Read more!

మగమహారాజుల మెన్స్ డే!!

ఇంగ్లీష్ క్యాలెండర్లో బోలెడు డే లు. ఉపాధ్యాయులు, మహిళలు, వృద్ధులు, సైనికులు, పిల్లలు ఇలా ఉన్న అందరికీ డే లు పెట్టి వాళ్ళను సంవత్రానికి ఒకసారి ఘనంగా తలచుకోవడం పరిపాటి. అయితే ఆ లిస్ట్ లో పురుషులు ఉన్నారు. ఇంటర్నేషనల్ మెన్స్ డే పేరుతో నవంబర్ 19 న పురుషులకూ ఒక రోజును కేటాయించారు. 

పితృస్వామ్య వ్యవస్థ అయిన మన భారతదేశంలో అన్ని విషయాలలోనూ మొదటి నుండి పురుషులదే పైచేయి. అలాంటి దేశంలో ఇప్పుడు పురుషుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అనుకున్నా ఒకప్పటికి, ఇప్పటికి మారిన పరిస్థితులను బట్టి మగవాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది ఉంది.

ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే ప్రతి ఆడదాని విజయం వెనుక కూడా మగవాడు ఉంటాడు. పదస్తుతం అన్ని రంగాలలో మహిళలు మగవాళ్లకు తక్కువేమీ తీసిపోము అన్నంత పోటీ ఇస్తున్నారన్నా, గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారన్నా అందులో ఆ ఇంట్లో వాళ్ళను ప్రోత్సహించిన తండ్రులు, భర్తలు, కొడుకులు ఇట్లా మగవాళ్ళ పాత్ర ఉంటుందని చెప్పచ్చు.

ఇంకా చెప్పాలి అంటే స్త్రీ తన సమానత్వం కోసం పోరాడుతూ ఉంటే చాలా మంది మగవాళ్లు ఇంట్లో వంట నుండి కుటుంబాన్ని చక్కదిద్దడం వరకు అన్ని పనులు పంచుకుంటూ వాళ్లే సగాన్ని ఆడవాళ్లకు వదిలేస్తున్న మహానుభావులు బోలెడు ఉన్నారని మాత్రం మర్చిపోలేం.

మరేం చేద్దాం అనుకుంటున్నారా??

కొంచం సందడి

సందడి అంటే ఎదో పండుగ కాదు. అలాంటి వాతావరణం అన్నమాట. ఇంట్లో ఉన్న మగవాళ్లకు అందునా మీకోసం ఎంతో తాపత్రయ పడుతూ మీకు సపోర్ట్ ఇస్తున్నవాళ్లకు నచ్చిన పంటకం చేసిపెట్టి, దగ్గరుండి వడ్డించి వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడాలి, ఎప్పుడూ కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు అంటూ వాధించుకుని, గోడవపడే విషయాలను వదిలిపెట్టి వీలైనవరకు ప్రశాంతగా ఉండటానికి వాళ్ళను ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. సరదాగా బయటకు వెళ్లడం, భర్తకోసం అయితే వాళ్లకు నచ్చిన రంగు దుస్తులు వేసుకోవడం, వాళ్లకు నచ్చిన చోటుకి వెళ్లడం కలసి జీవిస్తున్నందుకు, కలసి అన్ని పంచుకుంటున్నందుకు ప్రేమా, ఆప్యాయతలు ఎప్పటికి నిలబెట్టుకుంటాం అనెంతగా వారికి వ్యక్తం చేయడం.

మరికొంచం కృతజ్ఞత

కృతజ్ఞత పదం నాలుగే అక్షరాలు అయినా దానిలో ఉన్న అర్థం మాత్రం ఎంతో గొప్పది. కృతజ్ఞత అనేది మన జీవితంలో మనకోసం ఏదైనా చేసేవారి పట్ల కచ్చితంగా ఏర్పరచుకోవలసిన గుణం. అలాంటిది కుటుంబం కోసం ఎంతో చేస్తున్న మగవాళ్ళ విషయంలో కృతజ్ఞత చూపించడానికి తగిన సమయం ఇలాంటి మెన్స్ డే అని చెప్పచ్చు. అంతేనా నిజానికి ఒక మాట చెప్పాలంటే ఆడవాళ్లు ఉద్యోగం చేయకపోయినా, సంపాదించకపోయినా, ఇంటిని చూసుకుంటూ, వంట చేసి పెడితే చాలు ఉద్యోగాల గొడవలు గురించి అడిగే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ మగవాళ్లకు మాత్రం ఇవన్నీ కచ్చితమైన బాధ్యతలు. వాళ్ళు బయట ఎన్నో సంఘర్షణలు పడుతూ కుటుంబాలకు లోటు రానివ్వకుండా చూసుకోడానికి ఎంతో కష్టపడతారు. అలాంటి వాళ్లకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే ఆడవాళ్లను ప్రోత్సహించేవారిని ఎంతో గొప్పగా ప్రస్తావించాలి. 

చిన్నవో పెద్దవో శక్తిని బట్టి బహుమానాలు. జీవితాన్ని సంతోషంగా ఉన్నందుకు కొన్ని సంతోష సమయాలు, నిజానికి ఇవ్వడమనే అలవాటు ఉన్న మగవాళ్ళు వస్తువులు, బహుమతులు కాదు భార్య, కూతురు, కోడలు మొదలైన వాళ్ళ నుండి ప్రేమ, ఆప్యాయత, అభిమానాన్ని కోరుకుంటారు. కాబట్టి అలాంటివి అందించడం. వాళ్ళ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమాపణ చెప్పి అపార్థాలు చెరిపేసుకోవడం. 

ఇంకొక్క మాటలో చెప్పాలంటే సపోర్ట్ ఇస్తూ, కుటుంబాల ఎదుగుదలకు నిరంతరం పాటుపడే మగవాళ్ళ ముందు ఆడవాళ్లు తాము తక్కువే అని ఒప్పుకున్నా నష్టమేమీ లేదు అంటే ఆడవాళ్లను తక్కువైపోమని చెప్పడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు. మగవాళ్ళకు ఆ గౌరవం ఇవ్వచ్చు అని.

కాబట్టి బాధ్యతాయుతమైన మగవాళ్ళూ అందుకోండి అందరి సలాములు. 

◆ వెంకటేష్ పువ్వాడ