Read more!

ఏమి చెబుతోంది సంస్కృతి

విభిన్న మతాల నిలయం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం దీని వైశిష్ట్యం. ఎన్నో మతాలు, ఎన్నో రకాల సంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా సంప్రదాయమనే చట్రంలో భాగాలు. ప్రతి మతానికొక గ్రంథం, ఆ గ్రంథాన్ని అనుసరించి మతం పుట్టుక, అందులో సంప్రదాయాలు. ఇలా అన్ని రకాల మతాలకూ అన్ని రకాల సంప్రదాయాలు. కానీ ప్రతి మతం చెప్పేది ఒకటే మనిషి మనిషిగా జీవించాలని, మనిషి సాటి మనిషిని ప్రేమించాలని, తనకున్నదాంట్లో కాస్తో కూస్తో లేనివారికి ఇవ్వాలని. ఇలా అన్ని మతాలు కలిసి మన భారత సంస్కృతిని గొప్పగా నిలబెట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా మతాల గొడవలు, ఇంకొక మతాన్ని విమర్శించడం, ఆ మతంలో దేవుళ్లను తిట్టిపోయడం, పురాణం గ్రంథాలలో చెప్పబడిన వాక్యాలకు పూర్తి అర్థం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం. కారణం ఏమిటి?? 

ఆధిపత్యం…..

భారతదేశానికి ఎంత చరిత్ర ఉందొ అంతకంటే పెద్దది హిందూ మతం చరిత్ర, అలాగే మిగిలిన మతాలు కూడా వివిధ దేశాలలో వారి వారి నమ్మకాలకు అనుగుణంగా పుట్టినవే. కానీ ప్రస్తుతం మాత్రం మతాధికారమే దేశ పాలనకు మూలమని, దోచుకోవడానికి అదే సరైన మార్గమని భావిస్తున్న వారు కోకొల్లలు.

అవగాహన లోపం---

సంస్కృతిలో భాగంగా, సంప్రదాయంలో భాగంగా ఏ మతంలోనూ పూర్తిగా తమ మాత గ్రంథాలను పూనాదితో సహా చదివి ఉండరు. వాళ్లకు తెలిసినది కేవలం అమ్మల మాటల్లోనూ, అమ్మమ్మల కథలోనూ, తాతలు చెప్పిన కథల్లోనే సగం సగం విషయాలు తెలుసుకుని వాటినే పట్టుకుని వేలాడుతూ, ఎక్కడో చరిత్రలో జరిగిన సంఘటనలను వాటి వెనుక మూలలను తెలుసుకోకుండా ద్వేషం, పగ పెంచుకుని మతాల మధ్య శత్రువుల్లా తయారవడం.మూఢనమ్మకంనమ్మకాలు మంచివి. మతాలలో సంప్రదాయాలలో భాగం కాబడిన విషయాలు చాలావరకు శాస్త్రీయతో కూడుకున్నవి. కానీ అక్షరాస్యత ధరించిన అజ్ఞానులకు వాటిని అర్థం చేసుకోడం రావట్లా. ఫలితంగా మూఢనమ్మకాలు, ఎత్తిపోతలు, విమర్శలు, ఘాటుగా స్పందించడాలు.కొందరు కొన్ని స్వప్రయోజనాలకోసం సృష్టించిన సంప్రదాయాలు ఉన్నాయి కానీ హేతువాదనికి దూరంగా ఏ సంప్రదాయం ఎక్కువ కాలం నిలబడదు కదా!!
 
ఏమి చెప్పాలి పిల్లలకు??

ముందు తరాలకు అందించే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది సంస్కృతే,  పిల్లలకు చిన్నతనం నుండే ప్రతి విషయాన్ని కారణంతో, మూలలతో సహా వివరించి చెప్పాలి. తద్వారా వారిలో అవగాహన పెరుగుతుంది, ఆలోచన విస్తృతం అవుతుంది అంతే కాదు ప్రతి విషయాన్ని కూడా ఎంతో ఆలొచనాత్మకంగా చూస్తారు, ప్రతి అడుగును విశ్లేషించుకుంటూ వేస్తారు. ఇదే సంస్కృతి ఇచ్చే విజ్ఞానం. ఈ సంస్కృతిలో ఏ లోపం లేదు, లోపమున్నదల్లా మనిషి బుర్రలో. ఇక్కడ విషయం ఏమిటంటే తాను బాగుపడకపోయినా ఇంకొకరు బాగుపడుతున్నారు అంటే బాధపడిపోయే మనుషులున్న సమాజమిది.
 
సొంత లాభం కొంత మానుకో---

పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలు అక్షరాల సత్యమని నమ్మి వాటిని జీవితంలో ఆచరణలో పెట్టేవాళ్లు చాలా తక్కువ. ఎప్పుడైతే ఈ దేశమంటే మట్టి కాదు మనుషులని, మనుషుల మధ్య సామరస్యత, కలుపుగోలుతనం, సహాయపడే గుణం పెంపొందుతుందో అప్పుడే  ఈ దేశ సంస్కృతి గొప్పదనం మరింత ఇనుమడిస్తుందని, అది తెలుసుకుని తాము పాటిస్తూ తమ పిల్లలకు చెబుతూ ముందు తరాలకు బహుమతిగా గొప్ప వ్యక్తిత్వాన్ని ఇస్తే మన సంస్కృతి నుండి మనం ఎంతో కొంత నేర్చుకుంటున్నట్టే!!

◆ వెంకటేష్ పువ్వాడ