జగన్ పై ధ్వజమెత్తిన చంద్రబాబు
posted on Apr 24, 2011 9:44AM
హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కడప ఉప ఎన్నికల్లో కోట్లాది రూపాయలను జగన్ కుమ్మరిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ఐదేళ్లలో జగన్‌కు ఇన్ని కోట్లు, ఇన్ని ఇళ్లు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. తండ్రి వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆయన అన్నారు. రాజకీయ నేతల తలలకు వెల కట్టి వైయస్ జగన్ డబ్బులు చెల్లిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించి గెలవడానికి జగన్ సిద్ధపడ్డారని ఆయన అన్నారు. కడప ఉప ఎన్నికలు నీతికి, అవినీతి మధ్య జరుగుతున్నవని ఆయన అన్నారు. తమ అవినీతి వ్యతిరేక పోరాటాన్ని కడప నుంచే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలని వైయస్ జగన్ కలలో కూడా కలవరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని మార్చేస్తానని జగన్ అంటున్నారని, లక్ష కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించిన జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చేస్తారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. కడపలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఠాకక్షలను పెంచి పోషించారని ఆయన ఆరోపించారు.