Read more!

విహారయాత్రికుల విరహం!!

ఒక్క చోట కుదురుగా ఉండాలి అంటే కొందరికి మహా బద్దకం. దానికి తగ్గట్టు ఇల్లు, ఉద్యోగం, ఒత్తిడులు వీటి నుండి బయటపడటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాటిలో చదవడం, సంగీతం, వివిధ రకాల విభిన్న ప్రయత్నాలు, ట్రెక్కింగ్ ఇంకా కొందరు డాన్స్, యోగ, ధ్యానం ఇలాంటివి అన్ని స్ట్రెస్ బస్టర్ గా భావిస్తూ వుంటారు. అలాంటి వాటిలో ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ అంశం ట్రావెలింగ్. వివిధ ప్రాంతాలను దర్శించడం వల్ల విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకోవడమే కాకుండా ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు కూడా ఎంతో అవకాశం ఉంటుంది. కొత్తదనాన్ని కోరుకునే వాళ్లకు ఇది ఎంతో గొప్పగా సహాయపడుతుంది. ప్రాచీన కట్టడాలు, ప్రత్యేకత సంతరించుకున్న ప్రాంతాలు, సహజత్వాన్ని నిలుపుకున్న ప్రదేశాలు, నీటి వనరులు, పచ్చని చెట్లు, జంతు సంపద సమృద్ధిగా ఉన్న చోట్లకు వెళ్ళడానికి అందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక ఎంతోమంది ప్రసిద్ధ దైవ క్షేత్రాల దర్శనం పేరిట కూడా ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఉంటారు. ఇలాంటి చోట్లకు వెళ్ళొస్తే కొత్త ఊపిరి దొరికినట్టు అవుతుంది.

కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో గొప్ప గొప్ప ప్రాంతాలు ఉనికిని కోల్పోయే దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా సహజత్వం నింపుకున్న ప్రకృతీ నిలయమైన ప్రదేశాలు వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి.  ఇదంతా ఒకటైతే ఈమధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇలా విహరించే పక్షులకు బంధనాలు వేసాయని చెప్పవచ్చు. 

కరోనా మొదలయినప్పటి నుండి ఇంటి పట్టున ఉండటం వల్ల ఎంతోమంది ఒత్తిడిలో సతమతం అవుతున్నారు. రెక్కలు కట్తుకుని స్వేచ్ఛగా వీధుల్లోనూ, విహారాల్లోనూ మునిగిపోయే అలవాటున్న అలాంటి వాళ్లకు సంకెళ్లతో బంధించినట్టు వర్క్ ఫ్రొం హోమ్ లు ఇవ్వడం ఇంకా దూర ప్రయాణాలు విరమించుకోమని నిబంధనలు పెట్టడం ఇలాంటి వల్ల పక్షులను పంజరాల్లో బంధించినట్టే ఉంది.

ఇలాంటి వాళ్లకు కాస్తో కూస్తో ఒత్తిడిని తగ్గించే మార్గాలు చుట్టూనే ఉంటాయి వాటిని కాస్త అనుసరిస్తే కొంచమైనా మనసుకు హాయిగా ఉంది.

ఆహ్లాదం అనడం ఉదయం!!

ఉదయకాలం లేలేత ఎండలు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. వీలున్నంత స్థలమో, దగ్గరలో ఉన్న పార్కులో, లేక ఇంటి మేడ ఇలా ప్రాంతం ఏదైనా ఉదయం లేత ఎండను ఆస్వాదిస్తూ అభిరుచికి  తగ్గట్టు వ్యాయామం, ధ్యానం, ఏరోబిక్స్ లేదా నడక ఇలాంటివి  ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి.  కాబట్టి రోజును ఇలా మొదలుపెడితే రోజు మొత్తం తగినంత ఉత్సాహంగా ఉండచ్చు. ఒత్తిడిని దరిదాపులకు రానీయకుండా ఉంటుంది.

మొక్కల పెంపకం!!

ఎంతో గొప్ప అలవాటు. రోజులో వీలున్నపుడు కొద్దిసేపు మొక్కల దగ్గర గడిపితే అది ఎంతో గొప్ప ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆ వైబ్రేషన్ మనిషిని రోజు మొత్తం పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది.

పెంపుడు జంతువులతో గడపడం!!

పెంపుడు జంతువులకు మించి గొప్ప స్నేహితులు ఉండరని అనిపిస్తుంది. అవి చూపించే ప్రేమ, ఆప్యాయత, విశ్వాసం మనుషుల దగ్గర కూడా దొరకవు. కాబట్టి వాటితో గడపడం వల్ల ఒత్తిడి సులువుగా దూరమవుతుంది.

పుస్తకపఠనం!!

నిజానికి ఎక్కడికీ వెళ్లకుండా వివిధ ప్రదేశాలను చూసిన ఫీల్ కలగాలి అంటే దానికి మార్గం అద్భుతమైన చారిత్రక ప్రదేశాల గురించి వెలువడిన పుస్తకాలు చదవడం. ఇది పుస్తకపఠనం అనే మంచి అలవాటును కూడా పెంపొందిస్తుంది. అలాగే ఆ ప్రాంతాల వెనుక ఉన్న సంఘటనలు, సందర్భాలు వంటివి కూడా క్షుణ్ణంగా అర్థమవుతాయి.

ఇదే కోవలోకి వచ్చేది డాక్యుమెంటరీస్.  ఇందులో కూడా విషయన్ని ఎంతో వివరంగా విశ్లేషించి చెబుతూ ఉంటారు. కాబట్టి వాటిని హాయిగా చూసేయచ్చు. 

చిన్ని చిన్ని ఆనందాలు!!

కొందరికి దూరప్రాంతాలు వెళ్తేనే కిక్కు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గరలోనే కాస్త ప్రకృతీ రమణీయత సంతరించుకున్న ప్రదేశాలను కనుగొనగలిగితే అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి హాయిగా గడపచ్చు. ఇలా విహారాయత్రలను మిస్సయిపోతున్న భావాన్ని భర్తీ చేసుకుని హాయిగా ఉండచ్చు మరి.

◆ వెంకటేష్ పువ్వాడ