తెలుగుదేశం తోరణాలు తొలగింపు..వైసీపీ కార్యకర్తల్లా కార్పొరేషన్ అధికారులు

తెలుగుదేశం పార్టీ పేరు చెబితేనే అధికార వైసీపీలో భయం పెరుగుతోంది. ఆ పార్టీ అదినేత జనం పర్యటనకు జనం పోటెత్తడం, వైసీపీ అధినేత, సీఎం జగన్ సభల నుంచి జనం పారిపోవడంతో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యక్రమాలను అడ్డుకోవడం, పార్టీ నేతలకు కార్యకర్తలపై దాడులకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.  ఒంగోలులో ఈ నెల 28, 29 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కు ఒక వైపు తెలుగుదేశం ఏర్పాట్లు చేసుకుంటుంటే మరోవైపు ఆ ఏర్పాట్లను విచ్ఛిన్నం చేయడంలో కార్పొరేషన్ అధికారులు యమా బిజీగా ఉండటానికి కారణమిదేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానాడు కార్యక్రమం కోసం తెలుగుదేశం తమ్ముళ్లు తొరణాలు కడితే వాటిని వైసీసీ నాయకుల ఒత్తిడి కారణంగా కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం తోరణాలను తొలగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఈ చర్యను నెటిజన్లు గర్హస్తున్నారు.   మహానాడు కార్యక్రమం కోసం అనుమతి తీసుకున్న తరువాత కూడా ఇటువంటి చర్యలకు పాల్పడటం ఏం పద్ధతి అని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్లను మహానాడుకు వాహనాలు ఇవ్వరాదని ట్రాన్స్ పోర్టు శాఖ అధికారులు బెదరించడం వైసీపీలో ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం వైసీపీ కనుసన్నలలో పని చేస్తున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.  
Publish Date: May 25, 2022 11:01PM

వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన సంగతి విదితమే. పోలీసుల ఎదుట అనంతబాబు తానే హత్య చేశానని అంగీకరించిన తరువాత కూడా పార్టీ ఆయనను వెనకేసుకు వస్తున్నట్లుగానే మాట్లాడిన సంగతి విదితమే. అరెస్టయిన రోజుల తరువాత కూడా పార్టీ పరంగా ఏ చర్యా తీసుకోని వైసీపీ ఎట్టకేలకు సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పోలీసుల ఎదుట తానే హత్య చేసినట్లు అంగీకరించిన అనంతబాబును కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అనంతబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో చెప్పారు. పార్టీ పరంగా చర్యలపై విలేకరుల అడిగిన ప్రశ్నకు ఆ సంగతి పార్టీలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య‌పై విప‌క్షాలు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో అనంత‌బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ  నిర్ణ‌యం తీసుకుంది.
Publish Date: May 25, 2022 10:26PM

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జూన్ 23న

ఏపీలో ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ  నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదల చేస్తూ బుధవారం ఎన్నికల సంఘం ఉత్వర్వులు జారీ చేసింది. ఆత్మకూరుతో పాటు దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలలో కూడా ఉన ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ మేరకు ఆత్మకూరు ఉప ఎన్నికకు ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 6 ఃనామినేషన్ల దాఖలుకు తుదిగడువు. జూన్ 9 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.  జూన్ 23న పోలింగ్ జరుగుతుంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. 
Publish Date: May 25, 2022 10:21PM

పుట్టలో వేలెడితే చీమ కుడుతుంది.. సింహం నోట్లో వేలెడితే..!

చీమ తన ప్రైవసీని దెబ్బతీస్తుంటే ఊరుకోదు. కుట్టి వదిలి పెడుతుంది. చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే పుట్టలో వేలెడితే కుట్టనా అందట.. అలాంటిది సింహం నోట్లో వెలు పెడితే ఊరుకుంటుందా. వేలుకి కసుక్కున కొరికేసి చప్పరించేస్తుంది. అదే జరిగింది ఒడిశాలో. జూలో బోనులో ఉన్న సింహమే కదా అనుకున్నాడో ఆకతాయి. తన ఆకతాయి చేష్టలతో దానికి రెచ్చగొట్టాడు. జూలు పీకాడు. నోట్లో వేలెట్టి ఆడాడు. కోపంతో ఒళ్లు మండిన సింహం లటుక్కున ఆ వేలుని కొరికేసింది. దాని నోట్లోంది వేలు తీసుకోవడానికి నానా యాతనలూ పడ్డాడా ఆకతాయి అయినా లాభం  లేకపోయింది. చివరికి ఏం జరిగిందంటే అతడి ఉంగరం వేలు ఆ సంహానికి పలహారమైపోయింది. ఈ సంఘటన మొత్తం జూలో ఉన్నవారు తమ ఫోన్ లో చిత్రీకరించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయిపోయింది.  జూ అధికారులు ఆ ఆకతాయిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి...ఇలాంటి ఆకతాయి పనులు చేస్తే శాస్తి ఇలాగే ఉంటుందని మందలించి వదిలేశారు.
Publish Date: May 25, 2022 5:34PM

బిరియానీ లేదని ఏకంగా పెళ్లే ఆపేశారు!

పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతుండటం మనం వింటూనే ఉంటాం. అలాంటి సంఘటనలకు కారణాలు వదువు, వరుడు కుటుంబాల మధ్య తగాదాలో, పెళ్లి విందులో తాగి గొడవ పడటమో...లాంటి కారణాలు ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం ఒక పెళ్లి కేవలం విందులో వడ్డించడానికి బిరియానీ తయారు కాలేదని ఆగిపోయింది. అంతే కాదు వధువు, వరుడు కుటుంబాల వారు చర్చించుకుని మరీ పెళ్లి ఈ ముహూర్తానికి ఆపేసి.. కాదు కాదు వాయిదా వేసి మరో రోజు పెట్టుకుందామని నిర్ణయానికి వచ్చారు. అంతే పెళ్లికి వచ్చిన బంధువులందరికీ విషయం చెప్పి క్షమాపణలు చెప్పి మరీ వాయిదా వేశారు. మరో ముహూర్తానికి ఆహ్వానిస్తామనీ, అప్పుడు తప్పని సరిగా హాజరై వధూవరులు ఆశీర్వదించి తాము ఇచ్చే విందారగించాలని కోరారు. ఇంతకీ అసలు సంగతేమిటంటే.. పెళ్లి ఘనంగా చేయడంతో పాటు విందును అంతకంటే ఘనంగా ఏర్పాటు చేయాలని పెళ్లికుమారుడు, పెళ్లి కూతురు తరఫు వారు ముందే నిర్ణయించుకున్నారట. విందులో మంసాహారం, బిరియానీ మస్ట్ అని ముందుగా నే మెనూ సిద్ధం చేసుకున్నారు. తీరా పెళ్లి సమయం వచ్చే సరికి వారు ఆర్డర్ మేరకు వచ్చిన మాంసం కుళ్లిపోయిందని గుర్తించారు. అయినా అనుమాన నివృత్తి కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందిస్తే వారు వచ్చి అది కుళ్లిపోయిన మాసం అని నిర్ధారించారు. దీంతో పెళ్లి వాయిదా వేసి మరో ముహూర్తానికి పెళ్లి జరిపించి వధూవరులకు పసందైన విందు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. 
Publish Date: May 25, 2022 5:06PM

కేబినెట్ సహచరుడిపై పంజాబ్ సీఎం వేటు.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఇంతకీ పంజాబ్ ముఖ్యమంత్రి ఏం చేశారంటే.. తన కేబినెట్ మంత్రిపై వేటు వేశారు. అంతే కాకుండా ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంతకూ ఆ మంత్రి ఎవరు? ఆయన ఏం చేశారు అన్న ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తాయి. ఆ మంత్రి పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా.. ఆయన చేసిందేమిటంటే కాంట్రాక్ట్ పనుల్లో ఒక శాతం కమిషన్ డిమాండ్ చేశారట. విజయ్ సింగ్లా కమిషన్ డిమాండ్ చేసినట్లు ఆధారాలు  లభించడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆయనను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేశారు. అంతేనా  కేసు నమోదు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించి అరెస్టు చేయించారు. ఆప్ పార్టీ అవినీతిని అంతమొందించడానికి ఆవిర్భవించిందనీ, అవినీతి ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా చీపురుతో ఊడ్చేస్తామని ఆయన తన చేతల ద్వారా నిరూపించారు.  పంజాబ్ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చర్యే ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఒక్క శాతం కమిషన్ (సరిగ్గా చేప్పాలంటే లంచం) అలా చేయడం అంటూ జరిగితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క మంత్రికైనా పదవిలో కొనసాగే అవకాశం ఉంటుందా అన్నదే ఈ రెండు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ ముఖ్యమంత్రి మాదిరిగా ఇక్కడ సీఎంలు చర్యలు తీసుకోవాలంటే వారి కేబినెట్లలో కనీసం ఒక్కరైనా మిగులుతారా అన్న చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. సామాజిక మాధ్యమంలో ఈ రకమైన చర్చ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి కనీసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా ఆ పదవులలో కొనసాగే అవకాశం ఉందా అన్న  సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. అవినీతిని నిర్మూలిస్తాం అన్న మాటలు, ప్రకటనలకే పరిమితం కాకుండా పంజాబ్ ముఖ్యమంత్రిలా చర్యలు తీసుకుంటేనే అవినీతిని నిరోధించడం సాధ్యమౌతుందని సోషల్ మీడియాను నెటిజన్లు పోస్టులతో నింపేస్తున్నారు.  
Publish Date: May 25, 2022 3:51PM