Read more!

భయాన్ని జయించే మంత్రం!!

జీవితంలో మనిషి కలలు చాలా ఉంటాయి. అయితే కలను నిజం చేసుకోవడానికి ఒక్కో ప్రయత్నం చేస్తూ వెళ్తాడు మనిషి. ఆ ప్రయత్నం అందరి జీవితంలోనూ సఫలం అవ్వడం లేదు ఎందుకు??  
ప్రశ్నించుకుంటే చుట్టూ బోలెడు కారణాలు కనబడతాయి. అయితే అవన్నీ తమను, తమ సామర్త్యాన్ని తక్కువ చేసుకోకుండా కప్పిపుచ్చుకునే చక్కెర గుళికలు. ఎప్పుడైతే మనిషి శరీరానికి చక్కెర శాతాన్ని
ఎక్కువగా అందిస్తాడో అప్పుడే డయాబెటిస్ వైపు అడుగులు వేగంగా పడిపోతాయి. ఫలితంగా ఏదో ఒకరోజు శరీరమంతా చక్కెర వ్యాధితో నిండిపోయిందనే వార్త వినాల్సివస్తుంది. అలాంటిదే జీవితంలో ఈ కప్పిపుచ్చుకోవడం కూడా. 

నిజానికి మనిషి ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. 

తనకు నచ్చింది చేయడానికి భయం, ఎవరైనా ఆ పనిని వేలెత్తి చూపుతారని.

పని చేసాక అపజయం ఎదురైతే భయం. తను ఆ పనిని అంత శ్రద్దగా చేయలేదనే విమర్శ ఎదురవుతుందని.

విజయం సాధించగానే భయం. తదుపరి విజేతగా కొనసాగుతూ ఉండగలనా లేదా అని.

రేపు అంటే భయం. ఏమవుతుందో ఏంటో?? అని.

ఇట్లా అడుగడుగునా అన్నీ భయాలే….. 

వీటికి కారణం ఏమిటి?? అని ఒకసారి ఆలోచిస్తే అందరూ చేస్తున్న భయంకరమైన తప్పేంటో తెలిసిపోతుంది. అది చేదు గుళికలా అనిపించినా తమని తాము సరిదిద్దుకునే ఔషధం అవుతుంది. 

ఇంతకు ఆ తప్పేంటి అంటే, గతాన్నో, భవిష్యత్తునో ఆలోచిస్తూ వర్తమానాన్ని వృథా చేయడం. మనం జీవించాల్సిన అమూల్యమైన క్షణాలను గతం లిస్ట్ లోకి పనికిమాలిన క్షణాలుగా మార్చి పడదోయడం. మనిషికి ఆలోచన మంచిదే. తమని తాము విశ్లేషించుకోవడం ద్వారా తదుపరి అడుగులను మరింత మెరుగ్గా వేసేందుకు దోహాధం చేస్తుందది. అయితే ఎప్పుడూ అదే ఆలోచన చేయడం వల్ల, ఆలోచనల్లో, ఊహల్లో తప్ప ఎక్కడా మనిషి ఉనికి కనబడనంత పాతాళంలోకి తోస్తాయి అవి. అంతే కాదు ఇలా ఎప్పుడూ ఆలోచించడం వల్లే ప్రతి పనిలో భయం తొంగిచూస్తూ ఉంటుంది. 

ఇంతకు పరిష్కారం ఏమిటి??

ముందుగా తెలుసుకోవలసిన విషయం. ఈ భయం అనేది శారీరక విషయం కాదు. నోప్పో, నలతో కాదు. ఇది కేవలం మానసికమైనది. ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ భయం అంతా మన
బుర్రలో కంటే, మన ఆలోచనల నుండి సృష్టించబడుతున్నదే అధికం. బుర్రకు, ఆలోచనలకు తేడా ఉంది. మెదడు పాజిటివ్, నెగిటివ్ రెండు విధాలుగా కూడా ఉండగలదు. అయితే ఈ అతి ఆలోచన అనేది పూర్తిగా నెగిటివ్ కోవలోకి జరిగిపోయి మానసికంగా బలహీనులను చేసి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి, అనవసరపు భయాన్ని అడుగడుగునా జోప్పిస్తుంటుంది. కాబట్టి ముందు మానసిక పరిస్థితిని
మెరుగుపరుచుకోవాలి.

మానసిక పరిస్థితి మెరుగవ్వడానికో అద్భుతమైన మార్గం ఉంది.

మానసిక సమస్యలు చాలా కఠినమైనవి, వీటిని అధిగమించడం ఎంతో కష్టతరమైన పని. అనుకుంటూ వుంటారు చాలా మంది. అయితే అది నిజమే కావచ్చు కానీ అది కేవలం అలా భావించే వాళ్లకు మాత్రమే. ఈ మానసిక సమస్యలు అన్ని కూడా చూసే చూపును బట్టే ఉంటాయి. చిన్న సమస్య అనుకుంటే చిన్నగా, పెద్దగా అనుకుంటే కొండంతగా అనిపిస్తాయి. అయితే దీన్ని అధిగమించడానికి ఒక అద్భుత మార్గం ఉంది. అదే వర్తమానంలో జీవించడం. ఇది వినగానే కొందరికి నవ్వు రావచ్చు. మరికొందరు ఆలోచనలో పడిపోవచ్చు. కానీ అదే నిజం. భయాలు అన్నిటికి తరువాత, రేపు, జరిగిపోయిన గతం అనేవి 90% కారణాలుగా ఉంటున్నపుడు వాటిని గూర్చి వదిలి కేవలం వర్తమానం గురించి ఆలోచించడం చాలా గొప్ప పరిష్కారం కదా.

మరి వర్తమానంలో భయం ఉండదా?? వర్తమానం గురించి భయం వేయదా?? అని ఎవరైనా అనుకోవడం కూడా పరిపాటే. అయితే వర్తమానంలో, కేవలం ఉన్న క్షణాలలో జీవించడం అంటే మనం చేస్తున్న ఏ పనిలో అయినా పూర్తి స్పృహాతో ఉంటూ దాన్ని పూర్తి చేయడం. ఇలా చేయడం వల్ల ఆ పని మీదనే ఏకాగ్రత పెరిగి 100% ఆ పనికి న్యాయం చేయగలుగుతాం. కాబట్టి మన శక్తిసామర్ధ్యాల మీద మనకు శంక అవసరమే ఉండదు. భయం అనే రాక్షసి మంత్రమేసినట్టు మాయం అవుతుంది మన జీవితాల్లో నుండి. 

కాబట్టి భయాన్ని జయించే మంత్రం అయిన వాస్తవంలో జీవించడాన్ని మిస్సవకండి. లేకపోతే మీ క్షణాలు అన్ని గతంలోకి చూసినపుడు పనికిమాలినవిగా కనబడతాయి.

◆ వెంకటేష్ పువ్వాడ