Read more!

కొవిడ్ పేరుతో మళ్లీ ఆంక్షలు.. ? కేసీఆర్ వ్యూహం అదేనా? 

ఒకప్పుడు శాసన మండలిలో కొణిజేటి రోశయ్య వంటి సీనియర్ సభ్యులను ఎదుర్కోవడం కష్టమనిపించి, ఆప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏకంగా శాసన మండలిని  రద్దు చేశారని అంటారు. అందులో నిజం వుందో లేదో ఏమో కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా, సమయ సందర్భాలను బట్టి రాజకీయ వర్గాల్లో ఆ ప్రస్తావన అయితే వస్తూనే ఉంటుంది. అలాగే, ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో ఉద్యమస్పూర్తిని వదిలి,అధికార పార్టీగా అవతరించిన తెరాస ప్రభుత్వానికి ధర్నా చౌక్ పెద్ద తలనొప్పిగా భావించింది. సర్కార్ తప్పటడుగులను, ఉద్యమ సంఘాలు ఎత్తి చూపేందుకు ధర్నాచౌక్ ‘ను వేదిక చేసుకోవడంతో, ప్రభుత్వం నగరం నడిబొట్టున  ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్’ను ఎత్తుకుపోయి, ఊరవతల పారేసింది. 

అయితే న్యాయస్థానం తీర్పుతో ధర్నాచౌక్’ మళ్ళీ  యధాస్థానం గచ్చామి అన్నట్లు ఇందిరా పార్క్’కు   చేరింది. చివరకు, అధికార తెరాస కూడా, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా, అదే ధర్నాచౌక్ వద్ద, మహాధర్నా నిర్వహించింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళూ వీళ్ళూ అనేముంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అప్పటికే, కోర్టు ఆదేశాలతో  ధర్నాచౌక్’  వద్ద ప్రజా సంఘాల ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమలు సాగుతున్నా, స్వయంగా ముఖ్యమంత్రే ధర్నాల్లో కూర్చోవడంతో ధర్నాచౌక్’ కు మళ్ళీ పుర్వవైభవ స్థితి వచ్చినట్లు అయింది. 

ముఖ్యంగా రేవత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత దూకుడు పెంచారు. తెరాస ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ధర్నాలు, ఆందోళనలు చేసి ప్రభుత్వనికి కంటి మీద కునుకు లేకుండ చేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా  వరసగా రెండు రోజులు  రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌’తో ధర్నచౌక్ వద్ద చేపట్టిన  ‘వరి దీక్ష’  సర్కార్’ను బాగా చికాకుకు గురిచేసిందని అంటున్నారు. ఓ వంక కాంగ్రెస్ నాయకులు వరి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బండారాన్ని బయట పెడుతుంటే, మరో వంక జనంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రమాద స్థాయికి చేరిందని వేగుల అందిస్తున్న సమాచారం అధికార పార్టీ నాయకులక్ను ఆందోళనకు గురిచేస్తోంది. 

ధర్నాచౌక్ ఆందోళనలే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలులో జరుగతున్న జాప్యం, అకాల వర్షాల కారణంగా రైతులకు జరుగుతున్న నష్టానికి వ్యతిరేకంగా జరుగతున్నఆందోళనలు ప్రభుత్వానికి ఓ వంక తలవంపులు, మరో వనక తల నొప్పులు తెస్తున్నాయి.అందుకే, ఏదో ఒక వంకన రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలని కొంత కాలంపాటు కట్టడిచేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం జరుగుతోంది.. ఈ సమావేశంలో, ప్రదానంగా ధాన్యం కొనుగోలు, మరో మారు ప్రపంచాన్ని కలవార పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్’ కట్టడి చర్యల పై ప్రధానంగా చర్చ జరుగుతుందని అంటున్నారు. అయితే,  ఓమిక్రాన్’కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికల నేపధ్యంలో, ఇతర సాముహిక కార్యకలాపాలతో పాటుగా  రాజకీయ కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, పూర్తిగా కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కట్టడికోసం మాత్రమే కాకుండా, రాజకీయ వ్యతిరేకత కట్టడిచేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.