సాక్షి మీడియాపై షర్మిల చిందులు..

తెలంగాణలో ఉద్యోగల భర్తీ కోసం ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నాచౌక్‌లో షర్మిల దీక్షకు కూర్చున్నారు. దీక్షా సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు ఎదురుగా, అడ్డుగా ఉన్న కెమెరాలను పక్కకు జరపమంటూ మీడియాకు షర్మిల సూచించారు. ఆ సందర్భంగా అక్కడే ఉన్న.. తన అన్న జగన్‌కు చెందిన సాక్షి ఛానెల్‌పై సెటైర్లు వేశారు షర్మిల.

‘‘కవరేజ్ చేసింది చాల్లేమా.. ఎలాగో సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు షర్మిల. ఇంకా ఏదో అనబోతుండగా.. పక్కనే ఉన్న తల్లి వైఎస్ విజయలక్ష్మి ఆమెను వారించారు. వద్దు, ఇక చాలంటూ షర్మిలను చేత్తో తట్టారు. అయినా.. షర్మిల ఊరుకోలేదు. నవ్వుతూనే.. చేతులతో సైగలు చేస్తూ.. తనకు అడ్డుగా ఉన్న సాక్షి కెమెరాలను పక్కకు తరలించే వరకూ వదల్లేదు. ఈ ఘటనపై అక్కడ ఉన్నవారంతా ఆసక్తిగా చర్చించుకున్నారు. జగన్ వేరు.. తాను వేరు.. షర్మిల జగనన్న సంధించిన బాణం కాదనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాలనే.. కావాలనే ఇలా చేసుంటారని కొందరు అంటున్నారు. కారణమేదైనా.. జగన్‌కు చెందిన సాక్షి మీడియాపై ఆయన చెల్లెలు షర్మిలనే చిందులేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.