వివేకా హత్య కేసులో కీలక అరెస్ట్! ఇద్దరు ప్రముఖులెవరో తేలిపోనుందా? 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పురోగతి సాధించింది సీబీఐ. గత రెండు నెలలుగా ముమ్మరంగా విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు... ఈ కేసులో  కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గోవాలో ఉండగా సునీల్ ను నిర్బంధించినట్లు తెలిసింది. సునీల్ ను విచారిస్తే కేసులో కీలక విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వివేకా హత్య కేసులో ఇద్దరి ప్రముఖుల హస్తం ఉందని ప్రచారం జరుగుతుండటంతో... ఆ ఇద్దరు ఎవరన్నది తేలిపోతుందని భావిస్తున్నారు. 

వివేకానందరెడ్డి వాచ్‌మన్‌ రంగయ్యను ఇటీవల జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం తీసుకుంది సీబీఐ. వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌ పాత్ర ఉందని రంగయ్య చెప్పడం కలకలం రేపింది. అంతేకాదు వివేకా హత్యలో 8 కోట్ల సుపారీ డీల్ జరిగిందని కూడా రంగయ్య చెప్పారని తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ప్రముఖల హస్తం ఖచ్చితంగా ఉండి ఉంటుందనే భావనకు సీబీఐ అధికారులు వచ్చారని అంటున్నారు.

వివేకా హత్య కేసులో సునీల్‌తో పాటు ఆయన తమ్ముడు కిరణ్‌యాదవ్‌, తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్‌లను సీబీఐ గతంలో విచారించింది. అయితే విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని సునీల్‌ హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం పులివెందులలో తమ నివాసానికి తాళం వేసి ఆయన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సునీల్‌ కోసం కడప, అనంతపురం జిల్లాల్లో సీబీఐ గాలిస్తోంది. ఆయన సమీప బంధువొకరిని ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. సునీల్‌ గోవాలో ఉన్నట్లు తెలియడంతో సీబీఐ బృందం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

వివేకా డ్రైవర్‌ దస్తగిరిని సీబీఐ బృందం సోమవారం పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విచారించింది. గంటన్నరకు పైగా ప్రశ్నించినట్లు తెలిసింది. సాయం త్రం మరో బృందం వివేకా ఇంటి పరిసరాల్లో పరిశీలించింది. సమీపంలోని ఆటో మొబైల్‌ దుకాణాల వరకు కొలతలు తీసుకుని రికార్డు చేసినట్లు తెలుస్తోంది.  వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవటంతో పాటు.. త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రముఖుల హస్తం ఉందని తేలిపే మాత్రం సంచలనాలు జరగవచ్చు.