Read more!

కృష్ణావతారంలో ఎన్టీఆర్ విగ్రహం.. ఆవిష్కరణకు జూ.ఎన్టీఆర్‌!

రాముడన్నా ఆయ‌నే. కృష్ణుడ‌న్నా ఆయ‌నే. వెండితెర వేల్పు.. నంద‌మూరి తార‌క రామారావు. రాముడిగా ఒదిగిపోయారు. శ్రీకృష్ణుడిగా అల‌రించారు. అందుకు, ఆ త‌రం తెలుగు ప్రేక్షకుల‌కు రాముడైనా, కృష్ణుడైనా రామారావే. అంతెందుకు.. అప్ప‌ట్లో ప్ర‌ధాని ఇందిరాగాంధీ సైతం.. కృష్ణుడి గెట‌ప్‌లో ఉన్న ఎన్టీఆర్ క‌టౌట్ చూసి దేవుడేన‌ని భ్ర‌మ‌ప‌డి దండం పెట్టారు. అలా, శ్రీకృష్ణావ‌తారంలో అన్న ఎన్టీ రామారావు న‌టించి జీవించారు. తెలుగుజాతి యుగ‌పురుషుడిగా నిలిచారు. 

మే 28న ఎన్టీఆర్ 100వ జ‌యంతి సంద‌ర్భంగా ఖ‌మ్మం న‌గ‌రంలోని ల‌కారం ట్యాంక్‌బండ్‌పై దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో కృష్ణుడి రూపంలో ఉన్న ప్రతిమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మే 28న ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్ర‌హ‌ ఆవిష్కరణ చేయాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. 

హైద‌రాబాద్ హుస్సేన్‌సాగ‌ర్ మ‌ధ్య‌లో బుద్దుని విగ్ర‌హం మాదిరే.. ఖ‌మ్మం ల‌కారం ట్యాంక్‌బండ్‌పై శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. బేస్‌మెంట్‌తో క‌లిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం ఎటు చూసినా.. 36 అడుగుల పొడవు వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​పై అమర్చనున్నారు. 

2.3 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాంకేతికతతో.. వర్మ అనే చిత్రకారుడు ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు అంద‌జేస్తున్నారు. 

మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం, దానవీరశూరకర్ణ లాంటి సినిమాలలో కృష్ణుని వేషధారణలో వెండితెర ఇలవేల్పుగా అల‌రించిన ఎన్టీఆర్‌.. ఇక ఖ‌మ్మం ల‌కారంలో శ్రీకృష్ణుని అవతారంలో పర్యాటకులను శాశ్వ‌తంగా ఆకర్షించనున్నారు. జై ఎన్టీఆర్‌.. జైజై ఎన్టీఆర్‌.