నిజమైన వేదాంతం

అనగనగా ఓ ఎనభై ఏళ్ల పండితుడు. తనకు తెలియని శాస్త్రం లేదని ఆయన అహంకారం. వేదాంతానికి సంబంధించిన ఏ అంశం మీదైనా అలవోకగా, అనర్గళంగా మాట్లాడగలనని ఆయన నమ్మకం. అందుకనే ఆ పండితుడంటే జనం భయపడేవారు. ఆయనను మించిన వేదాంతి లేడని ముక్తకంఠంతో ఒప్పుకొనేవారు.

 

ఇలా ఉండగా దగ్గర్లోని ఓ గ్రామంలో ఓ యువ పండితుడు నివసిస్తున్నాడన్న వార్త బయల్దేరింది. ఆ యువ పండితుడి దగ్గర ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందట. ఆయనతో మాట్లాడితే చాలు, మనసులో ప్రశాంతత ఆవహిస్తుందట. ఈ కబుర్లన్నీ విన్న ఎనభై ఏళ్ల పండితుడిని అసూయ మొదలైంది. ఈ ప్రపంచంలో నన్ను మించిన వేదాంతి ఎవరో తేల్చుకోవాలన్న తపన పుట్టింది. ఆ యువ పండితుడిని కలిసి, అతగాడిని వేదాంత చర్చలలో ముంచి, ఓడించి, తల దించుకునేలా చేయాలన్న కసి మొదలైంది.

 

వెంటనే ఆ యువ పండితుడి దగ్గరకి బయల్దేరాడు వృద్ధ వేదాంతి. అవడానికి అది సమీపంలోని గ్రామమే! కానీ వృద్ధుడు కావడంతో ఆయన అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కష్టమైపోయింది. పడుతూ, పాకుతూ ఎలాగొలా యువపండితుడు ఉండే గ్రామానికి చేరుకున్నాడు వృద్ధుడు. అక్కడ అతని ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. కానీ ఆ ఇంట్లోకి అడుగుపెడుతూనే తనకి ఎదురుగా కనిపించిన యువకుడిని చూసి తెగ ఆశ్చర్యపోయాడు. వేదాంతి అనగానే పట్టుపీతాంబరాలు ధరించి, గండపెండేరాలు తొడుక్కొని... శిష్యగణ సేవల మధ్య దర్పంగా ఉంటాడని భావించాడు. కానీ ఆ యువకుడు మాత్రం నిరాడంబరంగా ఉన్నాడు. ధ్యానంలో నిమగ్నమైపోయి ఉన్నాడు.

 

‘నువ్వు గొప్ప పండితుడివని విని ఇక్కడకు వచ్చాను. నన్ను మించిన పండితుడివేమో తేల్చుకోవడానికి వచ్చాను. ఏదీ నీకు తెలిసిన జ్ఞాన రహస్యాలని చెప్పు చూద్దాం. ఎన్ని గంటలసేపైనా నేను ఓపికగా నీ మాటలు వింటాను,’ అన్నాడు వృద్ధ వేదాంతి.

 

వృద్ధ వేదాంతి మాటలకు చిరునవ్వు నవ్వుతూ ‘నాకు తెలిసిన విషయం మూడే మూడు ముక్కల్లో చెబుతాను. తెలిసితెలిసీ ఇతరులకి చెడు చేయకూడదు; వీలైతే మనకు తోచిన మంచి చేయాలి; అహంకారాన్ని వీడి నిష్కర్షగా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి,’ అంటూ చెప్పుకొచ్చాడు యువ వేదాంతి.

 

‘నీ మొహం! ఇంతేనా నీకు తెల్సిన వేదాంతం. ఈ మూడు ముక్కల్ని వినడం కోసమేనా నేను ఇంత శ్రమించి ఇక్కడకు వచ్చింది? ఈ మాత్రం మూడు ముక్కలు మూడేళ్ల పిల్లవాడైనా చెప్పగల్గుతాడు,’ అంటూ ఎద్దేవా చేశాడు వృద్ధుడు.

 

యువకుడు ఆ మాటలకు నొచ్చుకోలేదు సరికదా, చెక్కుచెదరని స్థిరత్వంతో... ’నిజమే! ఈ మాత్రం విషయాన్ని మూడేళ్ల పిల్లవాడు కూడా చెప్పగలడు. కానీ దాన్ని ఆచరించకుడానే మనం జీవితాలని గడిపేస్తూ ఉంటాము. ఎనభై ఏళ్లు వచ్చిన మీరు ఓసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మూడేళ్ల వయసులో మీరు విన్న ఈ మూడు ముక్కలనీ మీ జీవితంలో ఏమేరకు ఆచరించారో గుర్తుచేసుకోండి. ఆపాటి ఆచరణ లేకుండా మీరు ఆర్జించిన జ్ఞానమంతా వృధా అని నా నమ్మకం,’ అంటూ ధ్యానంలో నిమగ్నమైపోయాడు.

 

యువకుడి మాటలకు వృద్ధ పండితుని వద్ద జవాబే లేకుండా పోయింది. నిదానంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. అతని మనసులో ఏదో తెలియన అసంతృప్తి మొదలైంది. తన జీవితమంతా వృధా అయిపోయినట్లేనా!

 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.