టీడీపీ మహిళా నేత ఇంటికి నిప్పు.. అర్ధరాత్రి వైసీపీ నేతల అరాచకం 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తమ అక్రమాలను ప్రశ్నించిన వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. బరి తెగించి దాడులకు పాల్పడుతున్నారు. ప్రతి పక్ష టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తల వీరంగం స్పష్టించారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో వికృత చేష్టలతో రెచ్చిపోయారు. తప్పతాగి అరాచకం సృష్టించారు. అర్ధరాత్రి టీడీపీ నేత ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటిపె పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో జరిగిన వైసీపీ నేతల దౌర్జన్యకాండ తీవ్ర కలకలం రేపుతోంది. 

సోమవారం రాత్రి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైసీపీ వర్గీయులు వినాయక విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిన శారద ఇంటి ముందుకు రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఆమె ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించి సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం ఇంట్లోని వస్తువులతోపాటు ఆరు బైకులపై పెట్రోలు పోసి నిప్పంటించారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులూ వారి ఆగడాలను అడ్డుకోలేదు. దీంతో మాజీ జడ్పీటీసీతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలూ ప్రాణ భయంతో తమ ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. 

పరిస్థితి అదుపు తప్పుతోందని, వెంటనే అదనపు బలగాలను పంపించాలని స్థానిక పోలీసులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. స్వయంగా హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు  ‘ఆచితూచి’ స్పందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక డీఎస్పీ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు గ్రామానికి తరలివచ్చారు. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ ఇంటిపై దాడికి దిగారని  ఆవేదన వ్యక్తం చేశారు.  

తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోనూ వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. గ్రామంలో వైసీపీ వర్గీయులు పెట్టిన గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనం చేయటానికి సోమవారం రాత్రి  డీజేతో ఊరేగింపుగా బయలుదేరారు. గ్రామ బొడ్రాయి సెంటర్‌ వద్ద మహిళలు నిల్చొని ఊరేగింపును తిలకిస్తున్నారు. ఊరేగింపులోని ఓ వ్యక్తి తనపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేయగా, తోటి మహిళలు, టీడీపీ శ్రేణులు ఊరేగింపును అడ్డుకున్నారు. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో రాళ్లు, సీసాలు రువ్వుకున్నారు. నిమజ్జనానికి బందోబస్తు నిమిత్తం వచ్చిన తాడికొండ ఎస్‌ఐ వెంకటాద్రి ఇరువర్గాలను నియంత్రించడానికి ప్రయత్నించగా, ఆయన తలకు ఓ రాయి తగిలి రక్తస్రావమైంది.