Read more!

రాష్ట్ర ప్రయోజనాల ధ్యాసే లేదు.. జగన్ దంతా రాజకీయ ప్రయోజనం గోలే!

క‌లిసొచ్చిన కాలాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలంటారు. క‌లిసొచ్చిన కాలాన్ని కాల‌ద‌న్నుకోవ‌డం జ‌గ‌న్‌కే సాధ్య‌ప‌డింద‌ని ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు జ‌గ‌న్‌.  రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఈసారి తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. దేశంలోని విప‌క్షాల‌న్నీ క‌లిసి కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హాను ప్ర‌క‌టించాయి. బిజెపి మిత్ర‌ప‌క్షాలు   ద్రౌప‌ది ముర్మూను ఖ‌రారు చేశాయి. ఈ ప‌ర్యాయం రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఏక‌ప‌క్షం కాకుండా చూడాల‌ని గ‌ట్టిగా య‌త్నించ‌డంలో సిన్హాకు మ‌ద్ద‌తు తెలియ‌జేయ‌మ‌ని జ‌గ‌న్‌కు విప‌క్షాలకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ కూడా రాశారు.

కానీ జ‌గ‌న్ ఏడిఏ అభ్య‌ర్ధి ముర్మూకే మ‌ద్ద‌తు తెలిపారు. నిజానికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో వైసీపీ మ‌ద్ద‌తు ఎన్డీయేకి చాలా అవ‌స‌రం. అలాంట‌పుడు కేంద్రం నుండి రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల దృస్ట్యా ఎలాంటి హామీ తీసుకోకుండానే జ‌గ‌న్ ఓకే అనేయ‌డం దారుణ‌మ‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్రాన్ని నిల‌దీయ‌డానికి ఇంత‌కంటే మంచి అవ‌కాశం ఇక ముందు కూడా దొర‌క‌ద‌ని హోరెత్తుతూనే వున్న విప‌క్షాల‌ది కేవ‌లం అర్ధంలేని గోలగానే జ‌గ‌న్ భావించారా?   లేక కేంద్రానికి ఈసారి సాయం చేసి ఆ త‌ర్వాత రాష్ట్రానికి రావ‌ల‌సిన‌వి అడుగుదామ‌నుకున్నారా? జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో తెలియ‌దు. కానీ అదే ధ్యాస‌లో వుంటే మాత్రం చాలా త‌ప్పిదం చేసిన‌ట్టే అవుతుంది.

ఇపుడు చేతికి అందిన అవ‌కాశాన్ని చేజేతులా వ‌దులుకోవ‌డంలో స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న చూప‌డం అర్ధ‌ర‌హిత‌మే అవుతుంది. జగన్ తీరు వల్ల రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించుకోలేని పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసుల భయంతోనే జగన్ ఇలా చేశారని విమర్శిస్తున్నాయి.

రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు ఇటీవలి కాలంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేంద్రం నుండి తమకు రావలసిన హక్కులను సాధించుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రతిపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఎన్డీయే అభ్యర్ధి ముర్మూకు మద్దతు తెలపడం జగన్ అసమర్ధతే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనీస స్థాయిలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఊసేలేదు. అటు ఎన్డీయే గానీ ఇటు విపక్షాలుగానీ కనీసం చంద్రబాబు వంక తొంగిచూడలేదు. 

జగన్ మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతివ్వడం ద్వారా రాజకీయంగా జగన్ కు మంచే జ‌రిగింద నుకుంటున్నారు విశ్లేషకులు. జగన్ తన నిర్ణయంతో బీజేపీకి క్లోజ్ అవుతూనే.. ఆ పార్టీతో దోస్తీ చేయాలన్న చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారన్న చర్చ జరుగుతోంది. ఐతే ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యత ఇచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితులున్నా సద్వినియోగం చేసుకోలేదన్న విమ ర్శలు వస్తున్నాయి.

మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరించి విభజన సమస్యలు పరిష్కరించుకొని ఉంటే బావుండేదని.. అలా కాకుండా ఊరుకి ముందే మద్దతు తెలిపడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో ఉంది. అలాంటిది కేంద్రాన్ని నిలదీసే అవకాశం వచ్చిందినా వదిలేశారన్న మాట కూడా వినిపిస్తోంది. అంతేకాదు అవసరం తీరిన తర్వాత బీజేపీకి ఎవరైనా ఒకటేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి.