Read more!

ఎవరా నలుగురు?.. బండి హస్తిన యాత్రపై ఐఏఎస్ లలో టెన్షన్!

రాష్ట్రంలోని అవినీతి అధికారుల భరతం పడతామంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఆయన ఓ నలుగురు కలెక్టర్ల అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలున్నాయనీ, వాటితో ఆ నలుగురిపై   డీవోపీటీ ఫిర్యాదు చేస్తానంటూ హస్తిన బయలుదేరారు. దీంతో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో ఆ నలుగురు కెలక్టర్లు ఎవరా అన్న చర్చ కూడా ప్రారంభమైంది.  

నలుగురు ఐఏఎస్‌లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని  బండి సంజయ్ ఇటీవల సంచలన  వ్యాఖ్యలు చేసిన విషయం విదతమే.  అన్ని ఆధారాలూ ఉన్నాయన్న ఆయన వారి పేర్లు అయితే బయటపెట్టలేదు.  అయితే ఆయన నలుగురు ఐఏఎస్ ల అవినీతి అన్న క్షణం నుంచే వారెవరా అన్న చర్చ రాష్ట్ర బ్యూరోక్రాట్లలో మొదలైంది.  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబీకులతో సన్నిహితులుగా మెలిగే అధికారులే లక్ష్యంగా బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అలాగే   ధరణి పేరిట అక్రమాలకుపాల్పడిన వారి జాబితాతో బండి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఆ పోర్టల్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన వారిపైనే గత కొద్ది  రోజులుగా బీజేపీ దృష్టి సారించిందనీ, ఆ విషయంపై ఆ పార్టీ ఆరోపణలు కూడా గుప్పించిందనీ అంటున్నారు.

బండి ఐఏఎస్ అధికారుల అవినీతిపై  మాట్లాడినప్పటి నుంచీ, బండి వద్ద ఉన్న జాబితాలో ఉన్నవారెవరన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.  ఆయన చెప్పిన నలుగురు ఎవరై ఉంటారా అన్న ఉత్కంఠ, ఆందోళన రాష్ట్రంలోని అధికారులలో వ్యక్తమౌతోంది. ముఖ్యంగా కేసీఆర్ తో, ఆయన కుటుంబీకులతో సత్సంబంధాలు ఉన్న వారిలో ఆ గుబులు మరింత ఎక్కువగా ఉందని అంటున్నారు.  అయితే బండి వద్ద ఐఏస్ ల అవినీతి బాగోతం ఆధారాలు నిజంగా ఉన్నాయా? ఉంటే అవి ఆయనకు ఎలా లభించి ఉంటాయన్న కోణంలోనూ అధికార వర్గాలలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరైతే అధికారుల అవినీతి వాస్తవమేననీ అంటున్నారు.

ఆ వివరాలు, అధికారుల అవినీతి నచ్చని వారి ద్వారానే అంది ఉంటుందన్న మాట కూడా వినిపిస్తోంది.  అవినీతి అధికారుల బండారం బయటపెడతానంటూ బండి సంజయ్ బుధవారం (ఫిబ్రవరి 8) హస్తిన విమానం ఎక్కారు. నేడో రేపో ఆ అవినీతి అధికారులపై సాక్ష్యధారాలతో డీవోపీటికి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు.  దీంతో బాబూస్ లో తెలంగాణలోని అధికారులలో వారెవరై ఉంటారు. బండి చెబుతున్న అవినీతి అధికారులలో తమ పేరు ఉందా? అన్న టెన్షన్ క్షణక్షణానికీ పెరిగిపోతోంది.