Read more!

కొత్త జిల్లాల పీటముడి.. బంద్ బాట పడుతున్న ప్రజలు

ఎక్కడ కెలికినా ఓకే. సెంటిమెంట్లను మాత్రం కెలక్కూడదంటారు అనుభవజ్ఞులు. సెంటిమెంట్లు గాయపడితే సెంటు భూమి కోసమైనా వెనక్కి తగ్గదు ప్రజానీకం. ఇప్పడదే జరిగింది నర్సాపురంలో పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న నర్సాపురం జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై నర్సాపురం ప్రజలు భగ్గుమన్నారు. నర్సాపురం పేరుతోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని లేకపోతే ఊరుకునే సమస్యే లేదని అక్కడి వ్యాపార-వాణిజ్య వర్గాలు, సామాన్య ప్రజలు బంద్ కు పిలుపునిచ్చారు. స్థానిక రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయంతో రంగంలోకి దిగారు. జిల్లా కేంద్ర సాధన పేరుతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని నర్సాపురం నియోజకవర్గం మొత్తం శుక్రవారం బంద్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని వర్తక వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

ఏపీలో కొత్త జిల్లాల పేర్ల విషయంలో స్థానికంగా వివాదాలు మొదలయ్యాయి. నియోజకవర్గాల సర్దుబాటు, కూడికలు, తీసివేతలు, దూరాభారాలు, కులం కొట్లాటలు, ఆస్తుల పంపకాలు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు ఇలా అన్ని రకాలుగా తేనెతుట్టె కదిలింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. నిజానికి నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా కాకుండా భీమవరాన్ని ప్రకటించడంలోని ఔచిత్యాన్ని ముందుగా మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించారు. జిల్లా కేంద్రం విషయంలో నర్సాపురం ప్రజలు, రాజకీయ నాయకులు ఓడిపోయారని, భీమవరం ప్రజలు, రాజకీయ నేతలు గెలిచారంటూ వ్యాఖ్యానించారు. భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించిన జగన్ రెడ్డి సర్కార్ ఏ కులాన్ని సపోర్ట్ చేస్తున్నారో స్పష్టంగా తెలిసిపోయిందంటూ  నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మరో పక్కన ఇప్పటి వరకు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తగా ఏర్పాటయ్యే ఏదో ఒక జిల్లాకు దళితజన బాంధవుడు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ ను దళితులు తెర మీదకు తెచ్చారు.

ఇక విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడంపైనా విమర్శలు వస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. నందమూరి తారక రామారావు పుట్టింది పామర్రు మండంలోని నిమ్మకూరు గ్రామం. కొత్త జిల్లా ఏర్పాటు ప్రకారం ఆ గ్రామం ఇప్పుడు మచిలీపట్నం జిల్లాలోకి వస్తుంది. నిజంగా ఎన్టీఆర్ పట్ల జగన్ రెడ్డి సర్కార్ కే కనుక గౌరవం, అభిమానం ఉంటే మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టకుండా విజయవాడ జిల్లాకు పెట్టడంలో ఔచిత్యాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తుండడాన్ని స్వాగతించారు. అయితే.. దీని వెనుక జగన్ రెడ్డి రాజకీయ వ్యూహం ఏదో ఉండి ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పైకి ఎన్టీఆర్ ను గౌరవించినట్లు ఉన్నా.. జగన్ రెడ్డి మాటలు, చేతలు జనం నమ్మేలా లేవని అన్నారాయన.

కొత్త జిల్లాల ప్రకటనతో జగన్ రెడ్డి నేమ్ గేమ్ ఆడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాడేరుకు అల్లూరి సీతారామరాజు జిల్లా అని, పుట్టపర్తి ప్రాంతానికి శ్రీ సత్యసాయి జిల్లా అని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా అని కొత్త పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలనే స్కెచ్ ను జగన్ రెడ్డి వేశారని అంటున్నారు. వైఎస్సార్ కడప జిల్లా అని గతంలో పెట్టిన పేరును పూర్తిగా తుడిచిపెట్టిన జగన్ రెడ్డి సర్కార్ కడప ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిచెందిన వీరబ్రహ్మేంద్ర స్వామి పేరును  విస్మరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అలాగే.. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్ని గ్రామాలు, మండలాలకు జిల్లా కేంద్రాలు వందల కిలోమీటర్ల దూరం అయిపోతున్నాయి. దీంతో కొత్త జిల్లా పరిధిలోకి వెళ్లిన ప్రాంతాల వారు ఇదేమి చోద్యం అని ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాలు, చిన్న జిల్లాల ఏర్పాటును బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు సమర్థిస్తూనే.. కొత్త జిల్లాల్లో విలీనం చేసే ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల ఎంపిక, పేర్లకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు కమిటీ వేయాలని సూచిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాగా పేరు పెట్టడాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఉత్తర భారతంలో బాలాజీ అంటే ఆంజనేయస్వామిగా భావిస్తారంటున్నారు. బాలాజీ ఆంధ్రుల సంస్కృతి కాదని, తిరుపతి జిల్లాకు శ్రీ వేంకటేశ్వర జిల్లా అని పేరు పెడితే బాగుంటుందంటున్నారు.

విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. విజయవాడ కేంద్రంగా వంగవీటి రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించడం విశేషం. అలాంటి డిమాండ్ మెజారిటీ ప్రజల నుంచి వస్తే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. అయినా.. అలాంటి డిమాండ్ ను జగమొండి సర్కార్ నిజంగా పరిగణనలోకి తీసుకుంటుందా? అనే అనుమానాలు పలువురిలో లేకపోలేదు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటును అర్ధరాత్రి ప్రకటించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. కేబినెట్ లో చర్చించకుండానే అకస్మాత్తుగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఎలా చేస్తారనేది ఆయన ప్రశ్న.

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్లానింగ్ విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెరమీదకు రావడం.. సీఎం జగన్ ప్రణాళికను, ఆయన పవిత్ర ఆశయాన్ని కూడా వివరించడం కూడా ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. విజయ్ కుమార్ వివరణ విన్న వారికి పాత అనుమానాలు తీరక పోగా జగన్ నిర్ణయం వెనుక ఏ కుట్ర దాగి ఉందో అనే సందేహాలే ఎక్కువయ్యాయంటున్నరు రాజకీయ విశ్లేషకులు. అసలు కొత్త జిల్లా చిచ్చు రాజేయడమే జగన్నాటక సూత్రధారి మహా కుట్ర అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త జిల్లాలు, కొత్త సమీకరణలు, పరిపాలన, రాజకీయ, భౌగోళిక అంశాలపై తీవ్ర ప్రభాం చూపే కీలకమైన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అర్ధరాత్రి తంతుగా వైసీపీ మార్చడంపైన కూడా విమర్శలు వస్తున్నాయి.

నర్సాపురం ప్రజలు, వర్తక వాణిజ్య సంఘాలు, విద్యా సంస్థలు ఇప్పుడు నేరుగా ఆందోళనలోకి దిగారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో ఏపీ వ్యాప్తంగా కులాలు, ప్రాంతాలు, వర్గాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టి, చలి కాచుకుందామనే వ్యూహం ఉందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.