Read more!

సర్కార్ మెడకు ఫాం హౌస్ కేసు?

ఫాం హౌస్ కేసు తెలంగాణ సర్కార్ మెడకు చుట్టుకున్నట్లే కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఈ కేసు దర్యాప్తు సీబీఐ ప్రారంభించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టులో వాదనల సమయంలో తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ కేసులో ఫైల్స్ సీబీఐ చేతికి వెళితే ఇక మిగిలేదేం ఉండదని చేసిన వ్యాఖ్యే ఫాం హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తు అంటే  కేసీఆర్ సర్కార్ ఎంతగా ఆందోళన పడుతోందో అర్ధమౌతుంది.

సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూరాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించినా భారాస సర్కార్ కు ఊరట లభించలేదు.  సుప్రీం ఈ కేసు విచారణకు ఫిబ్రవరి 17న చేపట్టనుంది. అంత వరకూ స్టేటస్ కో ఉత్తర్వ్యులు ఇవ్వాలన్నరాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఏ క్షణంలోనైనా సీబీఐ ఫాం హౌస్ కేసు దర్యాప్తును ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.   కేసుకు సంబంధించి వివరాలు, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లు  అందజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ ఐదు లేఖలు రాసింది. 

సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ దొరక లేదు.  సీబీఐ ఇప్పటికే ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక బృందం దర్యాప్తును ఎక్కడ నుంచి ప్రారంభించాలన్న విషయంపై కసరత్తు ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు.. తమను కోనుగోలు చేయడానికి బీజేపీ భారీ ఆఫర్ చేసిందంటూ భారాసా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు నుంచి సీబీఐ ప్రారంభమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.  ఆడియా, వీడియో లీక్ నుంచి మొదలైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

మొత్తం మీద సీబీఐ ఇహనో ఇప్పుడో దర్యాప్తు ప్రారంభించడం తథ్యమనే విషయంలో మాత్రం అందరిలోనూ ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.  అయితే ఈ కేసు విషయంలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించే విషయంలో మాత్రం రాజకీయ వర్గాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాం హౌస్ కేసు దర్యాప్తు విషయంలో సీబీఐకి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే వ్యూహాన్నే అనుసరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, డాక్యుమెంట్లను ఇవ్వడం లేదని సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు మొరపెట్టుకున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి స్పష్టమైన తీర్పు వెలువడిన తర్వాత కూడా ఇదే తరహా ఇబ్బంది ఎదురవుతున్నదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.  ఐదుసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని సీబీఐ భావిస్తోంది.