మగువల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. ఆరోగ్యకరమైన బరువే..!
posted on Jan 17, 2025 9:40AM

ఆరోమగువలగ్యానికి శ్రీరామ రక్ష.. ఆరోగ్యకరమైన బరువే..!ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పటి మహిళల ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా చాలా దారుణ స్థితికి దిగజారింది. ముఖ్యంగా చాలామంది మహిళలు అధిక బరువు సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల మార్పుల కారణంగా, ఒత్తిడి కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.. మహిళలు సరైన బరువు ఉంటే ఈ సమస్యలు అసలు ఉండనే ఉండవనీ.. దీని గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో మహిళల ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి కూడా ఒక ప్రత్యేక రోజును జరుపుకోవడం మొదలుపెట్టారు. ప్రతి ఏడాది జనవరి నెలలో మూడవ గురువారాన్ని మహిళల ఆరోగ్యకరమైన బరువు దినోవత్సంగా కేటాయించారు. ఇది అంత పరిచయమైన దినోత్సవం కాకపోయినా మహిళల కోణంలోనూ, మహిళల ఆరోగ్య పరంగా గమనిస్తే ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగినదే..
ఎవరిని అయినా మొదట చూడగానే వారి శారీరక రూపాన్నే చూస్తాం. లావుగా ఉంటే అబ్బో ఎంత లావో అని.. సన్నగా ఉంటే బక్కగా ఉన్నారని అంటుంటాం. అయితే కొందరు లావు ఉన్నా ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. మరికొందరు సన్నగా ఉన్నా చాలా ఇబ్బందికరంగా, అనారోగ్యంగా, ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ లావుగా ఉంటే అదేదో రోగమున్నట్టు, సన్నగా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు భావిస్తారు కొందరు. కానీ ఆరోగ్యంగా ఉండటం అనేది కేవలం బరువు ద్వారా నిర్ణయించడం జరగదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది ఆరోగ్యకరమైన బరువును నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణం. ఇటీవల, ఆరోగ్యకరమైన బరువును కొలవడానికి కొత్త ప్రమాణాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇవి BMI కంటే మరింత ఖచ్చితమైనవిగా ఉంటాయట. చాలా మంది మహిళలు సరైన బరువుకు రావడానికి చాలా కష్టపడతారు. అధిక బరువు ఉన్నవారు అయితే బరువు తగ్గడం కోసం కడుపు మాడ్చుకుంటారు. సన్నగా ఉన్నవారు సరైన బరువుకు చేరడానికి అనారోగ్యకరమైన తిండి కూడా తింటారు. ఈ కారణాల వల్ల చాలా మంది ప్రాణాంతక సమస్యలలోకి జారుకుంటారు. మరికొందరు మహిళలు బరువు మీద దృష్టి పెట్టరు. అందుకే కనీసం ఈ రోజు అయినా మహిళలు తమ బరువు విషయంలో ఆలోచించి సరైన బరువును చేరుకోవడానికి ప్రణాళికలు వేసుకుని ప్రయత్నాలు చేసి లక్ష్యాలు చేరుకోవాలి.
బరువు చేరుకోవడానికి ఏం చేయాలి?
సరైన బరువు చేరుకోవడానికి డైట్ మెయింటైన్ చేయాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారం తీసుకోవాలి. వేపుళ్లు, నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ మొదలైనవి అవాయిడ్ చేయాలి. సమతుల్య ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించాలి. పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు బాగా వినియోగించాలి.
ఆహారం తీసుకోవడానికి తగినట్టు శారీరకంగా చురుగ్గా ఉండాలి. రోజూ వ్యాయామం, నడక, యోగా, సైక్లింగ్ వంటివి ఏవో ఒకటి ఫాలో అవుతూ ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రతిరోజూ ధ్యానం చేయాలి. ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఆహారం, వ్యాయామం, ధ్యానం విషయాలలో ఎప్పుడూ ఏమాత్రం రాజీ పడకూడదు.
* రూపశ్రీ.