స్నేహం బెడిసికొట్టి 'దాదాగిరీ' దాకా ఎందుకొచ్చింది?

హాలియా సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు యథాలాపంగా మాట్లాడినవేనా? లేక అంతరార్థం వేరే ఉందా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా నడుస్తోంది. కృష్ణా నది మీద అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని, అందువల్ల తెలంగాణకు మళ్లీ నీళ్ల గోస తప్పదని కేసీఆర్ పాత రికార్డును బయటికి లాగుతుండడం కొందరిలో ఆసక్తిని, మరికొందరిలో ఆందోళనను రేకెత్తిస్తోంది. కేసీఆర్ మాటలను తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల మేధావులను ఆలోచనలో పడేస్తోంది. అదే సమయంలో కేంద్రం ఎజెండాలో ఉన్న నదుల అనుసంధానం అనే భవిష్యత్ ప్రణాళికకు కూడా గండి కొట్టడం ఖాయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో ఆంధ్రా-తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య వెల్లివిరిసిన స్నేహం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. వాస్తవానికి వారి స్నేహబంధం కావాల్సింది ఇప్పుడే అయినా.. ఇప్పుడలాంటి ఛాయలేవీ కనిపించడం లేదన్న బెంగ జలరంగ నిపుణుల్లో కనిపిస్తోంది. రాయలసీమకు నీళ్లిచ్చి రతనాలసీమగా చేస్తానన్న కేసీఆర్.. అందుకు బాటలువేసే కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీకి తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో అధికారులను ఎందుకు హాజరు కానివ్వలేదన్న ప్రశ్న ఉదయిస్తోంది. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుచూపు లేని వైఖరి కూడా అత్యంత నష్టదాయకంగా భావిస్తున్నారు. భౌగోళికంగా ఎగువనున్న తెలంగాణకు సహజంగానే గోదావరి అయినా, కృష్ణా  నీటిని అయినా వాడుకునే అవకాశాలు ఎక్కువుంటాయి. ఆ అవకాశాలనే ఇప్పుడు తెలంగాణ ఉపయోగించుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కేసీఆర్ అందించిన స్నేహ హస్తాన్ని జగన్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడమే సమస్య పీటముడి పడటానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కేంద్రం జోక్యంతో ప్రమేయం లేకుండా రెండు రాష్ట్రాలూ (మహారాష్ట్రతో కలిపి 3) కలిసి సెటిల్ చేసుకుందామంటూ కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను జగన్ వాడుకోలేక.. తాను చిక్కుకున్న వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడటానికే కేంద్రం ముందు మోకరిల్లారని, అందుకే జగన్ లేఖ రాసిందే తడవు కేఆర్ఎంబీ మీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ దాని నిర్వహణ, నియంత్రణ, కాపలా వంటి కీలకమైన అన్ని అంశాలను కేంద్రం లాక్కుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే తెలంగాణ ప్రభుత్వం మొండివైఖరి అవలంబించేది కాదన్న వాదనలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. 

కృష్ణా నది నీటి విషయంలో జగన్ అనుసరించబోయే వైఖరిని పసిగట్టిన కేసీఆర్ తనకు నమ్మకస్తుడైన ఓ మంత్రి సూచనను వెంటనే ఇంప్లిమెంట్ చేశారని, అందువల్లే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిసినా ఇటీవల జలవిద్యుత్ చేపట్టారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.  అయితే కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో తెలంగాణ సర్కారు పవర్ జనరేషన్ నిలిపివేసినా.. రెండు నదుల సమన్వయ కమిటీ భేటీకి సహకరించడం లేదని వారంటున్నారు. వచ్చే అక్టోబర్ లో గెజిట్ నోటిఫికేషన్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చి కృష్ణా-గోదావరి నదుల సమస్త వ్యవహారాలు నేరుగా కేంద్రం అజమాయిషీలోకి వెళ్తాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని భావిస్తున్న కేసీఆర్.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ తో రగిలిపోతున్నారు. అందుకే ఎప్పుడూ లేంది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ నీటివాటా కావాలని, నది పరీవాహ ప్రాంతాన్ని అనుసరించి వాటాలు తేల్చాలని.. ఇలా కొత్తకొత్త మెలికలు పెడుతున్నారు. ఈ వైఖరితో రెండు రాష్ట్రాల మధ్య రానున్న రోజుల్లో సయోధ్య కష్టమేనంటున్నారు జలరంగ నిపుణులు. అయితే ఈ విషయం కేంద్రం కోర్టులో పడటానికి జగనే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కేంద్రం ఈ రెండు రాష్ట్రాల నీటివాటాలను ఎలా భాగిస్తుందో చూడాలి.