దళిత బంధు లేదు.. విపక్షాలు ప్రశ్నించవు! కేసీఆర్ కోరుకున్నదే జరుగుతోందా?

తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంత దూకుడుగా విపక్షాలు పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ పాలిటిక్స్ చేస్తోంది. అధికార పార్టీగా ఉండి కూడా  ప్రతిపక్షాలకు పోటీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  ప్రగతి భవన్ , ఫామ్ హౌజ్ నుంచి బయటికి రారనే విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ సైతం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కు వచ్చారు. ఏకంగా ధర్నాలో పాల్గొన్నారు. దీంతో విపక్షాల ట్రాప్ కేసీఆర్ పడ్డారని కొందరు వాదిస్తుండగా.. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆరే తన ఎత్తులతో విపక్షాలను తన ఉచ్చులో పడేశారనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. దళిత బంధు పథకాన్ని సైడ్ ట్రాక్ చేసేందుకు కేసీఆర్ పన్నిన వ్యూహంలో విపక్షాలు చిక్కుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

దళిత బంధు... హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త పథకం. దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించే స్కీమ్ అది. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో చేపట్టిన ప్రభుత్వం.. ఆ నియోజకవర్గంలోని దాదాపు 20 వేల కుటుంబాలను ఎంపిక చేసింది. వాళ్ల అకౌంట్లలో 10 లక్షల రూపాయల జమ చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు ఈ పథకాన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు పేరుతో డ్రామా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. హుజురాబాద్ లో దాదాపు 45 వేల దళిత ఓటర్లు ఉండటంతో.. వాళ్ల ఓట్లను గంపగుత్తగా కొట్టేసేందుకే ఈ స్కీమ్ తెచ్చారనే విమర్శలు వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం దళిత బంధు హుజురాబాద్ కే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలను ఉన్నాయని.. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతేకాదు దళిత ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని ప్రకటించారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక కారణంగా  కొన్ని రోజుల పాటు దళిత బంధు అమలును ఎన్నికల సంఘం ఆపేసింది. దీంతో ఎన్నికల సంఘంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కేసీఆర్. దళిత బంధును ఆపేశారంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం నవంబర్ 4వరకు మాత్రమే పథకాన్ని ఆపగలదని, తర్వాత దళిత బంధు ఇవ్వకుండా ఎవరూ బ్రేకులు వేస్తారని సవాల్ చేశారు. నవంబర్ 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేస్తామని తెలిపారు. హుజురాబాద్ తో పాటు ఖమ్మం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, జుక్కల్ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితులందరికి 10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

అయితే నవంబర్ 4వ తారీఖు ముగిసి నాలుగు వారాలు కావొస్తొంది. కాని దళిత బంధు ఊసే ఎత్తడం లేదు కేసీఆర్ సర్కార్. నవంబర్ 4 తర్వాత పథకం అమలు కాకుండా ఎవరూ ఆపుతారే చూస్తానంటూ ప్రకటనలు చేసిన కేసీఆరే.. స్కీమ్ ను పట్టించుకోవడం మానేశారు. రోజులు గడుస్తున్నా దళిత బంధుపై ముందడుగు పడకపోవడంతో దళితులు ఆగ్రహంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూ పంపిణి లాగే దళిత బంధు పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అటకెక్కించదనే విమర్శలు వస్తున్నాయి. ఇంతటి తీవ్రమైన అంశంపై విపక్షాలు సైలెంటుగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. విపక్షాలను దళిత బంధు నుంచి సీఎం కేసీఆరే సైడ్ ట్రాక్ చేశారని అంటున్నారు. ్ందుకే వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారని, విపక్షాలు కూడా అన్న వదిలేసి వరి ధాన్యం కేంద్రంగానే ఉద్యమం చేస్తున్నాయని చెబుతున్నారు. అలా దళిత బంధు గురించి విపక్షాలు మాట్లాడకుండా కేసీఆర్ తనదైన శైలిలో సైడ్ చేశారని అంటున్నారు.

నిజానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వరిని కేంద్రమే కొంటుంది. కాని ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణకే ఎందుకు వచ్చిందన్నది ప్రశ్నగా మారింది. యాసంగిలో ఎంత పంట కొంటామన్న విషయాన్ని కేంద్రం ఎప్పుడైనా డిసెంబర్ లోనే చెబుతుంది. కాని కేసీఆర్ మాత్రం తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందనే వాదన తెచ్చారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందనే కవరింగ్ ఇచ్చారు. వరి కొనుగోలు చేయబోమంటూ కేసీఆర్ ప్రకటించడం... అదే పట్టుకుని విపక్షాలు రోడ్డెక్కడం జరిగిపోయాయి. దీంతో దళిత బంధు అంశం మరుగున పడిపోయింది. కేసీఆర్ ప్రకటించిన నవంబర్ 4 వెళ్లి నాలుగు వారాలవుతున్నా.. దాని గురించి ప్రశ్నించేవారే లేకుండా పోయారు. కేసీఆర్ కూడా ఇదే కోరుకున్నారని, అంతా ఆయన అనుకున్నట్లే జరిగిపోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా తన వ్యూహాలతో విపక్షాలను కేసీఆర్ తన ట్రాప్ పడేశారని, దళిత బంధును అటకెక్కిస్తున్నారని అంటున్నారు.