జగన్ , కేసీఆర్ కు షాక్... షర్మిల హల్ చల్ 

ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది. కొలువు దీక్ష తర్వాత ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన వైఎస్ షర్మిల పాదయాత్ర భగ్నమైంది. ఇందిరా పార్క్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు యత్నించారు. దీంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై షర్మిల మద్దతుదారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. తోపులాటలో షర్మిల సృహ తప్పి పడిపోయారు. షర్మిల తేరుకున్నాక ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.     

పోలీస్ స్టేషన్ నుంచి లోటస్ పాండ్ తీసుకెళ్లి షర్మిలను తన నివాసం దగ్గర వదిలిపెట్టారు పోలీసులు. దీంతో తన నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ పై మరోసారి విరుచుకుప్డడారు. ఏదో ఒకరోజు తెలంగాణకు CM అవుతానన్నారు షర్మిల. కార్యకర్తలను వదిలేవరకు మంచినీళ్లు కూడా ముట్టనన్నారు. ఇంకోసారి తన మీద చెయ్యి పడితే ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు.

అంతకుముందు ఇందిరా పార్క్ దగ్గరలోని ధర్నాచౌక్‌లో ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షలో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. అడ్డుగా ఉన్న కెమేరాలను తొలగించమంటూ మీడియాకు సూచించిన షర్మిల... అక్కడే ఉన్న సాక్షి ఛానెల్‌కు చురకలు వేశారు. ‘‘కవరేజ్ చేసింది చాల్లేమా... ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ సెటైర్ వేశారు. ఆమె పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఒక్కసారిగా బిత్తరపోయారు. వెంటనే తేరుకుని.. షర్మిలను మెల్లగా చేత్తో తట్టారు. అయినా ఏమాత్రం తగ్గకుండా సాక్షి మీడియాను తనదైన శైలిలో షర్మిల ట్రీట్ చేశారు. తన సోదరుడి ఛానెల్ ను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.