Read more!

కొండను తవ్విన ‘టన్నెల్ మేన్’కు ‘పద్మశ్రీ’

‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు మన పెద్దలు.. ఎలాంటి లక్ష్యం కోసమైనా కష్టపడి పనిచేసిన వారికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ మాటలకు అక్షరాలా సరిపోతాడు కర్ణాటకు చెందిన 77 ఏళ్ల అమయ్మహాలింగ నాయక్. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన దేశ అత్యున్నత  ‘పద్మ పురస్కారాల’లోని  పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు ఈ వ్యవసాయ కష్టజీవి. వ్యవసాయంలో మహాలింగ నాయక్ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఆయనకు పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వ్యవసాయంలో మహాలింగ నాయక్ చేసిన కృషి ఏంటి? ఏం సాధించాడో తెలుసుకునేందుకు  సోషల్ మీడియాలో నెటిజన్స్ బాగా సెర్చ్ చేస్తున్నారు. బంజరు భూమిని చక్కని పంటలు పండే క్షేత్రంగా మార్చేయడమే మహాలింగ నాయక్ కృషికి నిదర్శనం.

‘సురంగ మేన్’ లేదా ‘టన్నెట్ మేన్’ అని పిలుచుకునే అమయ్ మహాలింగ నాయక్ కర్ణాటక రాష్ట్రంలోని మంగలూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేపు గ్రామంలో నివసిస్తున్నాడు. కేంద్రం తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల మహాలింగ నాయక్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 1970లలో తనకు కొండశివారులో ఉన్న భూమిని ఇచ్చిన మహాబల భట్ ను మహాలింగ నాయక్ గుర్తుచేసుకుంటున్నాడు. కొండశివారులో ఉన్న బంజరు భూమిని సుక్షేత్రంగా మార్చేందుకు మహాలింగ నాయక్ ఒంటరిగానే కృషి చేశాడు.

నీటి సదుపాయం లేని తన పొలానికి నీటి సదుపాయం కల్పించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాడు. కొండకు అవతల వైపున పారే నీటిని తన పొలంలోకి తీసుకురావాలనే భగీరథ ప్రయత్నం చేశారు. అలుపు, విరామం లేకుండా కొండను 40 ఏళ్ల పాటు కష్టపడి తవ్వి సొరంగం ఏర్పాటు చేశాడు మహాలింగ నాయక్. మహాలింగ నాయక్ తన కొండ పొలంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నాడని ఓ జాతీయ మీడియా సంస్థ కథనంలో పేర్కొనడం గమనార్హం. టన్నెల్ మేన్ మహాలింగ నాయక్ ఇప్పుడు తన పొలానికి ఎలాంటి పంపు,పైపు వాడకుండా సమృద్ధిగా నీటి సరఫరా జరిగేలా చేశాడు. తన కొండపొలంలో అనేక కొబ్బరి, అరటి చెట్లు, మిరియాల సాగుతో పాటుగా సుమారు 300 వక్క చెట్లను కూడా పెంచుతున్నాడు.

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన అమయ్ మహాలింగ నాయక్ ను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఏమి ఆ జీవితం!.. ఏమి సాధించాడబ్బా!.. కర్ణాటక సింగిల్ మేన్ ఆర్మీ!’ అంటూ ప్రశంసలతో ముంచెత్తడం విశేషం.

అమయ్ మహాలింగ నాయక్ చదువులోలేదు.. అయితేనేం.. చక్కని నైపుణ్యాలు పుణికిపుచ్చుకున్న పనివాడు. రెండు ఎకరాల బంజరుభూమిని సాగుభూమిగా మార్చేందుకు నాలుగు దశాబ్దాల పాటు ఒక్కడే కష్టపడ్డాడు. కొండలోపల లోతైన సొరంగం తవ్వాడు. తన కొండపొలం కోసం సొరంగా తవ్వడంతో సరిపెట్టకుండా ఈ గ్రేట్ టన్నెల్ మేన్ మరి కొన్ని సొరంగాలు తవ్వుతుండడం అందరికీ స్ఫూర్తిదాయకం.