చిరంజీవి సరే... పవన్ మాటేమిటి?

బీజేపీ వ్యూహాలేమిటి? పవన్ కల్యాణ్ తో ఆ పార్టీ మైత్రి కొనసాగుతోందా? లేక అప్రకటిత తెగదెంపులు అయిపోయాయా? అన్న ప్రశ్నలకు అలాగే కనబడుతోంది అన్న జవాబే వస్తుంది. ఎందుకంటే ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి ఆహానం అందింది. మరి పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తుంటే.. బహిరంగ సభ నిర్వహిస్తుంటే.. అదీ ప్రభుత్వ కార్యక్రమం అయినా మిత్ర పక్ష అధినేతకు ఆహ్వానం అందక పోవడమేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవం వేడుకలలో భాగంగా  అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే జూలై 24న భీమవరంగా అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికే కేంద్ర ప్రభుత్వం తరఫున మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది.

అయితే ఇక్కడే రాజకీయ పరిశీలకులు తమ విశ్లేషణలకు పని చెబుతున్నారు. రాజకీయాలకు దూరంగా సినీమాలకు పరిమితమైన చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపడంలో ఆంతర్యమేమిటి? రాజకీయాలలో క్రియాశీలంగా ఉండటమే కాకుండా.. బీజేపీతో పొత్తు ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆహ్వానం పంపకపోవడమేమిటి? దీని వెనుక రాజకీయమేమి? అంటూ సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించినట్లైతే బీజేపీకి ఇప్పుడు పవన్ కల్యాణ్ కన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ మంచి మిత్రుడుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం తానా అంటే తానా, తందానా అంటే తందానా అనే జగన్ ను దూరం పెట్టి.. పొత్తుల విషయం సహా ఏపీ ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో కూడా తన మాటే వినాలని పట్టుబట్టే పవన్ ను దగ్గరకు తీసుకోవడం వల్ల రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని కమలనాథులు భావిస్తున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కనుక పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తే ఇదే కార్యక్రమంలో పాల్గొనే ఏపీ సీఎం జగన్ కు ఇబ్బంది అవుతుందనే కారణం కూడా ఒకటి చెబుతున్నప్పటికీ, అధికార, విపక్ష నేతలు ఒకే కార్యక్రమంలో వేదిక పంచుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. పైగా ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాజకీయాలను జొప్పించడం భావ్యం కాదు.

కానీ బీజేపీ మాత్రం ఈ కార్యక్రమాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసమే ఉపయోగించుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు కోసం చిరంజీవిని ఆహ్వానించందనీ, జగన్ ను సంతోష పెట్టడం కోసం పవన్ కల్యాణ్ ను దూరం పెట్టిందనీ,  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా  ఒకే ఒక్క చర్య ద్వారా అటు జగన్ ను, ఇటు కాపు సామాజిక వర్గాన్నీ, అటు జగన్ ను ప్రసన్నం చేసుకోవచ్చన్నదే మోడీ సభకు చిరంజీవికి ఆహ్వానం పంపి, పవన్ కల్యాణ్ ను దూరం పెట్టడం అని విశ్లేషకులు చెబుతున్నారు.