Read more!

'మాస్క్‌ తీసేదేలే'.. మాస్క్ పెట్టి, డైలాగ్ మార్చిన బ‌న్నీ..

పుష్ప‌.. పుష్ప రాజ్‌.. త‌గ్గేదేలే.. ఇది పుష్ప సినిమాలో పాపుల‌ర్‌ డైలాగ్‌. దీన్ని కొంచెం చేంజ్ చేసి.. డెల్టా అయినా, ఒమిక్రాన్‌ అయినా.. మాస్క్‌ తీసేదేలే.. అంటూ కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌చారం మొద‌లుపెట్టింది. జ‌స్ట్ డైలాగ్ మాత్ర‌మే కాదు.. పుష్ప ఫేస్‌నూ వాడేసుకుంటోంది. పుష్ప గెట‌ప్‌లో ఉన్న‌ అల్లు అర్జున్ ముఖానికి మాస్క్ వేసి మ‌రీ.. మీమ్ క్రియేట్ చేసింది కేంద్ర స‌మాచార మంత్రిత్వ శాఖ‌.

పుష్ప సినిమా సూప‌ర్ హిట్‌. అందులో బ‌న్నీ గెట‌ప్ అదుర్స్‌. త‌గ్గేదేలే.. డైలాగ్ కేక‌. తెలుగులోకంటే బాలీవుడ్‌లో పుష్ప మూవీ మాంచి హిట్ అందుకుంది. ఉత్త‌రాదిన ఫుల్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. పుష్ప మూవీతో బ‌న్నీ.. పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మారిపోయారు. అందుకే, కేంద్ర ప్ర‌భుత్వ క‌న్ను ఆ పుష్ప‌పై ప‌డింది. ఎవ‌రు చెబితే ప్ర‌జ‌లు ఆస‌క్తిగా వింటారో.. వారిని త‌న ప్ర‌చారానికి వాడేసుకుంటోంది. అందుకే మ‌న బ‌న్నీ అలియాస్ పుష్ప‌రాజ్‌ను సెలెక్ట్ చేసుకుంది కేంద్రం.

తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బ్లాక్‌ బస్టర్ ‘పుష్ప.. ది రైజ్‌’ సినిమాను ఎంచుకుంది. ‘తగ్గేదేలే’ డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్‌ చేసింది.   

కరోనా వైరస్‌పై తాజా సమాచారాన్ని అందించేందుకు '#IndiaFightsCorona @COVIDNewsByMIB' పేరుతో సమాచార మంత్రిత్వ శాఖకు ప్రత్యేకంగా ఓ ట్విటర్‌ పేజీ ఉంది. ఈ ట్విటర్‌ ఖాతాలో ఈ మీమ్‌ పోస్ట్ చేసింది. పుష్ప‌ స్టిల్‌ను ఎడిట్‌ చేసి.. బ‌న్నీకి మాస్క్ పెట్టి.. ఇంట్రెస్టింగ్ కొటేష‌న్‌ యాడ్ చేశారు. ‘‘పుష్ప.. పుష్ప రాజ్‌.. తగ్గేదేలే’’ ను మార్చేసి.. ‘‘డెల్టా అయినా ఒమిక్రాన్‌ అయినా.. మాస్క్‌ తీసేదేలే’’ అంటూ మీమ్ క్రియేట్ చేశారు. ఆ మీమ్‌ క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. 

‘‘పుష్ప.. పుష్పరాజ్‌.. ఎవరైనా..! కొవిడ్‌పై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నాలుగు విషయాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ మాస్క్‌ ధరించాలి. తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి’’ అని ఈ పోస్ట్‌కు జత చేశారు. అల్లుఅర్జున్, రష్మిక మందానను ఈ ట్వీట్‌కు ట్యాగ్ చేసింది కేంద్ర స‌మాచార మంత్రిత్వ శాఖ‌.