టీడీపీకి ఓటు వేయలేదని దాడి! కృష్ణా జిల్లాలో వైసీపీ అరాచకం 

పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీలు మాత్రం కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో తమకు మద్దతు తెలపలేదని, ఓటు వేయలేదంటూ దాడులకు పాల్పడుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు.  కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వేల్పూరు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు, అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ అభ్యర్ధి సర్పంచ్‌గా గెలిచినందుకు అతని అన్నయ్య రత్నం సురేష్‌ బాబు అనే వ్యక్తిపై  దాడి చేశారు. ఈ దాడిలో రత్నం సురేష్ బాబు తీవ్రంగా గాయపడ్డారు. 

ఉంగరాల హరీష్‌, ఉంగరాల రామకృష్ణ, గుడివాడ రాజారవీంద్ర వరప్రసాద్‌ అనే ముగ్గురు వైసీపీ కార్యకర్తలు ఫుల్‌గా మద్యం సేవించి టీడీపీ కార్యకర్త రత్నం సురేష్‌ బాబుపై దాడి చేశారు. పడుకున్న వ్యక్తిని లేపి బయటకు పిలిచి మరీ... వైసీపీ వారికి ఓటు వేయకుండా టీడీపీని గెలిపిస్తావా అంటూ చావబాదారు. బాధితుడి కాళ్లు విరగ్గొట్టి రోడ్డున పడేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. ఇంత వరకు కేసును దర్యాప్తు చేయకపోవడంతో పాటు...బాధితుడి వద్దకు కూడా పోలీసులు రాని పరిస్థితి నెలకొంది.  వైసీపీ కార్యకర్త ఉంగరాల హరీష్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఉద్యోగి అయ్యి ఉండి తాగి అర్ధరాత్రి వచ్చి టీడీపీ కార్యకర్తని చావగొట్టిన వైనం కలకలం రేపుతోంది.