దళిత ట్రైనీ మ‌హిళా SIపై లైంగిక దాడి?  తెలంగాణలో దారుణం..

దళిత బంధు పథకం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి చేస్తున్నారు. దళితల దశ మార్చుతానని చెబుతున్నారు. సీఎం ప్రకటనలు అలా ఉండగానే దళితులపై తెలంగాణ రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు ఏకంగా దళిత ఎస్ఐకి రక్షణ లేకుండా పోయిన ఘటన వెలుగుచూడటం కలకలం రేపుతోంది. తనపై అత్యాచరం జరిగిందంటూ ఓ దళిత ట్రైనీ ఎస్ఐ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 

వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలోని ఓ స్టేష‌న్‌లో సోమ‌వారం రాత్రి ఈ దారుణం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి.. అదే స్టేషన్ లో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దళిత యువతిపై లైగింక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమ‌వారం రాత్రి ఆక‌స్మిక త‌నిఖీ పేరుతో మ‌హిళా ట్రెయినీ ఎస్ఐని ఒంట‌రిగా వాహ‌నంలో తీసుకెళ్లిన ఎస్‌హెచ్‌వో ఆమెపై విచ‌క్షణ ర‌హితంగా లైంగిక దాడికి య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగోలా అధికారి చెర నుంచి త‌ప్పించుకున్న మ‌హిళా అధికారి మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్‌ త‌రుణ్ జోషికి ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

అయితే బాధిత యువతి రాత పూర్వకంగా కాకుండా ఓరాల్‌గా సీపీకి ఫిర్యాదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌త కొద్దిరోజులుగా ట్రెయినీ ఎస్ఐని వాట్సాప్‌, ఫోన్ కాల్ ద్వారా కూడా వేధించాడ‌ని, తాజాగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.  వ‌రంగ‌ల్ సీపీ ప‌రిధిలో పోస్టింగ్ తీసుకున్న స‌ద‌రు మ‌హిళా అధికారిని.. ఎస్‌హెచ్‌వోలున్న స్టేష‌న్‌లో నెల రోజులు ప్రొహిబిష‌న్ పీరియ‌డ్‌ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని క‌మిష‌నరేట్ ప‌రిధిలో లేని స్టేష‌న్‌లో ప్రొహిబిష‌న్ ఎస్ఐగా ఆమె కొన‌సాగుతున్నారు. ఈ క్రమంలోనే అధికారిణిపై క‌న్నేసిన ఎస్‌హెచ్‌వో సోమ‌వారం రాత్రి లైంగిక దాడికి య‌త్నించిన‌ట్లుగా తెలుస్తోంది.