రాజుగారి ఇంటి ముందు రోడ్డు తవ్వేశారు.. అందుకేనా?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన సొంత నియోజకవర్గ పరిధిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరౌతారా? ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ లతో ఒకే వేదిక పంచుకుంటారా? ఆయన వద్దామనుకున్నా.. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా చేయాలన్న జగన్ సర్కార్ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఓ కేంద్ర మంత్రి రాఘురామకృష్ణం రాజును ఏపీకి వెళ్లొద్దని సూచించిన మాట నిజమేనా? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే.

సీఎం జగన్ పై తిరుగుబావుటా ఎగురవేసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేధింపులను ఎదుర్కొంటున్న రఘురామ కృష్ణం రాజును గతంలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి భౌతికంగా హింసించిన సంగతి విదితమే. ఇప్పుడు ఆయన ఏపీ వస్తే అరెస్టు చేయించి తమ ప్రతాపం చూపాలన్న ప్రభుత్వ ప్రణాళికలకు హైకోర్టు తీర్పు గండి కొట్టింది.  దీంతో ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భీమవరంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రఘురామకృష్ణం రాజు రావడానికి లైన్ క్లియర్ అయ్యిందనే అంతా భావించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ప్రొటో కాల్ ప్రకారం స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజు రావాల్సి ఉంటుంది. రఘురామకృష్ణం రాజు కూడా ఈ సభకు ఎలాగైనా రావాలన్న పట్టుదలనే ప్రదర్శిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొంటారు.ఇక్కడే రఘురామ కృష్ణం రాజును ఈ కార్యక్రమానికి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. జగన్ కు రఘురామకృష్ణం రాజుతో వేదిక పంచుకోవడం ఇష్టం ఉండదు. రఘురామకృష్ణం రాజు సభకు వస్తే జగన్ ఏం చేస్తారు. కార్యక్రమానికి గైర్హాజరు అవుతారా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి.

ప్రధాని మోడీ హాజరుకానున్న అల్లూరి విగ్రహావిష్కరణకు తాను హాజరుకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేసే కుట్రలు చేస్తోందంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు, గత వారం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రధాన మంత్రి కార్యాలయం తోపాటు, కేంద్ర హోమ్ , పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శులకు లేఖలు కూడా రాశారు. అక్కడ నుండి తగిన స్పందన లేకపోవడంతో,  హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురాం కృష్ణంరాజు ను అరెస్టు చేయవద్దని ..అవసరమైతే కేసులు పెట్టుకోవచ్చు తప్ప, అప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది . ఈ పరిణామాలతో ఎంపీ రాజు భీమవరం టూర్ కు , రూట్ క్లియర్ అయింది.

కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు ప్రభుత్వం ఆదేశాలతో తవ్వేశారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపించింది. ఎంపీ ని వేధించడానికే రోడ్డు తవ్వేశారన్న ప్రచారం జరిగింది. దానితో స్పందించిన రఘురామ కృష్ణంరాజు.. రోడ్డు ఫోటోలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దానితో ఆగమేఘాలపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం, వెంటనే దానిని సీఎంవో కు పంపటం.. ఆ తరువాత రోడ్డును క్లియర్ చేయడం ..చక చకా జరిగిపోయాయి. దీన్నిబట్టి కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ రఘురామకృష్ణం రాజును మోడీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తోందని అవగతమౌతోంది.  

 ఇలా ఉండగా   ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు రాకుండా, ఓ కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు  ప్రచారం జరుగుతోంది. రాజు సభకు వస్తే.. ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని, ఫలితంగా భీమవరానికి చెడ్డ పేరు వస్తుందంటూ సదరు కేంద్ర మంత్రి, స్థానిక నేతలతో చెప్పినట్లు సమాచారం.