‘స్త్రీ’ శక్తికి ప్రతీక ఆమె

ఓ సినిమాలోని ‘ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు’ అంటూ సాగిన పాట వింటుంటే ఒక్క అడుగుకి అంత శక్తి వుంటుందా? ఒక్కరివల్ల మార్పు సాధ్యమా? అనిపించేది. సందేహంగా వుండేది. అయితే ‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ గురించి విన్నాక నాకు ఈ పాటే గుర్తుకొచ్చింది. నిజమే... ఎవరో ఒకరు ముందడుగు వేయాలి.  ఆ అడుగుని మరో అడుగు అనుసరిస్తుంది. కొన్నాళ్ళకి అవి పదులై, వందలై, వేలల్లోకి మారతాయి. ఆ వేల అడుగులు ఎన్నో లక్షల పాదాలకి దారి చూపిస్తాయి. రహదారిని నిర్మిస్తాయి. జీవితంలో అత్యంత విషాదాన్ని చవిచూసిన మహిళలలో జీవితం పట్ల ఆశ కలిగించడం అంటే  మాటలా చెప్పండి! జీవితంపై ఆశనే కాదు.. ఆ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా మలచుకునే ఆత్మస్థైర్యాన్ని వారిలో నింపటమంటే సామాన్యంగా జరిగే విషయమా? కానీ ‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ వీటిని చేసి చూపించింది. ఆర్థిక పరిస్థితులు, నమ్మకద్రోహం, అయినవారి ధనాశ... ఇలా కారణం ఏదైతేనేం ఏటా ఎందరో అమ్మాయిలు ముంబై, పూణె వంటి ప్రాంతాలకు చేరుతున్నారు. అక్కడి బజార్లలో అంగడి వస్తువులుగా మారుతున్నారు. ఒకసారి అక్కడకి చేరితే తప్పించుకోవడమన్నది కల్ల. బతుకుతూనే చావటమంటే ఏంటో రుచిచూపించే ప్రాంతాలవి. అలాంటి చోటు నుంచి ఎలాగో ఒకలా తప్పించుకోవటమన్నది జరిగితే? సమస్య అక్కడితో తీరిపోతుందా? లేదు... అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. కష్టాలు వెంటాడటం అంటారే... దాన్ని నిజంగా చూస్తారు వాళ్ళు. అలా కష్టాల మధ్య కన్నీళ్ళు కార్చే అతివలకి నేనున్నానంటూ ధైర్యమందిస్తుంది ఈ ‘స్త్రీ’  స్వచ్ఛంద సంస్థ. ఎందరో అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన సంస్థ అది. ‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు ‘హేమా బేడీ’ స్వస్థలం పంజాబ్. అక్కడి నుంచి వచ్చిన ఈమె అనంతపురంలో ఈ సంస్థను ప్రారంభించారు. కుటుంబంతో బెంగుళూరులో వుండగా, ఆమె తమ్ముడు అనంతపురం జిల్లా పెనుకొండలో ‘యంగ్ ఇండియా’ ప్రాజెక్ట్ చేసేవాడు. దానికి జెండర్ కో-ఆర్డినేటర్‌గా ‘హేమా బేడీ’ని వుంచాడు. అప్పుడు మొదటిసారిగా ఈ పంజాబీ మహిళ అనంతపురంలో అడుగుపెట్టారు. ఆ ప్రాజెక్టు నిమిత్తం అక్కడున్న మూడు నెలల్లో మహిళల అక్రమ తరలింపుపై అధ్యయనం చేశారు ఈమె. వారి జీవితాలు, అందులోని సాధక బాధకాలు, ఒకసారి ఆ కూపంలోంచి బయటపడ్డాక వారుపడే ఇబ్బందులు అన్నిటిపై ఆ అధ్యయనం సాగింది. అందులోని నిజానిజాలు, చేదు కథలు ఆమెని కలచివేశాయి. వారికోసం ఏదైనా చేయాలని తపించిపోయారు. ఆ తపనలోంచి పుట్టిందే ‘స్త్రీ’ స్వచ్ఛంద సంస్థ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని మహిళలే ఎక్కువగా ఈ ఆటలో పావులుగా మారుతున్నారని గ్రహించారు హేమా బేడీ.  అందుకే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు కల్పించారు. అలాగే ముంబై వంటి ప్రాంతాల నుంచి తప్పించుకుని వచ్చే మహిళల జీవితం సాఫీగా సాగాలంటే వారు ముందు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందుకే అటువంటి మహిళలందరికీ ఎన్నో చేతివృత్తులు, ఉపాధి వృత్తులలో శిక్షణ ఇప్పిస్తుంది ఈ సంస్థ. అంతేకాదు వారికి అక్షరాలు నేర్పిస్తుంది. పరీక్షలకి పంపుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ వంటి వాటిల్లో కూడా శిక్షణ ఇప్పిస్తుంది ఈ స్త్రీ  స్వచ్ఛంద సంస్థ. చట్టంపట్ల కూడా కొంత అవగాహన కలిగేలా చూస్తారు వీరు. అన్నిటికంటే ముఖ్యంగా ఆడవారికి ఆత్మరక్షణ విద్యల్లో తర్ఫీదుని ఇప్పిస్తారు. అంటే కరాటే వంటివి ఈ సంస్థలోని అమ్మాయిలకు కొట్టినపిండి అని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసమే లేని అమ్మాయిలకి ఆత్మరక్షణ విద్యలో ఇచ్చే ట్రైనింగ్ వారిని నిస్సహాయులమనే భావన నుంచి పైకి తీసుకొస్తుంది. ఉపాధి మార్గాలు వారిలో ధైర్యాన్ని నింపి తమ కాళ్ళపై తాము నిలబడేలా చేస్తాయి. గాడితప్పిన జీవితంలో అన్నీ కోల్పోయిన అమ్మాయిలకి ఇంతకంటేచేయతగ్గ సాయం ఇంకేముంటుంది చెప్పండి. దశాబ్దానికి పైగా ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషికి ఫలితంగా ఎందరో మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడి, సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. సమస్య వచ్చాక కాదు, రాకుండానే చూడాలని సంకల్పించి ఆ దిశగా కూడా పనిచేస్తోంది ఈ సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో యాంటీ ట్రాఫికింగ్ సభ్యులను ఏర్పాటు చేసింది. మహిళలు మోసపోకుండా చూడటమే వారి పని. ఇలా ఎందరో మహిళలు ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తుపై మమకారంతో ధైర్యంగా ముందుకు నడిచేలా చేస్తున్న ఈ సంస్థ అధ్యక్షురాలు హేమా బేడీని అభినందించి తీరాలి. -రమ
Publish Date: Mar 30, 2015 10:52AM

కొత్త ఆలోచనే విజయాన్నిచ్చింది

అడుగడుగునా అవరోధాలు, ఏం చేయాలో పాలుపోదు. అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం ఒడిదుడుకుల దారి పడుతుంది. అలాంటి సమయంలో భవిష్యత్తుపై ఆశ ఏ మాత్రం మిగలదు. గుండెల్లో ధైర్యం మొత్తం సన్నగిల్లిపోతుంది. ఇప్పటి వరకు నడచిన ఈ దారి ముసుకుపోతు౦టే ఎలా ఏం చెయ్యాలని మథనపడతాం. కానీ ఎందరో జీవితాలలో వారికెదురైన అవరోథాలే వారిని ఓ కొత్త మార్గం వైపు మళ్ళించాయి. అలాంటి ఓ వ్యక్తి గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం.   ఈరోజు మనం అనకపుత్తూర్ కు చెందిన శేఖర్ గురించి చెప్పుకోబోతున్నాం. చెన్నై సమీపంలో వుందీ ఊరు చేనేతకు పెట్టి౦దిపేరని చెప్పచ్చు. అయిదారు వేల మంది నేత కార్మికులకు అన్నం పెట్టే ఆ వృత్తి ప్రపంచీకరణ నేపధ్యంలో తన ప్రభావాన్ని కోల్పోయింది. చివరికి మెషిన్ల పోటీకి తట్టుకోలేక మగ్గాలు మూలనపడ్డాయి. నేతన్నలు కూలీలుగా మారారు. ఈ పరిస్థితులలో భవిష్యత్తు ఏంటో అర్థంకాలేదు.  శేఖర్ కి ఏం చెయ్యాలో తెలియలేదు కానీ ఏదో చేయాలని మాత్రం గట్టిగా అనుకున్నాడు. ఆలోచించగా ఒక్కటే తోచిందిట. " పోటీపడాలి " తనతో తను పోటీపడాలి. నిన్నటి తనకంటే ఈ నాటి తను, ఈనాటి తనకంటే రేపటి తను మెరుగ్గా ఉండాలంటే వైవిధ్య ఆలోచనలు చేయాలి. ఇలా ఆలోచించగా తను నార చీరలు తయారు చేస్తేనో అనుకున్నాడు. నార చీరలు తయారు చేయాలని నిర్ణయించుకుని మొదట్లో అరటి, జనపనారలతో చీరలు తయారు చేశాడు. వాటి నాణ్యతపై పూర్తి నమ్మకం కుదిరాక ఊళ్ళోని మరి కొందరికి కూడా చెప్పి నార చీరల తయారీ మొదలు పెట్టాడు. ఒక్క చీరలే కాదు బ్యాగులు, దిండు గలీబులు, కార్పెట్లు, డ్రెస్ మెటీరియల్ ఇలా ఎన్నెన్నో వెరైటీల తయారీ ప్రారంభమయ్యింది. వైవిధ్యానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుందిగా! అమ్మకాలు చెన్నై నుంచి బెంగుళూరు, ఢిల్లీలకు విస్తరించాయి. ఇప్పటి వరకు ఎన్నో వేల అరటి నార చీరలు, కలబంద నార చీరలు అమ్మారు. ఆ చీరలు పెద్ద పెద్ద హోదాలలో వున్న వారిని కూడా విపరీతంగా ఆకర్షించాయి. మన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కి కూడా శేఖర్ తయారు చేసిన నార చీరలు అందాయి, నచ్చాయి కూడా. శేఖర్ ని అతను సాధించిన ఈ వినూత్న విజయం గురించి అతన్ని అడిగితే ''మన పని నాణ్యతగా ఉంటే ఆదరణ అదే వస్తుంది. ఏదీ ఎప్పటికీ ఆగిపోదు. ఆగింది అంటే మరోటి ఏదో మన కోసం రెడీగా వుందన్నమాటే. అదేంటో తెలుసుకోవటంలోనే మన విజయం దాగుంటుంది"అంటాడు. అనటమే కాదు ఒకటి తరువాత ఒకటిగా ప్రయోగాలు చేస్తూ అరటి, జనపనార, ఫైనాపిల్, కలబంద ఇలా వేర్వేరు నారలతో చీరలు తయారు చేస్తున్నాడు. తనతోపాటు ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాడు. కేవలం పాతతరం నేత పనికే పరిమితం కాకుండా ఈ కొత్త ఆలోచన చేయబట్టే అతనికి ఇంతటి విజయం దక్కింది. తరతరాలనాటి వృత్తికి భవిష్యత్తు అంధకారమైతే భయపడలేదు, ఓ కొత్త ఆలోచన చేశాడు. దైర్యంతో ఓ అడుగు ముందుకు వేశాడు. విజయం అతని వెంట నడిచింది. సామాన్యుడు అసామాన్యంగా ఎదగటానికి ఈ ఒక్క సూత్రం చాలదూ. చరిత్ర చెప్పే సత్యం ఇదే. ఒక దారి మూసుకుపోతే పది దారులు తెరుచుకున్నట్టే, ఎదగటానికి అవకాశం దొరికినట్టే. అందుకే పరిస్థితులు పగపట్టాయంటూ నిందిస్తూ కూర్చునేకంటే వాటిని దాటే౦దుకు సన్నద్ధమయితే చాలు. కాలం సలాం చేసి మరీ విజయాలని మన గుమ్మంలో గుమ్మరించిపోతుంది.    .........రమ
Publish Date: Dec 6, 2014 10:06AM

మానవత్వ పరిమళం డాక్టర్ శివారెడ్డి

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామానికి చెందిన దాసరి శివ శ్రమజీవి. కొద్ది రోజుల క్రితం ఆయన కరెంట్ పోల్ ఎక్కి టీవీ కేబుల్ లాగుతూ వుండగా హెటెన్షన్ వైర్లు తగిలి ఆయన తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన కుడిచెయ్యి మొత్తం కాలిపోయింది. శరీరం కూడా 36 శాతం కాలిన గాయాలకు గురైంది. ఈ బాధ చాలదన్నట్టుగా తీవ్రమైన వేడి కారణంగా శివ ఊపిరితిత్తులు కూడా పాడైన విషయం బయటపడింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కి చేరుకున్న దాసరి శివకి ‘తెలుగువన్ ఫౌండేషన్’ అండగా నిలిచింది. ఆయనకి బతుకు మీద ఆశ కల్పించింది. హైదరాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రిలో ఆయనకు అవసరమైన వైద్య సేవలు అందేలా సహకరించింది.   దేవుడు ఉన్నాడో లేడో.. ఉంటే ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. అయితే నలుగురికీ ఉపయోగపడేవాడే మనకు కనిపించే నిజమైన దేవుడు. ఆ దేవుడు నేటి సమాజంలో వైద్యుడి రూపంలో కూడా అక్కడక్కడా కనిపిస్తూ వుంటాడు. హైదరాబాద్ మెడిసిటీ ఆస్పత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ శివారెడ్డి అలాంటి వైద్యుడే. దాసరి శివ మెడిసిటీ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డాక్టర్ శివారెడ్డి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు ఎనిమిది మంది నిపుణులైన డాక్టర్ల సహకారంతో శివ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. శివకు ఎలాంటి చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు తగిన చికిత్స చేశారు. డాక్టర్ శివారెడ్డి ఇచ్చిన అద్భుతమైన ట్రీట్‌మెంట్‌తో దాసరి శివ పూర్తిగా కోలుకున్నాడు. కొడిగడుతుందేమోనని అందరూ భయపడిన అతని ప్రాణ దీపం మళ్ళీ ఉజ్వలంగా ప్రకాశించడం ప్రారంభించింది. డాక్టర్ శివారెడ్డి ఎలాంటి ప్రతిఫలాన్ని తీసుకోకుండా శివకు నాణ్యమైన చికిత్సని అందించి ఒక జీవితాన్ని నిలబెట్టారు. మానవత్వం మీద మనకున్న నమ్మకాన్ని మరింత పెంచారు.
Publish Date: Nov 29, 2014 2:41PM

పవిత్ర సంకల్పం ఘన విజయాన్నిచ్చింది

మనం మన గురించి మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల వారికోసం కూడా కొంచెం ఆలోచిస్తే మన వంతుగా మన స్థాయిలో మనమేం చేయగలమని చూడగలిగితే చేయతగింది, చేయాల్సింది చాలా కనిపిస్తుంది. నావల్ల ఏం అవుతుంది, నేనేం చేయగలను అనుకుంటే ఎవ్వరూ ముందడుగు వేయలేరు. ఒక్కొక్క నీటి బిందువు చేరితేనే అనంత సాగరమైనా నిండుగా కనిపించినట్టు ఒక్కరిగా మనం చేసే సామాజిక సేవ అంతో ఇంతో అయినా దాని ప్రభావం ఎక్కువే.   అమ్మ మనసుకి బిడ్డ కష్టం, ఇబ్బంది చెప్పకుండానే తెలుస్తాయి అంటారు. అదే అమ్మ మనసు ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే సమాజంలోని ఎందరో బిడ్డల కష్టాలు, కన్నీళ్ళు కనిపిస్తాయి. బిడ్డ కష్టం చూసిన ఏ తల్లి మనసూ స్పందించకుండా వుండదు. ఆ కష్టం తీరే మార్గాన్ని అన్వేషిస్తుంది. సాయాన్ని అర్ధించే ప్రతి ఒక్కరూ బిడ్డలే. వాటిని తీర్చే ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తీ అమ్మే. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు... 80 మందికి పైగా బిడ్డలని అక్కున చేర్చుకుని, వారికి ఓ దారి చూపించింది పవిత్ర. బెంగుళూరుకి చెందిన ఈమె చేసే సామాజిక సేవ అనన్య సామాన్యం. పవిత్ర... బెంగళూరుకు చెందిన బిపీఓ సంస్థ వింధ్య ఇ ఇన్ఫోమీడియా ఎండీ. ఎంతో ఉన్నత విద్యావంతులై, ఎంతో నైపుణ్యం కలిగి వుండీ తగిన అవకాశం రాక బాధపడే ‘ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్’ వ్యక్తులని వివిధ సందర్భాలలో దగ్గరగా చూసిన పవిత్ర తను వ్యాపారరంగంలోకి రాగానే మొట్టమొదట ఆలోచించింది వారికోసమే. తన వ్యాపారంలో వారిని చేర్చుకోవడం ఎలా అని ఆలోచించింది. ఫలితంగా తన సంస్థలో వివిధ స్థాయిల్లో వైకల్యం ఉన్నవారికే ఉద్యోగాలు ఇచ్చింది. నిరుద్యోగులు అయి వుండీ, తగిన విద్యార్హతలు వుంటేచాలు ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంకితభావం, కష్టపడేతత్వం ఉన్నాయనిపిస్తే చాలు ఉద్యోగం ఇస్తారు. మరి నైపుణ్యం అక్కర్లేదా అంటే పవిత్ర ఇచ్చే వివరణలేంటో తెలుసా? ‘‘డేటా ప్రాసెసింగ్, స్కానింగ్, ఇండెక్సింగ్, వెబ్ రీసెర్చ్ వంటి రంగాల్లో మేం సేవలందిస్తున్నాం. వీటికి అద్భుతమైన నైపుణ్యాలు అవసరం లేదు. ఎంపిక చేసుకున్న ఉద్యోగులకు కంప్యూటర్ స్కిల్, టైపింగ్, వ్యవహారశైలి, ఆంగ్లం వంటి వాటిలో మూడు నెలలు శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత విధులు అప్పగిస్తాం’’. అన్నిటినీ డబ్బుతో కొలుస్తూ, కాలాన్ని డబ్బుతో తూచే వ్యాపారరంగంలో సేవని ఎంత చక్కగా మిళితం చేసిందో చూడండి పవిత్ర. కొద్దిపాటి సహనంతో వారికి శిక్షణ ఇవ్వగలిగితే చాలు.. సాధారణ వ్యక్తులకి ఏమాత్రం తీసిపోకుండా తమ ప్రతిభాసామర్థ్యాలతో అద్భుతాలు చేయగలమని నిరూపించారు ఆ సంస్థ ఉద్యోగులు. ప్రస్తుతం ఆ సంస్థలో 96 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, అందులో 81 మంది వైకల్యం ఉన్నవారే. సంస్థ ప్రారంభం వీరితోనే జరిగింది. మొదట్లో వేలల్లో ఉన్న లాభం ఆ తర్వాత లక్షలు దాటిపోయిందట. అదంతా కేవలం మా సంస్థ ఉద్యోగుల సామర్థ్యం వల్లేనంటుంది పవిత్ర. మామూలు వ్యక్తులకి మా ఉద్యోగులు ఎంతమాత్రం తీసిపోరు. నిజం చెప్పాలంటే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడంలో వీరే ముందుంటారు అని చెప్తారు. వినలేని, చూపులేని ఇతరత్రా శారీరక వైకల్యమున్న ఉద్యోగులు పనిలో చూపించే శ్రద్ధకు తగిన ప్రతిఫలాలే పొందుతున్నారు. బిపిఓ సంస్థలో ఉన్న వేతనాలకు దీటుగా వేలల్లో జీతాలు అందుకుంటున్నారు. అంతేకాదు, వారందరికీ భోజనం, గృహవసతి సౌకర్యాలతోపాటు నెలకోసారి వారి ఇబ్బందుల పరిశీలనకు ప్రత్యేక సమావేశం కూడా వుంటుంది. ప్రతీ మూడు నెలలకు మెడికల్ చెకప్ వంటివీ వుంటాయి. ఇవన్నీ వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నాయి. వారి లోపాన్ని మరచిపోయేలా చేస్తున్నాయి.  నిజానికి సాయం చేయడం అంటే వారికి వారిగా నిలుచునేలా చేయడం. ఆత్మవిశ్వాసంతో గర్వంగా తలెత్తుకునేలా చేయడం. ఎవరైనా, ఎవరికైనా ఒక్కరోజు ఆకలి తీర్చడం కంటే, వారికి వారుగా ఆకలి తీర్చుకునే మార్గాన్ని చూపిస్తే అది వారిని ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు తిరిగేలా చేస్తుంది. పవిత్ర చేస్తున్న పని ఇదే. ‘‘అంగవైకల్యమున్నవారిని చూసి జాలిపడటం, సానుభూతి చూపించడం కాదు. వారికి చిన్న చేతి ఊతమిచ్చి వారి సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. నిండైన వ్యక్తిత్వంతో ముందుకు నడిచేలా చేయాలి. అది మనందరి బాధ్యత కూడా’’ అనే పవిత్ర తన సంస్థ ఉద్యోగులలో ఒకరిగా కలసిపోతూ, వారి కష్టసుఖాలని తనవిగా భావించి, పరిష్కరించి కలసికట్టుగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అలు వ్యాపార రంగంలోను, ఇటు సామాజికపరంగానూ విజేతగా నిలిచారు. ఇలా ప్రతి ఒక్కరూ పవిత్రలా ఆలోచిస్తే ఎందరివో కన్నీళ్ళు తుడవచ్చు. మరెందరీ జీవితాల్లోనో వెలుగును నింపవచ్చు. -రమ
Publish Date: Nov 20, 2014 1:22PM

మలాలా అంటే చదువుల తల్లి

మొన్నటి వరకూ తల్లిదండ్రుల చాటున పెరిగిన ముగ్ధలాంటి ఆడపిల్ల మలాలా... ఇప్పుడు కేవలం 17 సంవత్సరాల వయసులోనే నోబుల్ శాంతి బహుమతి గెలుచుకుని మహిళా శక్తిని మరోసారి ప్రపంచానికి చాటింది. గంజాయి వనంలో తులసిమొక్క పుట్టినట్టుగా, హింస అంటే పడిచచ్చే పాకిస్థాన్‌ దేశంలో పుట్టిన శాంతి కపోతం మలాలా యూసఫ్‌జాయ్. మలాలా యూసఫ్‌జాయ్ పాకిస్థాన్‌లోని స్వాత్ ప్రాంతంలో పుట్టి పెరిగింది. తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా వున్న ఆ ప్రాంతంలో మహిళలు చదువుకోవడం అంటే అది చంపడం లాంటి భారీ శిక్ష విధించేంత పెద్ద నేరం. అయితే చదువుకోవడం నా జన్మహక్కనే మలాలా బడికి వెళ్ళితీరతానని పట్టుబట్టింది. బాలికలు చదువుకోవడం మీద నిషేధం వున్న ప్రాంతంలో చదువుకుంటానని తన బలమైన సంకల్పాన్ని వ్యక్తం చేసింది. బాలికల చదువు మీద తాలిబన్ల అదుపాజ్ఞలను పదకొండేళ్ళ వయసులోనే వ్యతిరేకించి, అందుకు నిరసనగా గళం విప్పింది. చిన్న వయసులోనే విద్యాకార్యకర్తగా ప్రశంసలు అందుకుంది. మలాలా అభ్యుదయవాద ధోరణిని సహించలేని ఒక దురదృష్టకరమైన సమయంలో చిన్నారి మలాలా మీద ఒక తాలిబన్ ఉన్మాది అత్యంత పాశవికంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మలాలా ఇక చనిపోతుందని అందరూ అనుకున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా మలాలా అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారంటే ఆమె ఏ స్థాయిలో గాయపడిందో అర్థం చేసుకోవచ్చు. నెత్తుటి ముద్దలా మారిన చిన్నారి మలాలా తన సంకల్పబలంతో కోలుకుంది. ఆ తర్వాత పాకిస్థాన్‌లోని హింసాత్మక వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోయిన మలాలా లండన్‌లోని బ్రూమింగ్‌హామ్‌లో ఆశ్రయం పొందింది. అక్కడి నుంచి బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తోంది. మలాలా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ఇప్పుడు ఆమెకి లభించిన నోబెల్ శాంతి పురస్కారం ఆమెకు అంది తీరాల్సిన అత్యున్నత గౌరవం. మలాలాకి అభినందనలు.
Publish Date: Oct 14, 2014 6:30PM

సబ్బుబిళ్ళ.. కాదేదీ సమాజ సేవకి అనర్హం..

మనం వాడిపడేసే చిన్న సబ్బు బిళ్ళతో ఒక దేశంలోని ప్రజల ప్రాణాలు కాపాడచ్చు అంటే నమ్మగలరా. కానీ, ఇది నిజం, నమ్మితీరాలని నిరూపించాడు కయాన్గో అనే యువకుడు.   సాధారణంగా ఇళ్ళలో సబ్బు పూర్తిగా అయ్యేదాకా వాడం మనం. చేతికి చిక్కనంత చిన్నది కాగానే చెత్తలో పారేస్తాం. ఇక ఇక హోటల్ రూమ్స్‌లో పెట్టే రకరకాల సబ్బుల్ని ఆ హోటళ్ళలో దిగినవాళ్ళు తిరిగి కాళీ చేసేటప్పుడు అప్పటిదాకా వాడిన సబ్బుల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. సిబ్బంది వాటిని తీసి పడేస్తుంటారు. ఇంచుమించు అలా తీసి పడేసే సబ్బు బిళ్ళలు అమెరికాలో అయితే కొన్ని టన్నులు ఉంటాయట ఒక్క రోజుకే. సబ్బు ఖర్చు మనకి లెక్కలేదు. కానీ, ఉగాండాలో సబ్బు ఓ విలాసవస్తువు కిందే లెక్క. ఓ సబ్బు ఖర్చుతో ఓరోజు తిండి గడిచిపోతుంది అక్కడి సామాన్యుడికి. దాంతో సబ్బు వాడకం దాదాపు తక్కువ. దీనివల్ల అక్కడి పిల్లలు అంటురోగాల బారిన పడి మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని కళ్ళారా చూసిన ఉగాండా యువకుడు కయోన్గో ఉద్యోగం కోసం కెన్యా వలస వచ్చినప్పుడు సబ్బును ఇక్కడ ఎలా వృధాగా పారేస్తున్నారో చూసి బాధపడిపోయాడు. ఏదో ఒకటి చేసి అక్కడి అవసరాన్ని ఇక్కడి వృధాతో తీర్చాలనుకున్నాడు. అలా ‘గ్లోబల్ సోప్ ప్రాజెక్టు’ను ప్రారంభించాడు. ప్రాజెక్టు ద్వారా హోటళ్ళలో వృధాగా పడేసే సబ్బులను సేకరించి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని కరిగించి మళ్ళీ వాటిని కొత్త సబ్బులుగా తయారుచేస్తారు. ఆ సబ్బులను ఉగాండాలోని పేదవాళ్ళకి పంచుతారు. ఇలా కయెన్గో చేసిన చిన్న ప్రయత్నం అక్కడి పిల్లల ప్రాణాలు కాపాడింది. అపరిశుభ్రత వల్ల రోగాల బారిన పడి మరణించే పిల్లల సంఖ్య తగ్గింది. ఒక్క యువకుడి చిన్న ప్రయత్నం వృధా అయిపోయే సబ్బులను ప్రాణాలు కాపాడేవాటిగా మార్చగలిగింది. ఆలోచించండి. మనదేశంలోనూ సబ్బుబిళ్ళకు నోచుకోని పేదవాళ్ళు ఎందరో. వృధాగే పడేసే సబ్బు బిళ్ళలూ కొన్ని టన్నులు వుంటాయి. మరి వాటిని అవసరమైన వారికి చేర్చేదెవరు. ఇవేకాదు... ఇలాంటి ఎన్నో చిన్న,పెద్ద అవసరాలు ఒకే ఒక్కరి ప్రయత్నంతో తీరతాయి. కావలసింది ఆలోచన - ఆచరణ. మరి ఆలోచించడం మొదలుపెట్టారా?   -రమ  
Publish Date: Sep 30, 2014 10:36AM

పేదల ముంగిట్లో విద్యాదాత రజని పరాంజపే!

పెద్ద విజయాలు సైతం చిన్న ప్రయత్నాలతోనే మొదలవుతాయి. ఒక్కరి ఆలోచన వేలాది మంది జీవితాలను మార్చేయొచ్చు. అదే జరిగింది. ముంబాయిలో. ముంబాయి వంటి మహానగరంలో మురికివాడలకి కొదవే లేదు. అక్కడ పూటగడవటమే కష్టంగా వుండేవారు ఎందరో. ఇక అక్కడి పిల్లలకు చదువు, స్కూలు అన్నవి తీరని కలలు. వాధుల్లో చెత్తాచెదారం ఏరుకుంటూ, చిన్నచిన్న పనులు చేసుకుంటూ పెరిగి పెద్దయ్యి... మరో తరం ఆ మురికివాడల్లో పేదరికంతో మగ్గిపోతోంది. అదే అక్కడి పిల్లలని అక్షరాస్యులుగా తీర్చిదిద్దితే? అది వారి జీవన ముఖచిత్రాన్నే మార్చేస్తుంది. చిన్నగా అయినా ఓ మార్పు మొదలయితే అది క్రమంగా ముందు తరాలని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుంది. ఈ ఆలోచన వచ్చిందో వ్యక్తికి. ప్రయత్నం చేస్తే వేలాదిమంది జీవితాలు మారిపోయాయి. ‘రజని పరాంజపే’. ఈమెకి వచ్చిన ఆలోచనే నేడు ఎందరికో అక్షర జ్ఞానాన్ని పంచుతోంది. ప్రత్యేకంగా స్కూలు వరకు రాలేని పిల్లల వద్దకే స్కూలుని తీసుకువెళితే? పేదల ముంగిట్లోకి పాఠాలని చేరిస్తే? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ దిశగా ప్రయత్నాలు సాగించారామె. ఆ ప్రయత్నాల నుంచి పుట్టిందే ‘డోర్ స్టెప్ స్కూల్’. ఓ చిన్న బస్సు. అందులో బోర్డు, పుస్తకాలు, కూర్చునేందుకు బల్లలు, పలకలు, బలపాలు. అచ్చంగా ఓ తరగతి గదిలా వుంటుంది. అందులో పిల్లలకు అక్షరాలు నేర్పించే టీచర్లు వుంటారు. ఆ బస్సు మురికివాడల్లోకి వెళ్తుంది. అక్కడి పిల్లలందర్నీ బస్సులో చేర్చి వారితో అక్షరాలు దిద్దిస్తారు అందులోని టీచర్లు. ‘విద్యార్థుల దగ్గరకి పాఠశాల’ ఇలా ప్రారంభమైంది. పిల్లల ముంగిట్లోకి పాఠశాలని తీసుకువెళ్ళి, వాళ్ళకి నచ్చచెప్పి, బొమ్మలు, చాక్లెట్లు వంటివి ఇస్తామని ఆశచూపి, అక్షరాలని దిద్దించి, ఆ తర్వాత ప్రాథమిక విద్య కోసం దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం.. ఇది వారి లక్ష్యం. అయితే చెప్పుకున్నంత సులువుగా సాధ్యం కాలేదది. వీరిపై నమ్మకం కలిగేలా చేసుకోవడానికే ఎంతో సమయం పట్టింది. ఆ తర్వాత ఒకసారి ‘డోర్ స్టెప్ స్కూల్’లోకి అడుగుపెట్టాక ఆ పిల్లలు కనీస విద్య పూర్తిచేసే వరకూ మధ్యలోనే మానేయకుండా చూడటం మరో పెద్ద సమస్య. వీటన్నిటితోపాటు ఆ కుటుంబానికి కావలసిన కనీస అవసరాలు, ఆర్థిక సహాయం వంటివి అందించడం ద్వారా వారితో సత్సంబంధాలని పెంపొందించుకోవడం.. ఇలా ఎన్నో సవాళ్ళని ఎదుర్కుని నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డారు ‘డోర్ స్టెప్ స్కూల్’ సంస్థ వారు. ఓ మంచి  ఆశయంతో ఓ అడుగు ముందుకు వేసిన ‘డోర్ స్టెప్ స్కూల్’ ఒక్క బస్సుతో, ఒక ప్రాంతంలో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టి నేడు ముంబాయి, పూణెలలో సుమారు 40 ప్రాంతాల వరకు తన సేవలను విస్తరించింది. ఎన్నో బస్సులు ఉదయం 8 గంటల నుంచి  రాత్రి 9 గంటల వరకు వివిధ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ పిల్లలకి చదువు చెబుతాయి. అంతేకాదు, బస్సులో ప్రాథమికంగా అక్షరాలు నేర్చుకుని ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చేరిన పిల్లలని ఇంటి నుంచి స్కూలుకు చేర్చటం, స్కూలు నుంచి ఇంటికి చేర్చటం వంటివి కూడా చేస్తాయి ఈ బస్సులు. కేవలం స్కూలులో చేర్చటంతో తమ పని అయిపోయిందని అనుకోకుండా వారు కనీస విద్య పూర్తిచేసేదాకా వారి వెన్నంటి వుంటారు ‘డోర్ స్టెప్ స్కూలు’ వారు. అందరికీ విద్య అందుబాటులో వున్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుంది. విద్య ఉపాధిని అందిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక స్థితిగతులను మారుస్తుంది. అందుకే అందరికీ విద్య అందుబాటులో వుండాలన్నది మా ఆశయం అంటారు ఆ స్వచ్ఛంద సంస్థ వారు. పిల్లలు చదువు పూర్తిచేశాక వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఉపాధి అందించే వివిధ కోర్సుల్లో వారి ఇష్టాన్ని అనుసరించి చేర్పిస్తారు. ఆ తర్వాత ఉపాధి అందేలా చూస్తారు. ఇలా ముందు తరం సగర్వంగా తలెత్తుకు నిలబడేలా చేస్తున్నారు వీరు. వారి ప్రయత్నానికి అభినందనలు తెలుపుతూ ఆ స్ఫూర్తితో మనం కూడా మన పరిధిలో ఏం చేయగలమో ఆలోచిద్దాం. -రమ ఇరగవరపు
Publish Date: Jul 17, 2014 1:08PM

పేద పిల్లలకు ప్రేమనుపంచే ‘లాక్స్ ఆఫ్ లవ్’

  చక్కటి ఆకారానికి జడ అందాన్నిస్తుంది. ఎంతటి అందమైనా సరైన తలకట్టు లేకపోతే వెలవెలబోతుంది. అందులోనూ ఇప్పటి వాళ్ళకి జుట్టు విలువ తెలిసినంతగా వేరెవరికీ తెలియదు. ఎందుకంటే, వత్తయిన తలకట్టు, బారు జడ, మగవారికైతే వత్తయిన క్రాఫు అన్నీ ఒకప్పటి ముచ్చట్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు చిన్న పోనీటైల్. దానిని సంరక్షించుకోవాడానికే ఎన్నో ప్రయత్నాలు. ఏ ఇద్దరు అమ్మాయిలు కలసినా రాలిపోతున్న జుట్టు గురించి కబుర్లు దొర్లకుండా వుండవు. ఇక అబ్బాయిలకైతే చిన్న వయసులోనే బట్టతల బాధలు తప్పడం లేదు. కొద్దోగొప్పో నాలుగు వెంట్రుకలయితే వున్నాయి కదా. ఆ నాలుగు వెంట్రుకల కోసమే మనమింతగా బాధపడిపోతే, అసలేమీ లేకుండా, ఉన్న జుట్టుంతా పోగొట్టుకుని బోడిగా వుండేవారి సంగతి? డబ్బున్నవారికైతే ఏ విగ్గులో దొరుకుతాయి. మరి పేదవారి సంగతి? అందులోనూ పిల్లల సంగతి? ఎప్పుడైనా ఆలోచించామా? లేదు కదా- ఇప్పుడు ఆలోచిద్దాం.   కేన్సర్ అటేనే అమ్మో అంటాం. దాని ట్రీట్‌మెంట్ మొత్తం తట్టుకోవడం ఒక ఎత్తు. ఆ ట్రీట్‌మెంట్ జరిగే సమయంలో ఒక్క వెంట్రుక సైతం లేకుండా మొత్తం జుట్టుంతా పోగొట్టుకోవడం ఒక ఎత్తు. ఒట్టి కేన్సరే కాదు, ఒళ్ళు కాలడం, ఇంకా రకరకాల అనారోగ్యాలతో, వ్యాధులతో జుట్టు కోల్పోవడం ఎంతో బాధపెట్టే విషయం. ఇదంతా చెప్పుకున్నట్టు డబ్బుతో ఏ విగ్గులో కొనుక్కోగలిగే వారి సంగతి పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా ఇలా జుట్టు కోల్పోయి మానసికంగా కృంగిపోతున్న పేదపిల్లల పరిస్థితి మరీ కష్టం. ఓపక్క వ్యాధి తాలూకు బాధ, మరోపక్క తోటి పిల్లల మధ్య జుట్టులేక ఇబ్బంది. ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మరి ఆ పిల్లలకి పరిష్కారమేంటి? మనమేం చేయగలం. ఎలాంటి సహాయం అందించగలం?   మనం అయ్యోపాపం అంటూ వదిలేసే విషయాలని కొంతమంది అలా వదిలెయ్యలేక వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారు. వివిధ అనారోగ్య కారణాలతో జుట్టుని పోగొట్టుకుని బోడిగా తయారైన తలతో స్కూళ్ళలో, సమాజంలో తిరగలేక న్యూనతకి గురయ్యేవారి కోసం వారికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోంది ‘లాక్స్ ఆఫ్ లవ్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తోందో తెలుసా? ఓ ఉద్యమంలాగా ప్రజల నుంచి ‘జుట్టు’ని దానంగా తీసుకుంటోంది. ఆ తరువాత ఆ జుట్టుని చక్కటి అందమైన విగ్గులా తయారుచేసి  పేదపిల్లలకి అందిస్తోంది. అమెరికాలోని ఈ స్వచ్ఛంద సంస్థకి జుట్టు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చేరుతోందిట. ఎంతోమంది స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు స్వచ్ఛందంగా తమ జుట్టుని ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నారు.   ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న ఎంతోమంది పేదపిల్లలకి మన జుట్టుని దానంగా ఇవ్వాలనుకుంటే శుభ్రంగా తలస్నానం చేసి, ఆరబెట్టుకున్న జుట్టుని ఒకే లెవల్‌లో కట్ చేయాలి. దాన్ని ఓ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి మన పేరు, వివరాలతో వీరికి పంపాలి. జుట్టు కనీసం 10 అంగుళాలు వుండాలి. చిక్కుపడిన జుట్టు, వెంట్రుకల చుట్టలు కాకుండా ఒకే పద్ధతిలో వున్న వెంట్రుకలు పంపాలి. ఆ తర్వాత అవి అందమైన విగ్గులుగా తయారై  పిల్లలకి అందుతాయి. ఈ విధానమంతా ఎంతో పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ సంస్థ కార్యకలాపాలకి మెచ్చి అంతర్జాతీయంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకు రేటింగ్ ఇచ్చే ‘ఛారిటీ నావిగేటర్’ ఈ సంస్థకు 68.1 రేటింగ్ ఇచ్చింది. 70 పాయింట్లకి 68 పాయింట్లు వచ్చాయంటే అర్థమవుతోంది కదా ఈ సంస్థ ఎంత నిస్వార్థంగా పనిచేస్తోందో? మరి పంపటానికి అడ్రస్సో అంటారా? www.locksoflove.orgకి వెళ్ళి అక్కడ చెప్పిన అడ్రస్‌కి మన జుట్టుని పంపడమే. ఎందరో పిల్లల ముఖాల్లో నవ్వులని, మనసులలో ధైర్యాన్ని, గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ఈ దానం మహాదానం కాకపోయినా చిన్నదానమైతే కాదు. locksofloveకి సహాయపడగలిగితే పరోక్షంగానైనా ఎందరో పిల్లలకి మంచి చేసినట్టే. ఆలోచిస్తారు కదూ! -రమ ఇరగవరపు
Publish Date: Jul 4, 2014 1:48PM

శాస్త్రీయ విద్యాదాత రామ్జీ రాఘవన్!

  నేటి విద్యావ్యవస్థ పైన ఎంతోమందికి అసంతృప్తి వుంది. మేధావులు, విద్యావేత్తలు, నిపుణులు ఇప్పటి విద్యావిధానం పిల్లల్లోని ఆలోచనశక్తిని, ప్రశ్నించే తత్వాన్ని తగ్గించేస్తోందని వాపోతున్నారు. వీటన్నిటిని దగ్గరగా గమనించిన ఓ వ్యక్తికి వచ్చిన ఓ ఆలోచన ఈరోజు ఎంతోమంది విద్యార్థులలోని సృజనాత్మకతకి, మేధోవికాసానికి కృషి చేస్తోంది. అతనే రామ్జీ రాఘవన్. ‘అగస్త్య సైన్స్ సెంటర్’ స్థాపకుడు. పాఠాల్ని బట్టీకొట్టించడం కాకుండా ప్రయోగాలు, నమూనాల ద్వారా బోధించగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని భావించారు.   బాభా సైన్స్ సెంటర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇస్రో శాస్త్రవేత్తల సహకారంతో భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, పర్యావరణ శాస్త్రాలకు సంబంధించిన 300 వరకు ప్రయోగాలు, బోధన నమూనాలు సిద్ధం చేశారు. 2001 నుంచి వాటినిచిత్తూరు జిల్లాలో ప్రదర్శనకు ఉంచారు. ప్రయోగాలు, నమూనాల ద్వారా పాఠాలు చెప్పడాన్ని ముందుగా గ్రామాల్లో ప్రారంభించాలనుకున్నారు రాఘవన్. సైన్స్ కేంద్రానికి సమీపంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థుల్ని తీసుకొచ్చి ప్రతి సబ్జెక్టును నమూనాల సాయంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు బోధించడం మొదలుపెట్టారు. ‘అగస్త్య సైన్స్ కేంద్రం’లోకి విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అనుమతి వుంది. ఉపాధ్యాయులకి ఆధునిక పద్ధతుల్లో శిక్షణ కూడా ఇస్తారు ఇక్కడ. అలాగే చుట్టుపక్కల స్కూల్స్‌లో తరచూ సైన్స్ ఫెయిర్‌లను ఏర్పాటు చేస్తుంటారు. అగస్త్య సేవలు ఇప్పటి వరకు దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు, దాదాపు 80 వేల మంది ఉపాధ్యాయులకూ చేరాయి. ఈ సైన్స్ కేంద్రంలో నిత్యం ఒకే తరహా ప్రయోగాలు కాకుండా ఎప్పటికప్పుడు కొత్త వాటిని చేర్చుతుంటారు. అలాగే ఇక్కడ కేవలం పాఠాలే కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాల్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో వివరిస్తారు. సైన్స్ కేంద్రానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు దూరప్రాంతాల నుంచి తరచూ రావడం కష్టమవుతోందని భావించి అగస్త్య ప్రాంతీయ సైన్స్ కేంద్రాలని ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో సంచార ప్రయోగశాలల్ని ప్రారంభించారు. సైన్స్ పరికరాలతో నిండిన మినీ బస్‌లో అగస్త్య టీమ్ ఊరూరా తిరుగుతూ ప్రయోగాలతో పాఠాలు బోధిస్తుంది. వీటిలో ఇద్దరు శిక్షకులు వుంటారు. ప్రస్తుతం ఈ సైన్స్ సెంటర్ 35కు పైగా మొబైల్ ల్యాబ్‌‌లను నడుపుతోంది. అగస్త్య సైన్స్ సెంటర్‌ని సందర్శించి నమూనాలు, ప్రయోగాల ద్వారా పాఠాల్ని నేర్చుకున్న చుట్టుపక్కల పాఠశాలల విద్యార్థులలో ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగిందట. సైన్స్.లో ఉత్తీర్ణతా శాతం 90 శాతంగా వుందంటే అర్థమయిపోతుంది పిల్లలు ఇక్కడ సైన్స్.ని చూసి నేర్చుకోవడాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో.   .....రమ
Publish Date: Jun 27, 2014 10:15AM

అతనిది ‘మంచి’నీళ్ళ మనసు!

  పిల్లల మనసులు స్వచ్ఛంగా వుంటాయి. అమాయకంగా ఆలోచిస్తాయి. అయితేనేం ఆ మనసులలో ఏదన్నా పడిందంటే అంత తొందరగా మర్చిపోరు. మనం విసుక్కుంటున్నా పదేపదే ఆ విషయాన్నే అడుగుతూ వుంటారు. మనకి అది విసుగనిపిస్తుంది. కానీ వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ‘రియాన్’లా చిన్న వయసులోనే అద్భుతాలు చేయచ్చేమో. రియాన్‌కి ఆరేళ్ళ వయసులో టీచర్ మంచినీళ్ళ గురించి పాఠం చెబుతూ అవి ఆరోగ్యానికి ఎంతో అత్యవసరమైనవి, అయితే ప్రపంచంలో వందకోట్ల మందికి పైగా మంచినీరు దొరకక ఇబ్బందిపడుతూ వుంటారని చెప్పారు. అది విని రియాన్ మనసులో ఎన్నో సందేహాలు. ఇంటికి వచ్చి వాళ్ళమ్మ ముందు ఉంచాడా సందేహాలన్నీ. ఆమె ఓపిగ్గా అన్నిటికీ సమాధానం చెప్పింది. అసలు సమస్య ఏంటి? దాని పరిష్కారం ఏంటి? ఏం జరిగితే వాళ్ళదరి ఇబ్బందులు తీరతాయి? వంటివన్నీ వివరంగా చెప్పింది రియాన్‌కి వాళ్ళమ్మ. అమ్మ చెప్పిన విషయాలన్నీ విన్న రియాన్ ‘‘అమ్మా నేను వాళ్ళందరి నీటి కష్టాలని తీరుస్తాను. అందరికీ మంచినీళ్ళు అందిస్తా’’ అన్నాడు.   కొడుకు మాటలని చిన్నపిల్లాడి మాటలని తీసిపారేయలేదు ఆమె. నువ్వేం చేయగలవని నిరుత్సాహ పరచలేదు. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థకి ఫోన్ చేసి తన కొడుకు ఆశయం గురించి చెప్పింది. వాళ్ళ సలహా మేరకు రియాన్ తన అన్నయ్యతో కలసి చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని సాయం కోరాడు. అతి కష్టం మీద ఓ 200 డాలర్లు సమకూరాయి. ఆ మొత్తాన్ని ఓ ఎన్జీఓ సాయంతో ఉగాండాలోని ఓ మారుమూల గ్రామంలో బోరుబావి తవ్వించడానికి ఉపయోగించారు. ఆ బోరుబావిలోని నీరు అక్కడి ప్రజలందరికీ అందిని రోజున రియాన్ ఆనందానికి హద్దులు లేవు. అప్పటిదాకా ఏదో చిన్నపిల్లాడు అడిగాడు కదా అని సాయం చేసిన వారంతా ఆ కుర్రాడి పట్టుదలని అర్థం చేసుకుని సాయపడటం మొదలుపెట్టారు.   అప్పుడు ‘రియల్ వెల్ ఫౌండేషన్’ మొదలైంది. ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచినీటి కొరత వుందో భూతద్దం పెట్టి వెతకడం మొదలుపెట్టాడు రియాన్. అతని కుటుంబ సభ్యులు కూడా అతనికి తోడుగా నిలిచారు. ప్రపంచ దేశాల్లో రక్షిత తాగునీటికి నోచుకోని ప్రజల్ని గుర్తించడం, వారి అవసరాలని తీర్చేవిధంగా ప్రాజెక్టులు రూపకల్సన చేయడం, నిధుల సేకరణ, ఆ ప్రాజెక్టుల అమలు, కార్యకలాపాలు చురుకుగా సాగిపోయాయి. ఇథియోపియా, జింబాబ్వే, కెన్యా.. ఇలా ఎన్నో దేశాలలో మంచినీటి బావులు, బోరులు తవ్వించగలిగాడు. ఎన్నో ఆఫ్రికా దేశాల్లో రియాన్ సేవలు బాగా విస్తరించాయి. దాదాపు 14 దేశాలకు పైగా కొన్ని వందల ప్రాజెక్టులు చేపట్టి వాటిని పూర్తిచేసింది రియల్ వెల్ ఫౌండేషన్.   ఇప్పుడు రియాన్‌కి 20 ఏళ్ళు. ఈ 14 ఏళ్ళ కాలంలో తన చదువు, ఆటలు, పాటలతో పాటు తన ఆశయ సాధనకు కూడా సమయం వెచ్చిస్తూ వస్తున్నాడు రియాన్. ఎన్నో స్కూళ్ళకి వెళ్ళి అక్కడ విద్యార్థులకు తాగునీటిపై అవగాహన కల్పిస్తూ వుంటాడు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటాడు. పెద్దపెద్ద నేతల ముందు తన ఆశయం, సాధించిన విజయాలు, చేయాల్సిన పనుల గురించి చక్కగా ప్రసంగిస్తాడు. అందుకే ఎన్నో అతర్జాతీయ అవార్డులు రియాన్‌ని వెతుక్కుంటూ వచ్చాయి. దాదాపు అన్ని ప్రముఖ దేశాల అధినేతలు రియాన్‌ని స్వయంగా కలసి అభినందించారు. చిన్న వయసులోనే యూనిసెఫ్‌కి వాటర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు రియాన్.   ‘‘నేను చాలా సామాన్యమైనవాడిని. నేను గ్లాసు మంచినీళ్ళు తాగినప్పుడల్లా ఈ నీరు దొరకక ఎంతమంది బాధపడుతున్నారో కదా అనిపిస్తుంది. అంతే, నా ఆశయం నన్ను పరిగెత్తిస్తుంది. ప్రపంచంలో ఎన్నో కష్టాలు. అన్నీ నేను తీర్చలేకపోవచ్చు. కానీ, కనీస అవసరమైన మంచినీరు అందరికీ అందేలా చేస్తాను’’ ఇవి రియాన్ మాటలు. అనడమే కాదు, చకచకా ముందుకు సాగిపోతున్నాడు కూడా. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 884 మిలియన్ ప్రజలు రక్షిత మంచినీరు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ఎన్నో మిలియన్స్ ప్రజలు ఈ కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. ఇవి లెక్కలు. కానీ రియాన్ లాంటి వాళ్ళని కదిలించే సత్యాలు. హ్యాట్సాఫ్ టు రియాన్ అందామా!
Publish Date: Jun 14, 2014 1:16PM

ఆమె ఒక "శక్తిశాలిని"

      ఒక కష్టం కలిగినప్పుడు ఆ కష్టం వల్ల కలిగే బాధ కొందర్ని క్రుంగదీస్తే, మరికొందర్ని దృఢంగా మారుస్తుంది. కొందరికి ఆ కష్టం నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. మరికొందరిని తమలాంటి కష్టం కలిగిన వారిని ఎవరు ఓదారుస్తారన్న ఆలోచన వెంటనే తేరుకునేలా చేస్తుంది.   కన్నబిడ్డలంటే ఎవరికైనా ఎంతో మమకారం వుంటుంది. చిన్నతనం నుంచి కంటికి రెప్పల్లా కాచుకుని, అపురూపంగా పెంచుకున్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా, కట్నం కోసం కాల్చిపారేశారని తెలిస్తే? అందులోనూ కడుపులో బిడ్డని మోస్తున్న కూతుర్ని కిరాతకంగా భర్త, అత్తమామలే చంపారని తెలిస్తే? ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా వుంటుంది. కానీ, ఆ బాధ నుంచే మరెందరికో ఆశ్రయం ఇచ్చే ఓ సంస్థ పుట్టింది. ఆ బాధే ఎందరో అభాగ్యులకి తోడుగా నిలిచి పోరాడేలా చేసింది. సత్యరాణి కూతురు కట్నం కోసం బలైపోయింది. తీరని దు:ఖమే అయినా, తనలా మరెవరూ కూతురున్ని పోగొట్టుకోకూడదనే ఆశయంతో ఎన్నో సంవత్సరాలుగా ఇంటికే పరిమితమైన సత్యరాణి వరకట్నంపై పోరాటం ప్రారంభించింది. చట్టాలు, న్యాయస్థానం వీటి సంగతి పక్కన పెట్టి ముందు సమాజంలోని వ్యక్తులలో మార్పు కలిగినప్పుడే  ఈ దురాచారం సమూలంగా సమసిపోతుందని నమ్మి  ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీలో నివసించే సత్యరాణి ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేదు. చట్టం, న్యాయం, గురించి ఏమాత్రం తెలియకపోయినా వరకట్నానికి సంబంధించిన చట్టాలని, వాటిలోని లోటుపాట్లని తెలుసుకునేందుకు ప్రయత్నించింది. వరకట్నానికి వ్యతిరేకంగా మాత్రమే  పోరాటం సాగించాలనుకున్నా, ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు మరెన్నో స్త్రీల సమస్యలు బయటపడ్డాయి. ఉద్యమం విస్తృతమైంది. అత్యాచారం వంటివి జరిగినప్పుడు, ప్రేమ వివాహాలలో మోసపోయినప్పుడు సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఆత్మహత్యకి పాల్పడే యువతులను రక్షించి, వారికి ఆశ్రయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి, వారి కాళ్ళపై వారు నిలబడేలా చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో సంకల్పం తనదే అయినా చేయందించే సహృదయులు ఎందరో వుండబట్టే తాను ఈమాత్రం సేవ చేయగలుగుతున్నానంటారు సత్యరాణి. ప్రపంచం ఎంత ఆధునీకరణ దిశగా పయనిస్తున్నా, ఇంకా సంకుచితంగా ఆలోచించేవారు ఎందరో వున్నారు. భార్యని నిర్దాక్షిణ్యంగా ఇళ్ళలోంచి వెళ్ళగొట్టడం వంటివి ఇప్పటికే వింటున్నాం. అలా నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడమే కాదు.. వారి సమస్యను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నిస్తారు. వారి కుటుంబంతో మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తారు. అవసరమైతే చట్ట సహాయం కూడా తీసుకుంటారు. తిరిగి ఆమెని తన ఇంటికి పంపించాక, అక్కడితో తమ పని అయిపోయిందని అనుకోకుండా, ఆమె బాగోగుల గురించి అప్పుడప్పుడు ఆరా తీస్తుంటారు. అవసరమైన సహాయాన్ని అందిస్తుంటారు. ఇవన్నీ సత్యరాణి ప్రారంభించిన ‘శక్తిశాలిని’ అనే సంస్థ ఆమె ఆధ్వర్యంలో నిర్వహించే కార్యకలాపాలు. కేవలం ఒక గృహిణిగా, ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేదు. సమాజం పోకడలు, న్యాయం, చట్టం వంటి విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు. కానీ, ఓ సంకల్పం చేసుకుంది. ఆ దిశగా అడుగులు కదిపించింది. మొదట ఒక వ్యక్తిగా ప్రారంభించిన కార్యకలాపాలు ఈరోజు వందల మందిని భాగస్వాములను చేశాయి. ఒకటొకటిగా మహిళల కష్టాలని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిస్పృహ నిండిన వారిలో ధైర్యాన్ని, స్ఠైర్యాన్ని నింపుతూ, ‘నేనున్నానన్న’ భరోసాని అందిస్తోన్న సత్యరాణి తపన అమ్మ మనసుకి అద్దం పడుతుంది. తన మనసులో, ఒడిలో ఎందరో కూతుళ్ళకి స్థానం కల్పించిన ఈమె వయసుతో సంబంధం లేకుండా అలుపెరుగని పోరాటం సాగిస్తూనే వున్నారు గత 20 సంవత్సరాలకు పైగా. మొదటి అడుగులో ఒక్కరమే.. కానీ, సంకల్పం మంచిదైనప్పుడు ఆ అడుగుల వడిలో జత చేరే అడుగులు మరెన్నో వుంటాయి. ఇది నిజం.  
Publish Date: Jun 3, 2014 6:01PM

శేఖర్ సాధించిన విజయం

      ఒకోసారి కాలం పరీక్ష పెడుతుందేమో అనిపిస్తుంటుంది. అడుగడుగూ అవరోధాలు - ఎం చేయాలో పాలుపోదు. అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం ఒడిదుడుకుల దారి పడుతుంది. అలాంటి సమయంలో భవిష్యత్తుపై ఆశ ఏ మాత్రం మిగలదు. గుండెల్లో ధైర్యం మొత్తం సన్నగిల్లిపోతుంది. ఇప్పటివరకు నడిచిన ఈ దారి ముసుకుపోతుంటే ఎలా ఏం చెయ్యాలని మధనపడతాం. కాని ఎందరో జీవితాలలో వారికి ఎదురైన అవరోధాలే వారిని ఓ కొత్త మార్గం వైపు మళ్ళించాయి. అలాంటి వారిలో ఒకరైన అనకపూత్తూర్ కు చెందిన శేఖర్ గురించి తెలుసుకుందామా...! చెన్నై సమీపంలో చేనేతకు పెట్టింది పేరు అనకపూత్తూర్ ఊరు. అయిదారువేలమంది నేత కార్మికులకు అన్నం పెట్టే ఆ చేనేత వృత్తి ప్రపంచీకరణ నేపథ్యంలో తన ప్రభావాన్ని కోల్పోయింది. చివరికి మెషిన్ల పోటీకి తట్టుకోలేక మగ్గాలు మూలన పడ్డాయి. నేతన్నలు కూలీలుగా మారారు. ఈ పరిస్థితులలో భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు శేఖర్ కి. ఏం చెయ్యాలో తెలియదు కానీ, ఏదో చేయాలని మాత్రం గట్టిగా అనుకున్నాడు. ఆలోచించగా ఒక్కటే తోచిందట. పోటీ పడాలి తనతో తను పోటీ పడాలి. నిన్నటి తనకంటే, ఈనాటి తను, ఈనాటి తన కంటే రేపటి తను మెరుగ్గా ఉండాలంటే వైవిధ్య ఆలోచనలు చేయాలి. ఇలా ఆలోచించగా తను నార చీరలు తయారు చేస్తేనో అనుకున్నాడు.  నార చీరలు తయారు చేయాలని నిర్ణయించుకొని మొదట్లో అరటి, జనపరాలతో చీరలు తయారు చేశాడు. వాటి నాణ్యతపై పూర్తి నమ్మకం కుదిరాక ఊళ్లోని మరి కొందరికి కూడా చెప్పి నార చీరల తయారీ మొదలు పెట్టాడు. ఒక్క చీరలే కాదు, బ్యాగులు, దిండు గలీబులు, కార్పెట్లు, డ్రెస్ మెటీరియల్స్ ఇలా ఎన్నెన్నో వెరైటీల తయారీ ప్రారంభమయ్యింది. వైవిధ్యానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుందిగా. అమ్మకాలు చెన్నై నుంచి బెంగుళూరు, ఢిల్లీలకు విస్తరించాయి. మిగతా నేతన్నలూ ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఎన్నో వేల అరటి నార చీరలు, కలబంద నార చీరలు అమ్మారు. పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వారిని కూడా ఇవి ఆకర్షించాయి. మన రాష్ట్రపతికి కూడా శేఖర్ తయారు చేసిన నార చీరలు అందాయి... నచ్చాయి కూడా. అయితే ఇంతటి విజయం సాధించిన శేఖర్.. తన విజయం గురించి ఏమంటాడంటే.... మన పని నాణ్యతగా ఉంటే ఆదరణ అదే వస్తుంది. ఏది ఎప్పటికి ఆగిపోదు. ఒకటి అగిందంటే మరొకటి ఏదో మనకోసం రెడీగా ఉందన్నమాటే. అదేంటో తెలుసుకోవడంలోనే మన విజయం దాగుంటుంది అంటాడు. చెప్పటమే కాకుండా ఒక్కొక్కటిగా ప్రయోగాలు చేస్తూ అరటి, జనపనార, ఫైనాఫిల్, కలబంద.. ఇలా వేర్వేరు నారలతో చీరలు తయారు చేస్తున్నాడు. తనతో పాటు ఎందరికో ఉపాధికల్పిస్తున్నాడు. కేవలం పాతతరం నేత పనికే పరిమితం కాకుండా ఓ కొత్త ఆలోచన చేయబట్టే అతనికి ఇంతటి విజయం దక్కింది. కాబట్టి.... దీని వల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటంటే.... ఒక దారి మూసుకుపోయిందంటే పది దారులు తెరుచుకున్నట్టే ఎదగడానికి అవకాశం దొరికినట్టే. పరిస్థితులు పగపట్టాయంటూ నిలదీస్తూ కూర్చునే కంటే వాటిని దాటేందుకు సిద్దమయితే చాలు. కాలం సలాం చేసి మరీ విజయాలను మన దరికి చేరుస్తుంది.
Publish Date: Mar 12, 2014 6:17PM

What makes Sathya Nadella ?

    Oscar Wilde — we need to believe in the impossible and remove the improbable.   What makes Sathya Nadella ?   Sathya Nadella today is the most searched man on the Internet and of course the New CEO of Microsoft who has taken over the helms of the company from Steve Ballmer. The Hyderabad Public School alumni who moved to the US more than 25 years ago has made it to the top leadership rank in Microsoft which is a matter of pride for us Indians. An interesting observation is that we are now seeing many PIOs heading major global companies and posts in the US Government. A significant change in the overall mindset of the company leadership and changing scenario in the Global culture workforce.   So what does it take to become the CEO and one of the highest paid employees in the world? Loyalty :For starters if we examine he has been with Microsoft for a long time since 1992, which shows his loyalty to the company. There might have been expectations from others to have an outsider to head the firm but Microsoft has chosen him. Understanding the current needs of the IT sector: Nadella is credited with transforming Windows Live Search into Bing, which now provides the informational backbone to a wide range of Microsoft services with a very clear understanding that computing is moving beyond the PC. In his first email to Microsoft employees as the CEO of the company he writes “The coevolution of software and new hardware form factors will intermediate and digitize—many of the things we do and experience in business, life and our world. This will be made possible by an ever-growing network of connected devices, incredible computing capacity from the cloud, insights from big data, and intelligence from machine learning. Quest for Knowledge: What defines him is his deep thirst for knowledge. Those who know him say that he is defined by his curiosity and a thirst for learning. A voracious reader who finds time and reads everything under the sun and doing unfinished online courses which include neurosciences. He fundamentally believes that if you are not learning new things, you stop doing great and useful things. Family, curiosity and hunger for knowledge all define what he is. Cricket :He loves playing cricket since his school days and  he continues to take interest in the game which he claims has defined the team building spirit and leadership capabilities in him. Innovation: Nadella claims that the industry respects innovation more than tradition and it the need of the hour is to prioritize innovation as the core value of the organization. This starts with a clarity of purpose and sense of mission that will lead us to imagine the impossible and deliver it.   Sathya Nadella  doesn’t have prior CEO experience unlike the rest of the candidates that were rumored to be in the running for the CEO role—Stephen Elop, Alan Mullally, Tony Bates, etc.— though the divisions he oversaw at Microsoft generated far more revenue than most companies could ever dream of. And he has no interest in attending public events unless it’s a business event of the company nor does he update his twitter account which would have been bombarded with congratulatory messages from all over the world! These are some of the basic qualities to be learnt in transformation leadership which one needs to imbibe if they want to move up the corporate leader and accomplish professional growth and success.    P.Charitha
Publish Date: Feb 5, 2014 1:59PM

ఖబర్ లహరియా

    పట్టుదల ఉండాలే కాని సాధ్యం కానిది ఏది వుండదు. చేయాలనీ సంకల్పించాలే కాని ఏవి ఆటంకాలు కావు. ఈ మాటలని రుజువు చేశారు కొంతమంది మహిళలు ఏంటో వెనకబడ్డ ప్రాంతం కనీస వసతులు, సౌకర్యాలు లేవు. నిరక్ష్యరాస్యత ముఖ్యంగా పురుషాధిక్యత ఎక్కువ- అలంటి ఓ జిల్లా నుంచి వచ్చిన కొంతమంది మహిళలు కలసి ఓ పత్రిక నడుపుతున్నారు అంటే నమ్మగలరా? కాని నిజం ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసే కధనాలు, వారికీ అవసరపడే సమాచారం సేకరించడం నుంచి పత్రిక డిజైన్ చేయటం,ప్రింట్ చేయటం, తిరిగి దానిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళటం దాకా అంతా పూర్తిగా మహిళల చేతుల మీదుగానే జరుగుతుంది. తమకు ఏ మాత్రం పరిచయం లేని రంగం అయినా పట్టుదలతో,ధైర్యంతో ముందుకు సాగిపోతున్నఆ మహిళలు నడిపే పత్రిక గురించి పూర్తి వివరాలు తెల్సుకుందాం.   ఉత్తర ప్రదేశ్ లోని సుమారు నమరు నాలుగొందల గ్రామాల్లోని ప్రజలకు అక్షర జ్ఞానం అందించటమే కాదు, వారిని చైతన్య వంతులని చేస్తోంది."  ఖబర్ లహరియా" ఖబర్ లహరియా అంటే బుందేలీ భాషలో " నవతరంగాలు " అని అర్ధం. ఈ ఖబర్ లహరియలో ఆరోగ్యం,విద్య, ఉద్యోగావకాశాలు, పంచాయితీ సమస్యలు- పరిష్కారం ఇలా విభిన్న అంశాలు కధనాలుగా వస్తాయి. బాల్యవివాహాలు గృహహింస, మహిళల హక్కులు, మూడనమ్మకాలు, వంటి  వాటిపై ప్రజల్లో  చైతన్యం తీసుకువచ్చే దిశగా కధనాలు రూపొందించటం వీరి ప్రత్యేకత. వార్తల సేకరణలో, కధనాలు రూపొందించడంలో ఎక్కడా రాజీవుండదు. " ఖబర్ లహరియా" లో ఓ వార్త వచ్చినా, విశ్లేషణ వచ్చినా అది ఖచ్చితంగా  నిజమని నమ్ముతారు ప్రజలు. " ఖబర్ లహరియా " లో అంతా మహిళలే ఎనిమిది సంవత్సరాల క్రితం ఎనిమిది మందితో ప్రారంభమయ్యి ఇప్పుడు పదిహేనుమంది మహిళలు దాని నిర్వహణ భాద్యతలు చూసుకుంటున్నారు,వీరంతా పెద్దగా చదువుకోలేదు పత్రికలో చేరాకా హిందీ, ఆంగ్ల భాషల్లో శిక్షణ తీసుకున్నారు. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైన వీరు పత్రిక నిర్వహణ భాగంగా గ్రామాల్లో తిరుగుతారు.విలేకరులుగా మారుమూల ప్రాంతాల్లోని వార్తలని సైతం సేకరిస్తారు. ప్రభుత్వ అధికారులతో రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేస్తారు.వీరి పనితీరు కూడా పక్కగా వుంటుంది. వరం రోజుల్లో ఓ రోజు సమావేశం అవుతారు. ఏ కధనాలు చెయ్యాలిఎవరెవరు ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటారు. ఇక రిపోర్టింగ్, ఇంటర్వ్యూలు కధనాలు ఏవైనా మూడ్రోజుల్లో సిద్దం ఆ తరువాత పేజీల రూపకల్పన ప్రింటింగ్, వాటి ప్రజలకు చేర్చటం అంతా ప్రణాళిక ప్రకారం  జరిగిపోతుంది. అసలు ఇలాంటి పత్రిక ప్రారంభించాలనే ఆలోచన ఎవరిదో తెలుసా ? ఉత్తర ప్రదేశ్ లో సుమారు నాలుగొందల గ్రామాల దాకా నిరక్షరాస్యతతో వెనకబడి వున్నాయి అక్కడ మూడనమ్మకాలు ఎక్కువే బాల్య వివాహాలు, గృహహింస వంటివి మహిళల జీవితాన్ని నరకప్రాయం  చేస్తున్నాయి. వీటన్నిటిపై పోరాటాన్ని సంధించింది డిల్లికి చెందినా ' నిరంతర్' అనే  ఓ స్వచ్చందసంస్థ. ప్రజలని చైతన్య వంతులని చేయాలనే ముందు వారిని అక్ష్యరాస్యులుగా చేయటం ముఖ్యమని గ్రహించింది.ఆ దిశగా   అడుగులు వేస్తు అక్కడి కొంతమంది మహిళలకు హిందీ,ఇంగ్లీష్లలో వార్తల  సేకరణ ముద్రణ వంటి వాటిల్లో నిపుణులతో తర్ఫీదుని ఇప్పించి ఓ పత్రిక ప్రారంభించింది ఆ పత్రిక ద్వారా చిత్రకూట్,బాందాల్లోని ఇరవై వేల విద్య,శాస్త్ర,సాంకేతిక రంగాల్లో కృషి చేసే వారికీ యునెస్కో ఏటా ఇచ్చే ' కింగ్సేజాంగ్'  అవార్డు ని గత సంవత్సరం  ఈ ఖబర్ లహరియా' స్వంతం చేసుకుంది. ఇది అచ్చం గా మహిళలు సాధించిన విజయం. ఎందుకంటే ఏంటో వెనకబడ్డ ప్రాంతం నుంచి వచ్చి అక్షరాలను  నేర్చుకుంటూనే ఓ పత్రిక నిర్వహణ చేపట్టడం మాత్రమే కాదు, రాత్రనక, పగలనక మాములు గ్రామాల్లోకి సైతం వార్తల సేకరణకూ వెళ్ళటం, ఆ కష్టనష్టాలకి ఓరుస్తూ గత ఎనిమిదేళ్ళుగా పత్రికని విజయవంతంగా నడపటం సామాన్యమైన విషయమా చెప్పండి ... విజయాలు మనల్నిఎంతో ఉత్సాహపరుస్తాయి ఏదో ధైర్యాన్ని నింపుతాయి " ఖబర్ లహరియా" వెనక వున్న మహిళల విజయం కూడా అంతే. పరిస్థితులు, విద్య, వంటివి ఏవి మనం సాధించాలనుకునే వాటికీ ఆటంకం కాదని నిరూపించిన విజయమది. ఏ చిన్నపాటి అవకాశం దొరికినా మహిళల్లో అంతర్గతంగా ఉండే శక్తితో అద్భుతాలు సృష్టించగలరాణి మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన నిజమిది .                                        ........రమ
Publish Date: Jan 29, 2014 9:10AM

ఐదేళ్ళ కుర్రాడి ‘సమయస్ఫూర్తి’

  ‘సమయస్ఫూర్తి’ అనగానే నాకు అయిదేళ్ళ రోహన్‌ గుర్తుకొస్తాడు. పదేళ్ళ కిందటి మాట.. అప్పుడు గుజరాతనలో భూకంపం వచ్చినపుడు ఈ ఐదేళ్ళ కుర్రాడు చూపించిన సమయస్ఫూర్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పట్లో పేపర్లనిండా ఆ అబ్బాయి చూపించిన దైర్యం, సమయస్ఫూర్తిల గురించిన విశేషాలే. అప్పుడు రోహన్‌ గురించి విన్నవాళ్ళు ఎవరూ ఆ అబ్బాయిని మర్చిపోలేరు. అందుకే ఇప్పటికీ పిల్లల ` సమయస్ఫూర్తి అని ఎవరైనా చెబుతుంటూ నాకు చటుక్కున రోహన్‌ గుర్తుకొస్తాడు. ఇంతకీ ఆ అబ్బాయి చూపించిన సమయస్ఫూర్తి ఏంటో తెలుసా... భూకంపంవచ్చి తన చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ పేకమేడల్లా కూలిపోతుంటే తన సంవత్సరం తమ్ముడిని రక్షించటం...   రోహన్‌ అమ్మా నాన్న ఓ రోజు ఉదయాన్నే డాక్టర్‌ని కలవటానికి బయటకి వెళ్ళారు. ఐదేళ్ళ రోహన్‌, సంవత్సరం వయసున్న అతని తమ్ముడు, 10 ఏళ్ళ పనివాడు ఇంట్లో వున్నారు. పిల్లలిద్దరూ పడుకుని ఉన్నారు. ఇంతలో ఏదో శబ్దాలు కావటంతో తెలివి వచ్చింది రోహన్ కి. భయంతో అమ్మని పిలిచాడు... పలకలేదు... ఇంతలో గదిలోని అద్దాల బీరువా అద్దాలు భళ్ళున పగిలి ఇల్లంతా పడ్డాయి. దాంతో ఏదో జరుగుతోందని అర్ధమయ్యింది రోహన్‌కి. గబ గబ లేచి... చుట్టూ చూశాడు. పక్కన తమ్ముడు పడుకుని వున్నాడు. వాడిని ఎలా ఎత్తుకోవాలో కూడా తెలిని వయసు రోహన్‌ది. అయినా వాడిని గుండెల దగ్గరగా గట్టిగా పట్టుకుని, పగిలిన అద్దం ముక్కలని తప్పించుకుంటూ ముందుకు నడిచాడు. తలుపులు, కిటికీలు కొట్టుకుంటున్నాయి. వీళ్ళు నాలుగో అంతస్తులో వున్నారు. ఆ తర్వాత ఏమయ్యిందో ఈ కార్యక్రమం తర్వాత. ఐదేళ్ళ రోహన్‌ సంవత్సరం వయస్సున తన తమ్ముడిని గుండెలకి గట్టిగా హత్తుకుని నాలుగంతస్తులు దిగాడు. దారిలో ఒక్కరు కూడా కనిపించలేదట. అంటే భూమి కంపించటం మొదలవగానే అందరూ ప్రాణ భయంతో బయటకి పరుగులు తీశారు. వీళ్ళింట్లోని పని కుర్రాడు కూడా వెళ్ళిపోయాడు. రోహన్‌కి తెలివి వచ్చాక తమ్ముడిని తీసుకుని గోడలు బీటలు వారటం, మట్టి పెళ్ళలు పడటం జరుగుతూనే వున్నాయట. అయినా కంగారు పడకుండా, తమ్ముడిని వదలకుండా కిందకి వచ్చాడు. కిందకి వచ్చి చూస్తే అందరూ అటూ, ఇటూ పరుగులు పెడుతున్నారు. ఏం చెయ్యాలో తోచలేదు కాసేపు రోహన్‌కి. ఎదురుగా కొంచెం దూరంలో రైలు పట్టాలు.. కనిపిస్తే అటు నడిచాడట రోహన్‌. వేగంగా రైలు వస్తుంటే ఆగి, అది వెళ్ళిపోయాక పట్టాలు దాటి పొలాల వైపు వెళ్ళాడట. ఇంతలో గుక్కలు పెట్టి అతని తమ్ముడు ఒకటే ఏడుపుట. పొలాల గట్టు పక్కన ఓ చెట్టు కనిపిస్తే అక్కడ ఆ చెట్టు నీడలో తమ్ముడిని కిందకి దించి తనూ కూర్చున్నాడు. ఏడుస్తున్న తమ్ముడిని అవి, ఇవి చూచించి ఏడుపు మానిపించాలని చూస్తుండగా, అతని అమ్మా నాన్న వెతుకుంటూ వచ్చారట. హాస్పటల్‌లో వుండగా భూకంపం వస్తోందని తెలియగానే పిల్ల కోసం పరిగెట్టుకుంటూ వచ్చారు రోహన్‌ తల్లితండ్రులు. వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ అపార్టుమంటు కూలిపోయి వుంది. పిల్లల కోసం పిచ్చివాళ్ళలా ఆ శిధిలాల్లో వెతికారు. ఇంతలో ఎవరో ఇద్దరు చిన్న పిల్లలు రైలు పట్టాలవైపు వెళ్ళారని చెబితే.. ఆవైపు వచ్చారు రోహన్‌ అమ్మానాన్న. రోహన్‌ తమ్ముడిని తీసుకుని కిందకి రావటం కొంచం ఆలస్యమయి వుంటే? తమ్ముడిని ఎత్తుకోలేనని వదిలేసి ఒక్కడే కిందకి వస్తే? భయంతో ఇంట్లోనే వుండిపోతే? ఇవన్నీ ప్రశ్నలే. అయితే ఏదో ఆపద వస్తోంది... ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోదాం అనుకున్న రోహన్‌ బయం సంగతి మర్చిపోయి తమ్ముడిని మోసుకుంటూ బయలుదేరాడు. నీకు భయం వేయలేదా అని ఆ తర్వాత అందరూ అడిగారు. దానికి రోహన్‌ ఏం చెప్పాడో తెలుసా.. ఏమో.. తమ్ముడు ఏడుస్తున్నాడు.. ఇక్కడ ఏదో జరుగుతోంది.. అందుకని దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా, అమ్మానాన్న వచ్చేదాక తమ్ముడి ఏడుపు ఏలా ఆపాలా అనే ఆలోచించా కాని.. నాకింకేం తెలీలేదు అన్నాడు.  ఇప్పుడు చెప్పండి.. రోహన్‌ గురించి విన్న వారెవరైనా, ఎన్నిసంవత్సరాలైనా ఆ అబ్బాయిని మర్చిపోగలరా? రోహన్‌ గురించి పిల్లలకి చెప్పండి... ఇలాంటి  సంఘటనలు పిల్లల్ని ఆలోచింప చేస్తాయి. ....రమ
Publish Date: Jan 2, 2014 11:08AM