లమీద ప్రేమని పెంచుకొన్నాను. అప్పట్లో వార్తా పత్రికల్లో వచ్చే ఫోర్డ్ కంపెనీ కార్ల ప్రకటనలు ఎంతో ఆకర్షించేవి.ఆ రోజులు మర్చిపోను. ఎపుడూ గుర్తుపెట్టుకుంటాను.

నా తల్లి ఏరోజు కోసం ఎదురు చూసిందో ఆరోజు వచ్చింది. ఈరోజు నేను ఫోర్డ్ మోటార్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాను.

నా ప్రయాణంలో అనుక్షణం వెన్నంటే ఉండి, తమ సొంత కలల్ని త్యాగం చేసి నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన అక్కలకు నా కృతజ్ఞతలు. చిన్నపుడు ఏడు ఎనిమిది వేల జీతంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉన్న రోజుల్లో అమ్మ ఇళ్ల పనికి వెళ్లి కుటుంబానికి, నా కళాశాల చదువుకు ఆసరాగా నిలబడింది. పెద్దయ్యాక నేను ఉద్యోగంలో చేరితే నీకు పని చేసే అవసరం ఉండదు అని చెప్పిన మాటలు ఈరోజు నిజమయ్యాయి. 

కళాశాల విద్య కోసం కొన్ని రోజులు పార్ట్ టైం ఉద్యోగం చేసాను. ఆ సమయాల్లో కళాశాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

నా జీవితంలో ఈ పోరాటాలన్నీ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కష్టాలన్నీ నన్ను మరింత రాటు తేల్చాయి అనుకుంటున్నా.

ఇంతకన్నా కఠినమైన జీవితాన్ని ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉన్నారని నాకు తెలుసు. అయితే మన సంకల్పం గొప్పగా ఉండి నిజాయితీగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాదించగలం. గీతలో చెప్పినట్లు "కర్మ కియే జా ఫాల్ కి చింతా నా కర్” దేవుడు ముందుగానే  మనకోసం మంచి జీవిత ప్రణాళికలను అనుకుంటాడు.

నా ప్రయాణంలో సహకరించి స్ఫూర్తిదాయకమైన మాటలతో నన్ను ముందుకు నడిపిన బబ్బర్ బయ్యాకి మరియు ఉద్యోగంలో చేరిన మొదటి రోజుని గుర్తుండిపోయేలా చేసిన శ్రీజన ఉపాధ్యాయ, యస్ రతి వైశాలి, ధనుంజయ్ సర్ కి నా కృతజ్ఞతలు.

ఇలా "భవేష్ లోహార్" తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. 

◆ వెంకటేష్ పువ్వాడ