పొన్నం ప్రభాకర్ ఎక్కడ? గులాబీ గూటికి చేరనున్నారా? 

తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. హుజురాబాద్ కేంద్రంగానే అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పోటాపోటీ ఎత్తులు వేస్తున్నాయి. దీంతో నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల కాలంలో బీజేపీలోకి ఎక్కువ జంపింగులు కనిపించాయి. కాని ప్రస్తుతం సీన్ మారిపోయింది. గులాబీ బాస్ దూకుడు పెంచడంతో అధికార పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. హుజారాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కారెక్కగా.. ఆయనను ఏకంగా నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమించి అందరిని ఆశ్చర్యపరిచారు కేసీఆర్. టీటీడీపీ అధ్యక్షుడు రమణ కూడా గులాబీ కుండువా కప్పేసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కమలానికి కటీఫ్ చెప్పి కారెక్కారు. సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా రేపోమాపో అధికార పార్టీకి జై కొట్టబోతున్నారు.

కేసీఆర్ వ్యూహాలతో విపక్షాలు డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. ఇదే అదనకుగా మరిన్ని అస్త్రాలను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండే నేతలకు గాలం వేస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వరుస కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి జనంలోకి వెళుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అప్పుడే ఆయనపై అసమ్మతి పెరిగిపోయిందని సమాచారం. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ముందుకు వెళుతున్నారని కొందరు సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవలే గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ కార్యక్రమాల ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగిందని చెబుతున్నారు. రేవంత్ తీరు నచ్చక సైలెంటుగా ఉంటున్నవారిలో పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా యాక్టివ్ గానే ఉన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. నిజానికి కాంగ్రెస్ నేతలంతా మౌనంగా ఉన్నా పొన్నం మాత్రమే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండేవారు. నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు. కాని రేవంత్ కు పగ్గాలు వచ్చిన తర్వాత ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు కూడా బలంగా వాయిస్ వినిపించిన పొన్నం... ఇప్పుడు కొంత బూస్ట్ వచ్చినట్లు ఉన్నా ఎందుకు యాక్టివ్ గా ఉండటం లేదన్నది ఆసక్తిగా మారింది. గత రెండు, మూడు వారాలుగా పొన్నం ప్రభాకర్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా పోయింది. దీంతో పొన్నం కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా అన్న చర్చ మొదలైంది. 

పొన్నం ప్రభాకర్ బీసీ నేతగా కాంగ్రెస్ లో కీలక పదవులు దక్కించుకున్నారు. దివంగత వైఎస్సార్ కు సన్నిహితుడిగా పేరున్న పొన్నం.. 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. పార్టీలోని మరో బలమైన బీసీ నేత మధుయాష్కి గౌడ్ తో మొదటి నుంచి విభేదాలున్నాయి. పొన్నం వైఎస్సార్ వర్గంలో ఉండగా.. యాష్కి మాత్రం వైఎస్ వ్యతిరేక వర్గంలో ఉన్నారు. ప్రస్తుత కమిటీలో  పొన్నంకు ఏ పదవి రాకపోగా.. మధుయాష్కికి మాత్రం ప్రచార కమిటి చైర్మన్ పోస్టు దక్కింది.రేవంత్ రెడ్డితోనూ పొన్నంకు సఖ్యత లేదంటారు. అదే సమయంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీమ్ లో మధుయాష్కీనే కీ పర్సన్ అయ్యారు. రేవంత్ కూడా ఆయనతో కలిసే కార్యక్రమాలు చేస్తున్నారు.  దీంతో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న పొన్నం.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన గులాబీ లీడర్లు..పొన్నంతో మాట్లాడి కారు పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని తెలుస్తోంది. 

పొన్నం కూడా మంత్రి కేటీఆర్ తో రెండు సార్లు చర్చించారని చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్  ఆహ్వానానికి  సానుకూలంగానే స్పందించారని చెబుతున్నారు. త్వరలోనే పొన్నం కారు పార్టీ గూటికి చేరవచ్చని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు కూడా చెబుతున్నాయి. టీఆర్ఎస్ నేతలైతే పొన్నం గులాబీ గూటికి చేరడం ఖాయమంటున్నారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ లోక్ సభ పరిధిలోనే ఉంది. కరీంనగర్ ఎంపీగా పని చేసిన పొన్నంకు హుజురాబాద్ తోనూ మంచి సంబంధాలున్నాయి. ఉప ఎన్నికలో ఇది తమకు కలిసివస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పొన్నం ప్రభాకర్ అభ్యర్థి అయినా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది. బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఈటలను ఎదుర్కొవడానికి మరో బలమైన బీసీ నేత బాగుంటుందనే యోచనలో గులాబీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.  మొత్తానికి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో అదో కీలక పరిణామంగా మారుతుందని  రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.