Read more!

సానుభూతి కోసం ఒళ్లంతా పట్టీలు.. ఈటలపై హరీష్ రావు సంచలనం..

హుజురాబాద్ ఉపఎన్నికే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నారు. ఈటల రాజేందర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించేలా వ్యూహాలు రచిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారు. కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హరీష్ రావు... అంతా సైలెంటుగా పని కానిచ్చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించనప్పటికీ.. అంతా సిద్ధిపేట కేంద్రంగానే చక్కబెడుతున్నారు. గతంలో ఈటలకు అత్యంత సన్నిహితంగా ఉన్న హరీష్ రావు ఎంట్రీతో హుజుపాబాద్ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. 

తాజాగా సిద్ధిపేటలో హుజురాబాద్ నేతలతో సమావేశమైవ హరీష్ రావు.. ఈటల రాజేందర్ ను నేరుగానే టార్గెట్ చేశారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల వేళ బీజేపీ లీడర్లు దొంగనాటకాలకు తెరతీశారని మండిపడ్డారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు చేశారు హరీష్ రావు. ప్రచారంలో గాయపడినట్టు, అనారోగ్యం పాలైనట్టు ఒళ్లంతా పట్టీలు కట్టుకుని తిరుగుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తారని విమర్శించారు. ఈటల చక్రాల కుర్చీలో ప్రచారానికి వచ్చి సానుభూతి కోసం ప్రయత్నిస్తారని, ఆయన మాయలో పడొద్దని హితవు పలికారు. బీజేపీ ప్రచార ప్రణాళిక ఎత్తుగడలో ఇది కూడా భాగమన్నారు హరీష్ రావు. ఇలాంటి ఎత్తుగడలను బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజలకు బండకు కొట్టి బీజేపీని తరిమికొట్టారని చెప్పారు.నాడు టీఆర్‌ఎ్‌సలోకి ఈటల రాజేందర్‌ ఓ వ్యక్తిలా వచ్చి.. ఇప్పుడు ఓ వ్యక్తిలా వెళ్లిపోయాడే తప్ప పార్టీ మొత్తం కేసీఆర్‌ వైపే ఉన్నదని అన్నారు. ఈటలకు టీఆర్‌ఎ్‌సలో అత్యంత ప్రాధాన్యం దక్కిందని, కానీ ఆయనే తల్లిలాంటి పార్టీకి అన్యాయం చేయడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. 

బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని, తాము మాత్రం ఈ ఏడేళ్లలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని హరీష్ రావు చెప్పారు. త్వరలోనే మరో 70 వేల వరకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ సంస్థల విక్రయానికి ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసిన బీజేపీ.. బీసీల సంక్షేమానికి శాఖను ఎందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని, రేపు హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచినా నయాపైసా ఉపయోగం ఉండదని హరీశ్‌రావు అన్నారు. దళితబంధు పథకం కూడా రాష్ట్రమంతటా అద్భుతంగా అమలు జరుగుతుందని, ఆ దిశగా సీఎం కేసీఆర్‌  ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపునూ ఎవ్వరూ ఆపలేరని, భారీ మెజార్టీతో పార్టీ అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని హరీష్ రావు అన్నారు.