తాడేపల్లి ప్యాలెస్ కు ఇక టూలెట్ బోర్డే.. అచ్చం నాయకుడు సెటైర్లు

తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెంనాయుడు వైసీపీపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. భవిష్యత్ ఆ పార్టీ నేతల కళ్ల ముందు కనిపిస్తుండటంతో వణికి పోతున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ( ఆగస్టు 9) విలేకరులతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తిన వెళితేనే వైసీసీ నేతలు వణికిపోతున్నారని, భయంతో వారికి చెమటలు పట్టేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆజాదీ కా అమృతోత్సవ్ కమిటీ సమావేశానికి వెళ్లిన చంద్రబాబుతో మోడీ కొద్దిసేపు ముచ్చటించినందుకే వైసీపీ అగ్రనాయకత్వం కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లు భయపడిపోతున్నారెందుకని ప్రశ్నించారు.

వైసీపీ భయం, వణుకు చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ త్వరలో ఖాళీ అయిపోవడం ఖాయమని పిస్తోందని, ఇక టూలెట్ బోర్డు రెడీ చేసుకోవడమే తరువాయి అని అనిపిస్తోందని సెటైర్లు వేశారు. ప్రస్తుతం వైసీపీలో తడబాటును, వణుకును, భయాన్నీ చూస్తుంటే ఆ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అవగతమౌతోందన్నారు. వైసీపీకి అప్పులు చేయడం, విమర్శకులపై అక్రమ కేసులు బనాయించడం, అసభ్యంగా అడ్డంగా దొరికిపోయిన తమ పార్టీ వారిని కాపాడుకోవడం ఎలా అన్న అంశాలపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.

చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ లా అక్రమ కేసుల మాఫీ కోసం హస్తిన పర్యటనకు వెళ్లలేదనీ, కేంద్రం బాబు విజన్ ను గుర్తించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానిస్తేనే వెళ్లారనీ, అక్కడ మోడీతో ఆయన తనంత తానుగా భేటీ కాలేదనీ, ప్రధానే స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించి మరీ ప్రత్యేకంగా సమావేశమయ్యారనీ గుర్తు చేశారు.

ఒక నాయకుడిగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపు అది అని అచ్చెన్నాయుడు చెప్పారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా దూరద్రుష్టితో చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాన్ని చేపడితే.. అహంకారం, అజ్ణానంతో దానికి నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ కాదా అని ప్రశ్నించారు. తన అజ్ణానంతో అమరావతిని నిర్వీర్యం చేసి ఇప్పుడు కోర్టులు మొట్టికాయలు వేస్తుంటే.. ఏం చేయాలో తెలియక రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి మరింత అభాసుపాలయ్యారని విమర్శించారు.  దేశభక్తికి సంబంధించిన అంశాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించిన అచ్చెన్న.. జనం వైసీపీని తరిమికొట్టే రోజెంతో దూరంలో లేదన్నారు.