న‌డిమంత్ర‌పు మురిపం.. ముందుంది అస‌లు భ‌విత‌వ్యం..

ఏలూరు సైతం వైసీపీ ఖాతాలోనే. ఒక్క‌ కార్పొరేష‌నే అయినా స‌జ్జ‌ల మీడియా ముందు విజ‌య‌గ‌ర్వం ప్ర‌ద‌ర్శించారు. ఇక అంతా త‌మ‌దే రాజ్య‌మంటూ బీరాలు పోయారు. జ‌డ్పీటీసీ, ఎమ్‌పీటీసీ ఎన్నిక‌ల్లోనూ త‌మ‌దే గెలుపంటూ గొప్ప‌లు చెప్పుకున్నారు. అంతా బాగానే ఉంది. ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ నిజాలే కావొచ్చు. తాజా ఫ‌లితాల్లో ఆమాత్రం ఉత్సాహం ఉండ‌కుండా ఉండ‌దు. అయితే.. ఇదే శాశ్వ‌తం అనుకొని వీర్ర‌వీగొద్ద‌నేది టీడీపీ ఇస్తున్న ఉచిత స‌ల‌హా. రాజ‌కీయం రంగుల‌రాట్నంలా గిర్రున తిరుగుతుంద‌ని.. ఇప్పుడు ఆకాశాన ఉన్న‌వాళ్లు అధఃపాతాళానికి ప‌డిపోక త‌ప్ప‌ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌త చ‌రిత్ర‌ను ఓసారి గుర్తు చేస్తున్నారు..

ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఏ ఎన్నిక జ‌రిగినా వైసీపీదే విజ‌యం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, ప‌లు కార్పొరేష‌న్లు, తిరుప‌తి బైపోల్‌.. ఇలా ఎల‌క్ష‌న్ ఏదైనా ఫ్యాను గాలి జోరుగా వీస్తోంది. అది ఎలా వీస్తోంది? న‌యానా? భ‌యానా? అనేది వేరే విష‌యం. అధికారంలో ఉన్న పార్టీకి అనేక అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ ఫ్లోలో అలా కొట్టుకొస్తారంతే. ఆ రిజ‌ల్ట్స్ చూసి అంతా ప్ర‌భుత్వానికే అనుకూలం అని అనుకునేందుకు లేదు. ప‌వ‌ర్‌లోకొచ్చి రెండేళ్లే అవుతోంది. ఆఫ్ట‌ర్ ఎఫెక్ట్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఉద్యోగుల‌కు వేళ‌కు జీతాలు రాని దుస్థితి మొద‌లైంది. ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండ‌ర్‌పై నిరుద్యోగులు ఆగ్ర‌హంతో ఉద్య‌మిస్తున్నారు. ఇసుక కొర‌త‌, చెత్త ప‌న్ను, ధ‌ర‌ల పెరుగుద‌ల‌, మ‌ద్యం దోపిడీ.. ఇలా ఏపీలో అంతా దోపిడీ రాజ్య‌మే కొన‌సాగుతోంది. సంక్షేమ ప‌థ‌కాల మాటున ఆ టైమ్ బాంబ్ పేల‌డం ఆల‌స్యం అవుతోంది అంతే.. అని అంటున్నారు. 

అధికార పార్టీకి ఇంకా హ‌నీమూన్ పీరియ‌డ్ కంటిన్యూ అవుతోంద‌ని.. ఇంట‌ర్వెట్ బ్యాంగ్ అదిరినా.. సెకండ్ ఆఫ్ ర‌చ్చ రంబోలా కావ‌డం ఖాయ‌మంటున్నారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ఉప ఎన్నిక‌ల‌న్నీ ఈజీగా గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆ త‌ర్వాత సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి బొక్కబోర్లా ప‌డింద‌ని గుర్తు చేస్తున్నారు. వైసీపీకీ ముందుముందు అలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

ఉప ఎన్నిక‌ల‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అస‌లే మాత్రం పోలిక ఉండ‌ద‌నే సూత్రం వైసీపీకీ తెలియంది కాదు. అయినా, కావాల‌నే అంత‌గా బిల్డ‌ప్ కొడుతోంద‌ని అంటున్నారు. గ‌తంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నికను ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి మ‌రణంతో జరిగిన నంద్యాల బైపోల్‌లో టీడీపీ-వైసీపీ మ‌ధ్య నువ్వా-నేనా అన్న‌ట్టు పోరు సాగింది. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కూ గెలిచేది ఎవ‌రోన‌నే ఉత్కంఠ నెల‌కొంది. తీరా, రిజ‌ల్ట్స్ చూస్తే.. మొత్తం వ‌న్‌సైడ్‌. టీడీపీకి ఓట‌ర్లు ఘ‌న విజ‌యం అందించారు. తిరుగులేని ఆధిక్యంతో గెలిపించారు. క‌ట్ చేస్తే.. రెండేళ్ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నంద్యాల కాదుక‌దా క‌ర్నూలు జిల్లాలోనే ఖాతా తెర‌వ‌లేక‌పోయింది టీడీపీ. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ హ‌వా కూడా అలానే ఉంద‌ని.. అందుకే ఉప ఎన్నిక‌లు, స్థానిక సంగ్రామంలో అధికార పార్టీకే విజ‌యం ద‌క్కుతోంద‌ని.. కానీ, సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి సీన్ మారిపోతుంద‌ని అంటున్నారు. ఇది జ‌స్ట్ ఇంట‌ర్వెల్ మాత్ర‌మేన‌ని.. క్లైమాక్స్ రివ‌ర్స్ అవుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి, అధికార గ‌ర్వంతో ఉన్న వైసీపీ పెద్ద‌ల‌కు ఇలాంటి హిత‌బోధ చెవికెక్కుతుందా? ఎగిరెగిరి ప‌డ‌కుండా సంయ‌మ‌నంతో ఉంటారా?