Read more!

త‌గ్గేదే లే... జూప‌ల్లి

అంతా బాగానే వుంది, పార్టీలో ఎటువంటి పొర‌పొచ్చాల్లేవు, విభేదాలు అస‌లే లేవ‌ని విర్ర‌వీగుతున్న టిఆర్ఎస్ పార్టీకి కొల్హాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో గొడ‌వ త‌ల‌ భారంగానే మారింది. అక్క‌డ కొంత‌ కాలం నుంచి జూప‌ల్లి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి మ‌ధ్య మాట‌ల య‌ద్ధం వూహించ‌ని స్థాయికి చేరుకుంది. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్‌ చాలెంజ్‌ చేస్తూ బహిరంగ చర్చకు సిద్దమంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆదివారం కొల్లాపూర్‌ లో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్‌ కొల్లాపూర్‌ చేరుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు అప‍్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతి లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు.. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.  కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ ఇంటి వద్ద పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు గృహ‌నిర్భంధం చేశారు.

కేసీఆర్ తొలి మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన జూప‌ల్లి కృష్ణ‌రావు, 2018లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీచేసిన బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. త‌ర్వాత బీరం టీఆర్ ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి జూప‌ల్లి, బీరం మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు అభివృద్ధి విషయంలో సవాళ్లు విసురుకున్నారు. ఇటీవల కాలంలో ఇది మరిం తగా ముదిరింది. జూపల్లి, బీరం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా కొల్లాపూర్ నియోజకవర్గంలో గొడవలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభి వృద్ధిపై తనతో చర్చకు రావాలని జూపల్లి సవాల్ చేయగా.. బీరం కూడా సై అన్నారు. అంబేడ్కర్​ విగ్రహం దగ్గరకు రావాలని సవాల్ చేసుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగానే ఇద్దరు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు.ఇటీవలే నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్  జూపల్లి, హర్షవర్ధన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. జూపల్లి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లా డారు. కేటీఆర్ టూర్ తర్వాత పరిస్థితి చక్కబడుతుందని కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు భావించారు. కాని సీన్ మరోలా మారింది. విభేదాలు మరింతగా ముదిరిపోయాయి. అంతేకాదు శనివారం జూపల్లి సంచలన కామెంట్లు చేశారు.

ఎమ్మెల్యేకు తనకు మధ్య జరిగే చర్చకు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొల్లాపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరే తేల్చుకుంటానని చెప్పారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తే చేతులు కట్టుకుని ఇంట్లో ఎలా కూర్చూంటానని జూపల్లి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎంత దూరమైనా వెళతానని జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్త‌ల‌పైనా స్పందించిన జూపల్లి అవన్ని తప్పుడు వార్తలని అన్నారు.